Advertisement
Advertisement
Abn logo
Advertisement

Be Alert : బాబోయ్.. ఇలా కూడా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త..

  • నకిలీలున్నాయ్‌ జాగ్రత్త
  • కాల్‌ సెంటర్లు, యాప్‌లు.. 
  • ఆన్‌లైన్‌ దొంగల హల్‌చల్‌

హైదరాబాద్‌ సిటీ : వెబ్‌సైట్లు, యాప్‌ల్లోకి చొచ్చుకొస్తున్న నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నా కొత్త కొత్త మార్గాల్లో దోచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన 14 మంది సైబర్‌ కేటుగాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌లు-3, స్మార్ట్‌ఫోన్‌లు-17, బేసిక్‌ ఫోన్‌లు-20, సిమ్‌కార్డులు-5, ఏటీఎం కార్డులు-3 స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర గురువారం కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అక్టోబర్‌10న రాజేంద్రనగర్‌ నార్సింగ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఫోన్‌ వచ్చింది.


సీపీ ప్రత్యేక దృష్టి..

‘ధ లోన్‌ బజార్‌ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఆన్‌లైన్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీకు రూ.5 లక్షల రుణం మంజూరు అయింది. అయితే ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్‌టీ, ఇన్సూరెన్స్‌ చార్జీలు చెల్లించాలి’ అంటూ రూ. 2.17 లక్షలు విడతల వారీగా ఖాతాల్లో వేయించుకున్నారు. అయినా లోన్‌ డబ్బులు రాకపోవడంతో యాప్‌ నిర్వాహకులకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. మోసపోయానని భావించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వరుసగా ఇలాంటి ఫిర్యాదులు అందడంతో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌రెడ్డి బృందాన్ని రంగంలోకి దింపారు. డీసీపీ రోహిణి ప్రియదర్శిని, లావణ్య, ఏసీపీ శ్రీధర్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ బృందం టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరించింది. ఢిల్లీకి చెందిన నేరగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీకి వెళ్లిన ఆశి‌ష్‌రెడ్డి బృందం 15 రోజులు మకాం వేసింది. మోసాలకు పాల్పడుతున్న కాల్‌సెంటర్‌పై దాడిచేసి అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ న్యాయస్థానం అనుమతితో హైదరాబాద్‌కు తరలించింది. అనంతరం 14 మంది నిందితులను రిమాండుకు తరలించారు.

ఇలా మోసం చేస్తారు..

ఆన్‌లైన్‌ ద్వారా రుణాలను మంజూరు చేయడంలో ప్రాచుర్యం పొందిన యాప్‌ను పోలిన విధంగా బజార్‌లోన్‌, లోన్‌ ఇండియా, పైసాలోన్‌ హబ్‌, ముద్రాలోన్‌ ఫైనాన్స్‌ పేరుతో నకిలీ యాప్‌లు సృష్టించారు. అవి నిజమని నమ్మిన కొందరు వినియోగదారులు ఆన్‌లైన్‌ రుణం కోసం అప్లై చేసుకుంటున్నారు. అలా వచ్చిన దరఖాస్తుదారులకు ఫోన్‌లు చేసి, రుణం మంజూరు చేస్తున్నామని నమ్మించి వివిధ ఫీజుల పేరుతో లక్షల్లో దోచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకోసం ఢిల్లీకి చెందిన అభిషేక్‌ మిశ్రా ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, టెలీకాలర్స్‌ను నియమించుకొని అప్‌లోడ్‌ అయిన అప్లికేషన్ల ఆధారంగా ఫోన్‌లు చేసి రుణాలు ఇస్తున్నట్లు నమ్మించి లక్షల్లో దోచుకుంటున్నాడు. సైబరాబాద్‌ పరిధిలో ఇప్పటికే 27 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కేసుల్లో 14 మందిని నిందితులను కటకటాల్లోకి నెట్టారు.


55 మంది నుంచి రూ.5.5 లక్షల బురిడీ..

నకిలీ కాల్‌ సెంటర్‌ సృష్టించి అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన గోపీకృష్ణ వెంకటక్రిష్ణవాసు (32) చెన్నయ్‌లో పలు వైట్‌ కాలర్‌ మోసాలకు పాల్పడి అరెస్టు కావడంతో పాటు అతడిపై గతంలో చెన్నయ్‌ పోలీసులు పీడీయాక్టు కూడా నమోదు చేశారు. అక్కడ జైలు నుంచి విడుదలైన తర్వాత వాసు హైదరాబాద్‌కు చేరుకుని ఇక్కడ తిరుమలగిరిలో నివాసముంటున్నాడు. అతనితో పాటు చెన్నయ్‌కు చెందిన పాత నేరస్తుడు నటరాజన్‌ అరుముగం (36) కూడా తిరుమలగిరిలో నివాసముంటున్నాడు. ఇద్దరు నేరస్తులు కలిసి తిరుమలగిరి క్రాస్‌రోడ్స్‌ వద్ద ఓ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకున్నారు.


తక్కువ ప్రీమియంతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కార్డు, పెట్టుబడులపై అధికవడ్డీ ఇస్తామని అమాయకులను కాల్‌ చేసి బురిడీ కొట్టిస్తున్నారు. కాల్‌ సెంటర్‌ స్థాపించి మహిళా టెలీకాలర్లను నియమించుకున్నారు. ఫోన్‌లు చేసి వివిధ స్కీముల కింద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖాతాల్లో ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేవారు. బల్క్‌లో సిమ్‌కార్డులు తీసుకుని.. కస్టమర్ల నెంబర్లు సేకరించి పదే పదే కాల్‌ చేసి వారి వద్ద నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియం కట్టించేవారు. ఈ విధంగా మొత్తం 55 మందిని మోసం చేశారు. వీరిపై ఫిర్యాదులు రావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు.


నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా కొందరి నుంచి సుమారు రూ.5.5 లక్షలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నారు.  గతంలో తమిళనాడులో కూడా వాసు అనే నిందితుడు తమిళనాడులో నకిలీ కాల్‌ సెంటర్లు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 3 నకిలీ సర్టిఫికెట్ల కాపీలు, ఓ ఐపాడ్‌, రెండు కంప్యూటర్‌లు, ఓ ప్రింటర్‌, బాధితులకు సంబంధించి డబ్బులు చెల్లించిన స్టేట్‌మెంట్‌, 3 మొబైల్‌ ఫోన్‌లు, ఓ పేటీఎం యంత్రం, 20 సిమ్‌కార్డులు, 10 చిన్న ఫోన్‌లు, 3 చెక్‌ బుక్కులు, రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసిన సామగ్రిని తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement