నామినేషన్‌ వేళ జాగ్రత్త.. జాగ్రత్త..

ABN , First Publish Date - 2021-04-17T06:03:25+05:30 IST

జీడబ్ల్యుఎంసీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసే అభ్యర్థులు అత్యంత జాగ్రత్తతో నామినేషన్‌ పత్రాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా తేడా వస్తే అసలుకే ఎసరయ్యే ప్రమాదం ఉంది.

నామినేషన్‌ వేళ జాగ్రత్త.. జాగ్రత్త..

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
గ్రేటర్‌లో ఓటరైతే చాలు.. ఏ డివిజన్‌లోనైనా పోటీ చేయొచ్చు

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 16:
జీడబ్ల్యుఎంసీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసే అభ్యర్థులు అత్యంత జాగ్రత్తతో నామినేషన్‌ పత్రాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా తేడా వస్తే అసలుకే ఎసరయ్యే ప్రమాదం ఉంది. నామినేషన్‌ పత్రంలో పొందుపరిచిన సమాచారంలో ఏమాత్రం తప్పులు దొర్లినా, తప్పుగా పొందుపరిచిన నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.  ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేశారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో ఓటరైతే చాలు.. 66 డివిజన్లలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే అభ్యర్థిని బలపరిచే ఇద్దరు వ్యక్తులు మాత్రం పోటీ చేసే డివిజన్‌లో నివాసితులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 నామినేషన్‌ పత్రాలతో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.5వేలు డిపాజిట్‌ చేయాలి. ఈ మొత్తాన్ని నగదు రూపంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు చెల్లించవచ్చు.

నామినేషన్‌ పత్రం 6 విభాగాలు(పార్ట్‌లు)గా ఉంది. మొదటి పార్ట్‌లో డివిజన్‌ నెంబర్‌తో పాటు ఆ డివిజన్‌కు సంబంధించిన రిజర్వేషన్‌తో పాటు అభ్యర్థి పూర్తి పేరు, తండ్రి పేరు, చిరునామాతో పాటు వృత్తి వివరాలు పొందుపరచాలి. పార్ట్‌-2లో అభ్యర్థి వయస్సు, పార్టీ తరఫునా లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారా.. తదితర అంశాలపై డిక్లరేషన్‌ ఇవ్వాలి. పార్ట్‌-3లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వారి కులానికి సంబంధించిన అధికారిక డిక్లరేషన్‌ పొందుపరచాలి. పార్ట్‌-4లో అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని స్వీకరించినట్లు రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ చేయాల్సి ఉంది. పార్ట్‌-5లో అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని ఏ ప్రాతిపదికన తిరస్కరించారో తెలియజేసే అంశం ఉంటుంది. పార్ట్‌-6లో నామినేషన్‌పత్రాల స్వీకరణ, స్కృటినీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాగా, నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ ఆఫీసర్ల వద్ద ఉచితంగా పొందవచ్చు. నగరంలోని ఎల్‌బి, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలల్లో డివిజన్ల వారీగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటుచేసిన విషయం విదితమే.

Updated Date - 2021-04-17T06:03:25+05:30 IST