బిసిజి వ్యాక్సిన్‌తో ముప్పు తగ్గిందా..?

ABN , First Publish Date - 2020-04-03T07:40:37+05:30 IST

కొవిడ్‌-19 ప్రపంచంలోని వివిధ దేశాలకు విస్తరించడమే కాదు, వేలాది మంది ప్రాణాలను తీస్తోంది. అయితే పరిస్థితి తీవ్రత ఒక్కోదేశంలో ఒక్కో విధంగా ఉంటోంది. అందుకు కారణాలను పరిశీలించిన ఒక సర్వేలో ఆశ్చర్యకరమైన...

బిసిజి వ్యాక్సిన్‌తో ముప్పు తగ్గిందా..?

  • అమెరికా సర్వేలో వెల్లడి


కొవిడ్‌-19 ప్రపంచంలోని వివిధ దేశాలకు విస్తరించడమే కాదు, వేలాది మంది ప్రాణాలను తీస్తోంది. అయితే పరిస్థితి తీవ్రత ఒక్కోదేశంలో ఒక్కో విధంగా ఉంటోంది. అందుకు కారణాలను పరిశీలించిన ఒక సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి. చిన్నపిల్లలకు బిసిజి వ్యాక్సిన్‌ తప్పనిసరి చేసిన దేశాల్లో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉందని తేలింది. వ్యాక్సినేషన్‌ అమలవుతున్న దేశాల్లో కొవిడ్‌ వైర్‌సతో మరణాల రేటు తక్కువగా ఉందని అమెరికన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన సాంక్రమిక వ్యాధుల అధ్యయనంలో వెల్లడైంది.   డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ సైన్సెస్‌ తదితర సంస్థలు సర్వేలో పాల్గొన్నాయి. సాంస్కృతిక నిబంధనలు, ఉపశమన చర్యలు, హెల్త్‌కు సంబంధించి మౌలిక సదుపాయల్లో ఉన్న తేడాలు సైతం వైరస్‌ తీవ్రతలోనూ చూపించాయి. అయితే చిన్న పిల్లలకు వేసే బిసిజి వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేసిన దేశాల్లో తీవ్రత అంత అధికంగా లేదు. బిసిజి వ్యాక్సినేషన్‌ను సార్వత్రికంగా అమలు చేయని ఇటలీ, నెదర్లాండ్‌, అమెరికాలో  పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అలాగే 1984 నుంచి దీన్ని అమలు చేస్తున్న ఇరాన్‌లో మరణాల రేటు తీవ్రంగా ఉంది. వ్యాక్సినేషన్‌ పక్కాగా జరిగిన దేశాల్లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అస్వస్థత, అదేవిధంగా మరణాల రేట్లు బిసిజి వ్యాక్సినేషన్‌ను అనుసరించి ఉండటాన్ని ఈ సర్వేలో గుర్తించారు. 

 

కొవిడ్‌ వైరస్‌ చైనాలో ఆరంభమైన విషయం విదితమే. అయితే ఇటలీలో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. సామాజిక ఆంక్షలు ఉన్నప్పటికీ సమస్య తీవ్రత ఎక్కువైంది. జపాన్‌లో ఎలాంటి ఆంక్షలు లేనప్పటికీ వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది. సాంస్కృతికపరంగా అలాగే వైద్యప్రమాణాల్లో ఉన్న తేడాలు ఇందుకు కొంత కారణమైనాయి. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా మరో వాదన ముందుంచారు. ముఖ్యంగా బిసిజి వ్యాక్సినేషన్‌ చాలా తేడాని చూపింది.  క్షయ వ్యాధి నివారణ కోసం ఈ వ్యాక్సిన్‌ను దాదాపుగా అన్ని దేశాలు ఉపయోగిస్తాయి. భారత్‌ సహా చైనా, జపాన్‌లో యూనివర్సల్‌ వ్యాక్సినేషన్‌ అమలులో ఉంది. నవజాత శిశువులకూ అమలుచేస్తారు. స్పెయిన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌  ఈ విధానాన్ని నిలిపివేశాయి. అమెరికా, ఇటలీ, నెదర్లాండ్‌ ఇప్పటివరకు ఈ విధానాన్ని అమలు చేయలేదు. గునియా - బిసావులో జరిపిన అధ్యయంలో బిసిజి వ్యాక్సినేషన్‌ కారణంగా మరణాల రేటు సగానికి సగం తగ్గింది. ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు కూడా తక్కువే.


 బిసిజి వాక్సినేషన్‌ను అమలు చేస్తున్న దేశాల్లోని పద్ధతులను కూడా అధ్యయనం చేశారు. మేట్‌లాబ్‌ స్ర్కిప్ట్స్‌ సహకారంతో డేటాను విశ్లేషించారు. వాటిని అసలు వ్యాక్సినేషన్‌ను పాటించని అమెరికా, లెబనాన్‌ వంటి దేశాలతో కలిపి బేరీజు వేశారు. తలసరి ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. తక్కువ ఆదాయం ఉన్న కొన్ని దేశాల్లో  అసలు మరణాలు లేవని, అందుకు కారణం బిసిజి వ్యాక్సినేషన్‌ జరగడమేనని తేల్చారు. బిసిజి వ్యాక్సినేషన్‌ ఆరంభంలో ఉన్న తేడాలు మరణాల రేటుపై ప్రభావం చూపాయి. ఉదాహరణకు ఇరాన్‌లో బిసిజి వ్యాక్సినేషన్‌ను 1984 నుంచి అమలుచేస్తున్నారు. అక్కడ కరోనా వైర్‌సతో మరణాలు ప్రతి పది లక్షల మందికి 19.7గా నమోదైంది. అదే 1947 నుంచి వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్న జపాన్‌లో 0.28 మాత్రమే. 1927లో బ్రెజిల్‌లో ఆరంభం కాగా అక్కడ మరణాల రేటు 0.0573 మాత్రమే.

 

బిసిజి విధానాన్ని నిలిపి వేసిన పదిహేడు దేశాలనూ పరిశీలించారు. నలభై సంవత్సరాలు అమలు చేసి 1986లో నిలిపి వేసిన డెన్మార్క్‌లో ఇతర దేశాలతో పోల్చుకుంటే మరణాల రేటు పదింతలు తక్కువగా ఉంది. మొత్తానికి బిసిజి వ్యాక్సినేషన్‌ అమలు చేస్తున్న దేశాలు కరోనా వైరస్‌ కట్టడిలో ముందున్నాయని తేలింది. అయితే  కరోనాను పూర్తిగా నిర్మూలించిన తరువాతనే దీనిపై సమగ్ర అంచనాకి రావడానికి వీలవుతుంది. అప్పటి దాక వీటిని ఒక పరిశీలన అంశంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.  


Updated Date - 2020-04-03T07:40:37+05:30 IST