బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరం

ABN , First Publish Date - 2020-11-30T07:06:53+05:30 IST

తిరుపతిలోని అంబేడ్కర్‌ భవన్‌లో బీసీల రాజకీయ నిర్మాణ సన్నాహక మేథోమదన సమావేశం జరిగింది.

బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరం
ఐక్యతను చాటుతున్న నాయకులు

బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు



తిరుపతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘బీసీల కోసం ఇక ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరం. తిరుపతి కేంద్రంగానే బీసీల రాజకీయ సమరభేరి మోగిస్తాం’ అని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.శంకర్రావు పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలోని అంబేడ్కర్‌ భవన్‌లో బీసీల రాజకీయ నిర్మాణ సన్నాహక మేథోమదన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌, దక్షిణ భారత పరిరక్షణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వినోద్‌కుమార్‌, లంబాడీ హక్కుల నేత దాసురాం నాయక్‌, బీసీ యువజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికుమార్‌ తదితరులతో కలిసి ప్రసంగించారు. బీసీలను అణిచివేయడంలో అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ‘ఓటు మనదే-సీటు మనదే’ అన్న నినాదంతో రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఉత్తర భారతదేశంలో బహుజనులే రాజకీయ అధికారం చేస్తున్నారని చెప్పారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బహుజనులకు అధికారం దక్కడం లేదని అసంతృప్తి చేశారు. త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీల రాజకీయ నిర్మాణ సదస్సులు నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు జ్ఞాన జగదీష్‌, నాయకులు నారాయణగౌడ్‌, ఆర్కే యాదవ్‌, నాగరాజు గౌడ్‌, గుర్రప్ప, వేణుగోపాల్‌, కిరణ్‌, మహేంద్రబాబు, మధు ఆచారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T07:06:53+05:30 IST