Hyderabad ప్రజలారా బీ అలెర్ట్... మరో ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-09-05T16:14:29+05:30 IST

శుక్రవారం అర్ధరాత్రి మొదలైన వర్షం శనివారం రాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల...

Hyderabad ప్రజలారా బీ అలెర్ట్... మరో ఐదు రోజుల పాటు అతి భారీ వర్షాలు

  • మూడో రోజూ దంచికొట్టింది
  • రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి నీరు
  • వణికిపోతున్న శివారు, లోతట్టు ప్రాంతవాసులు
  • రోడ్లపై వాహనదారుల నరకయాతన
  • మూసీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ : నగరాన్ని వాన వీడటం లేదు. వరుసగా మూడో రోజూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల మోకాలి వరకు వరద పోటెత్తింది. శనివారం నగరంలో ఉదయం నుంచే చల్లని వాతావరణం కనిపించింది. పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి మొదలైన వర్షం శనివారం రాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మెహిదీపట్నం, లంగర్‌హౌజ్‌, కార్వాన్‌, గొల్కొండ, నల్లకుంట, అంబర్‌పేట్‌, మీర్‌పేట్‌,  గోల్నాక, కాచిగూడ, బీఎన్‌రెడ్డినగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, ఆబిడ్స్‌లలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో సైదాబాద్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, అల్వాల్‌, ఉప్పల్‌, కాప్రా, చార్మినార్‌, రాంచంద్రాపురంమండలాలతోపాటు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, మూసాపేట, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


నిర్వహణలో నిర్లక్ష్యం..

గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో రక్షణ చర్యలు లేకుండా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన భారీవర్షానికి ఇందిరానగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ పక్కకు ఒరిగిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మాదాపూర్‌, అల్లాపూర్‌, కొండాపూర్‌, అయ్యప్పసొసైటీ, చంద్రనాయక్‌ తండా, బోరబండ, బేగంబజార్‌ వంటి ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ సరిగా లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.


భారీ వర్షంతో లింగంపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జి కింద బర్కత్‌పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. - చందానగర్‌, ఆంధ్రజ్యోతి


ఫిర్యాదుల వెల్లువ

భారీ వర్షాలతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమయ్యింది. నగరంలోని వివిధ ప్రాంతాలను ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్లపై నిలిచిన నీళ్లను తొలగించారు. కంట్రోల్‌ రూంకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 21 ఫిర్యాదులు రాగా, 19 సమస్యలను సత్వరమే పరిష్కరించారు.


మూసారాం బ్రిడ్జిపైకి భారీగా నీరు

మలక్‌పేటలో 29.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలైన మూసారాంబాగ్‌ బ్రిడ్జి, తీగలగూడ, ఓల్డ్‌మలక్‌పేట మున్సిపల్‌ కాలనీ, పోచమ్మ దేవాలయం, వాహేద్‌నగర్‌ ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.  ముసారాంబాగ్‌ బ్రిడ్జిపై భారీగా వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ సిబ్బంది రంగంలోకి దిగి వరద నీరు తరలించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.


భారీగా ట్రాఫిక్ జామ్..

భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుతోంది. శనివారం మూసీపరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మూడు రోజులుగా సాయంత్రం వేళలో భారీ వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆగకుండా వర్షం కురుస్తోండటంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో ఐదు రోజుల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


నరకయాత.. 

ఆజంపుర ఆర్‌యూబీలోకి వరదనీరు చేరడంతో వాహనాలు రాకపోకలు సాగించడానికి వీలులేకపోయింది. జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 డీసీ రజినీకాంత్‌రెడ్డి మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపి వరద నీరు తరలించేందుకు చర్యలు చేపట్టారు. గోల్నాక చౌరస్తా నలువైపులా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అలీకేఫ్‌ చౌరస్తా నుంచి గోల్నాక కొత్త బ్రిడ్జి వరకు, మూసారాంబాగ్‌ నుంచి  వచ్చే వాహనాలు, చాదర్‌ఘాట్‌ నుంచి  దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే వాహనాలు, అలీకేఫ్‌ చౌరస్తా ద్వారా ఉప్పల్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. గంటకు పైగా వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవించారు.


నీట మునిగిన బస్తీలు.. 

గోల్నాక డివిజన్‌లోని పలు బస్తీలు జలమయమయ్యాయి. భారీగా వరదనీరు చేరింది. ఇళ్లలోని వస్తువు లు తడిసిపోయాయి. తులసీరాంనగర్‌(లంక) బస్తీలోని అన్ని వీధులు జలమయంగా మారాయి. మారుతీనగర్‌, గంగానగర్‌, న్యూగంగానగర్‌, శంకర్‌నగర్‌, కమలానగర్‌, దుర్గానగర్‌, అన్నపూర్ణనగర్‌, కృష్ణానగర్‌, శాస్ర్తీనగర్‌, సుందర్‌నగర్‌, కామ్‌గార్‌నగర్‌ బస్తీల్లో వర్షపునీరు ఏరులై పారింది. డ్రైనేజీలు పొంగి,  మరోవైపు వర్షపునీటి ప్రవాహంతో  ప్రజలు ఇబ్బందులు పడ్డారు.


గండిపేట ఫుల్‌..

గండిపేట జలాశయం పూర్తిగా నిండటంతో శనివారం నాలుగు గేట్లు తెరిచి నీటిని దిగువన మూసీ నదిలోకి వదిలిపెట్టారు.  భారీ వర్షాలతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలాశయం నీటి మట్టం 1788.88కు చేరింది. పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, దాదాపు నిండటంతో ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌ గౌడ్‌ ప్రత్యేక పూజలు చేసి నాలుగు గేట్లు తెరిచారు.  గండిపేటకు ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు వస్తోంది. నాలుగు గేట్ల ద్వారా 400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నట్లు జలమండలి జీఎం రామకృష్ణ తెలిపారు. ఇన్‌ఫ్లో పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తుతామని ఆయన పేర్కొన్నారు. 2010 తర్వాత ఈ ఏడాదే రెండుసార్లు గేట్లు ఎత్తారు.  ఈ ఏడాది జూలైలో ఓ సారి గేట్లు ఎత్తారు. అయితే, జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్‌సాగర్‌ గేట్లు రెండుసార్లు  ఎత్తే అవకాశం ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌ గౌడ్‌కి దొరికింది. జలశయాల చరిత్రలో ఇంత వరకు ఎవరూ రెండు సార్లు  గేట్లు ఎత్తలేదు.



Updated Date - 2021-09-05T16:14:29+05:30 IST