Be Careful : ఇలా వల వేస్తారు.. వేలల్లో లాభం చూపి లక్షల్లో కొట్టేస్తారు.. అత్యాశకు పోయారో అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త..!

ABN , First Publish Date - 2022-05-19T14:55:51+05:30 IST

సెల్‌ఫోన్‌.. ఆన్‌లైన్‌లోనే సర్వం దోచేస్తున్నారు. నిత్యం ఏదో రూపంలో సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.

Be Careful : ఇలా వల వేస్తారు.. వేలల్లో లాభం చూపి లక్షల్లో కొట్టేస్తారు.. అత్యాశకు పోయారో అంతే సంగతులు.. తస్మాత్ జాగ్రత్త..!

  • దడ పుట్టిస్తున్న  సైబర్‌ నేరగాళ్లు
  • తాజాగా క్రిప్టో కరెన్సీ పేరుతో వల
  • సైబర్‌క్రైంలో పెరుగుతున్న ఫిర్యాదులు

సెల్‌ఫోన్‌.. ఆన్‌లైన్‌లోనే సర్వం దోచేస్తున్నారు. నిత్యం ఏదో రూపంలో సైబర్‌ నేరగాళ్లు (Cyber) పంజా విసురుతున్నారు. రోజుకో తరహా మోసాలు (Fraud) వెలుగులోకి వస్తున్నా, పోలీసులు అప్రమత్తం చేస్తున్నా అధిక లాభాల మోజులో పడి కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్లు క్రిప్టో కరెన్సీ పేరుతో దోచుకుంటున్నారు. బిట్‌కాయిన్‌ మోజులో పడి పలువురు సమర్పించుకుంటున్నారు. తాజాగా క్రిప్టో ట్రేడింగ్‌ (Crypto Trading) పేరుతో రూ. 40 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులను బుధవారం ఆశ్రయించాడు.


హైదరాబాద్‌ సిటీ : కొన్ని నెలలుగా సైబర్‌క్రైమ్‌లో క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాలపై కేసులు నమోదవుతున్నాయి. బిట్‌కాయిన్‌, క్రిప్టోకరెన్సీ అర్థం వచ్చేలా వాట్సాప్‌ (Whatsapp) గ్రూప్‌ తయారు చేస్తున్న మోసగాళ్లు నగరానికి చెందిన వారి ఫోన్‌ నెంబర్లను అందులో చేరుస్తున్నారు. లాభాలు అధికంగా వస్తాయంటూ గ్రూపులో శిక్షణ ప్రారంభిస్తారు. తాము రూ. కోట్లలో సంపాదిస్తున్నామని నకిలీ ఆధారాలు పోస్టు చేస్తుంటారు. ఆ గ్రూపులో ఉన్న అమాయకులు నిజమని నమ్మి ఆసక్తి చూపుతారు. శిక్షణ నిమిత్తం కొంత తీసుకుని ఆ తర్వాత పర్సనల్‌ వాట్సా్‌పకు ఓ లింకును పంపిస్తారు. 


లింక్‌ ఓపెన్‌ చేసి బిట్‌కాయిన్‌లు (Bit Coins) కొనుగోలు చేయవచ్చని చెబుతారు. అంతా అనుకూలిస్తే రోజుల వ్యవధిలోనే పెట్టుబడికి 10 రెట్లు సంపాదించవచ్చని ఆశ చూపుతారు. భారీ లాభాలు వచ్చినట్లు అంకెల్లో (ఆన్‌లైన్‌లో) చూపుతారు. అది నమ్మినవారు రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు పెట్టి చివరకు లక్షలు పోగొట్టుకుంటున్నారు. లాభాలను డ్రా చేసుకుందామని ప్రయత్నాలు చేసే సమయంలో మోసం వెలుగులోకి వస్తోంది. ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్‌ల కొనుగోలుకు ఏజెంట్లుగా, బ్రోకర్లుగా పరిచయం చేసుకుంటున్న సైబర్‌ నేరగరాళ్లు తొలుత బైనాన్స్‌, విజ్‌రిక్స్‌ అనే వెబ్‌సైట్లతో ఆన్‌లైన్‌లో బిట్‌కాయిన్స్‌ పంపించి.. ఎక్కువ డబ్బు రాగానే దుకాణం మూసేస్తున్నారు. ఇలా మోసపోయిన బాధితులు నగరంలోనే వందల సంఖ్యలో ఉన్నారు.


నాగరాజు అరెస్టు అయినా..

బిట్‌కాయిన్‌ పేరిట తెలంగాణతో (Telangana) పాటు దేశవ్యాప్తంగా వేల మందిని మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు సిరిమల్ల నాగరాజును సరిగ్గా ఏడాదిన్నర క్రితం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. బిట్‌కాయిన్‌ పేరిట ఆన్‌లైన్‌ దందాకు నాగరాజు తెలంగాణ రీజియన్‌కు హెడ్‌గా వ్యవహరించేవాడు. ప్రత్యేకంగా తయారు చేసిన వెబ్‌సైట్ల ద్వారా జనం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే 18 వారాల్లో అధిక లాభాలతో తిరిగి చెల్లిస్తానని నమ్మించి పలువురిని నట్టేట ముంచాడు. బైనరీ పద్ధతి (గొలుసు స్కీము)లో  దేశవ్యాప్తంగా సుమారు 1200 మంది నుంచి రూ. 52 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడి ఉంటాడని అప్పట్లోనే పోలీసులు గుర్తించారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 250 మంది బాధితుల నుంచి రూ. 10కోట్ల వరకు వసూలు చేశాడు. 


నాగరాజు మరి కొందరు కలిసి రాస్‌నె‌ఫ్ట్‌హెడ్జ్‌ఫండ్‌. రు, ఆర్‌హెచ్‌ఎఫ్‌కాయిన్‌.కామ్‌, ఆర్‌హెచ్‌ఎఫ్‌గోల్డ్‌.కామ్‌, యూరె‌స్‌కాయిన్‌.కామ్‌ పేరిట నాలుగు వెబ్‌సైట్లు (Web Sites) సృష్టించి ఆన్‌లైన్‌ బిట్‌కాయిన్‌ దందా ప్రారంభించి దేశవ్యాప్తంగా దోపిడీకి పాల్పడ్డారు. నాగరాజు అరెస్టు అయినా దందా ఆగలేదు. ఆ తర్వాత రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) సిలిగురికు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన నీల్‌ పటేల్‌ అనే వ్యాపారి కూడా దేశంలోని ప్రధాన నగరాలకు చెందిన 300 మందిని మోసం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. అతడిపై హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగళూరు, చెన్నయ్‌, కోల్‌కతా, ఢిల్లీల్లోనూ (Delhi) కేసులు నమోదయ్యాయి. ఈ ఉదంతం తర్వాతా నేరగాళ్ల బారిన పడి బాధితులు రూ. లక్షలు కోల్పోయి లబోదిబోమంటున్నారు.


అధిక లాభాలంటూ రూ. 40 లక్షలు స్వాహా

క్రిప్టో మైనింగ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ ఓ ఆర్కిటెక్ట్‌ను నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు రూ. 40.13 లక్షలు కొల్లగొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేటకు చెందిన రాజు (పేరు మార్చాం) ఆర్కిటెక్ట్‌. కొన్ని నెలల క్రితం నుయూ నదియా పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. రోనాల్డ్‌ క్రాఫర్డ్‌ అనే మరో వ్యక్తి టెలీగ్రామ్‌లో లైన్‌లోకి వచ్చి బిట్‌ ఆప్షన్స్‌ ఎఫ్‌ఎక్స్‌ గురించి చెప్పాడు. దీని ద్వారా క్రిప్టో మైనింగ్‌లో పెట్టుబడులు పెడితే ఊహించని లాభాలు వస్తాయని నమ్మించాడు. నమ్మిన రాజు ముందు తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. 


ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించారు. మధ్య మధ్యలో మరియా, లుకాస్‌ జేమ్స్‌ అనే మరికొంత మంది లైన్‌లోకి వచ్చి రాజును మరింత ప్రోత్సహిస్తున్నట్లు నటించారు. వర్చువల్‌గా భారీ లాభాలు కనిపిస్తుండటంతో రాజు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాడు. అలా 2021 డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ. 40,13,105లు పెట్టుబడులు పెట్టారు. వాటిని విత్‌ డ్రా (Withdraw) చేసుకోవడానికి ప్రయత్నించగా, అందుకు మరిన్ని డబ్బులు చెల్లించాలని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేశారు. ఇదంతా మోసమని భావించిన బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం (Cyber Crime) పోలీసులను ఆశ్రయించాడు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


పెరుగుతున్న సైబర్‌ క్రైమ్‌ : డీజీపీ

రోజురోజుకూ పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగానే దేశ వ్యాప్తంగా సైబర్‌ నేరాలు అధికమవుతున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌ క్రైమ్‌ యూనిట్ల ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా జరిగే ఆర్థిక నేరాలకు సంబంధించిన అంశాలపై పోలీసు విభాగం చేపట్టిన కేస్‌ స్టడీల ఆధారంగా అక్షరీకరించిన ‘‘సోషల్‌ ఇంజినీరింగ్‌ క్రైమ్స్‌’’ పుస్తకాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి (DGP Mahender Reddy) గురువారం ఆవిష్కరించారు.  ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఒకరిని సైబర్‌ వారియర్‌గా నియమించినట్టు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే నేరాలపై సమగ్ర అధ్యయనం పుస్తకంలో కనిపిస్తుందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 17 రకాల సోషల్‌ మీడియా నేరాలను గుర్తించినట్టు తెలిపారు. పుస్తకం చివరన, సామాజిక మాధ్యమాల్లో జరిగే నేరాలకు ఎలా ఫిర్యాదు చేయాలన్న అంశం పేర్కొన్నట్టు డీజీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీజీ గోవింద్‌ సింగ్‌, ఐజీలు రాజేష్‌ కుమార్‌, కమల్‌హాసన్‌రెడ్డి, ఐటీ విభాగం డీఎస్పీ శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T14:55:51+05:30 IST