ఆ ఫొటోపై స్పష్టత ఇచ్చిన బీసీసీఐ బాస్ గంగూలీ

ABN , First Publish Date - 2022-02-04T22:47:36+05:30 IST

సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతూ భారత జట్టు ఎంపిక ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారంటూ

ఆ ఫొటోపై స్పష్టత ఇచ్చిన బీసీసీఐ బాస్ గంగూలీ

న్యూఢిల్లీ: సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతూ భారత జట్టు ఎంపిక ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో ఇసుమంతైనా నిజం లేదని కొట్టిపడేశాడు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, అప్పటి వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర ఆఫీస్ బేరర్లతో కలిసున్న గంగూలీ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


నిజానికి సెలక్షన్ సమావేశాల్లో బీసీసీఐ అధ్యక్షుడి పాత్ర ఏమీ ఉండదు. ఆ సమావేశాలకు హాజరు కాకూడదు కూడా. కానీ గంగూలీ వారితో కలిసి ఉన్న ఫొటో వెలుగులోకి రావడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా, ఈ వివాదంపై స్పందించిన ‘దాదా’.. బీసీసీఐ అధ్యక్షుడిగా తన పాత్ర ఏంటో తనకు తెలుసన్నాడు.


నిజానికి దీనిపై తాను స్పందించాలనుకోవడం లేదని, ఈ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని గంగూలీ తేల్చి చెప్పాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడినని, అధ్యక్షుడిగా తన విధులేంటో తనకు స్పష్టంగా తెలుసని అన్నాడు.


సెలక్షన్ కమిటీ సమావేశంలో తాను కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం కూడా తనకు తెలుసన్నాడు. అ ఫొటో విషయంలో తాను స్పష్టత ఇవ్వదలిచానని పేర్కొన్న గంగూలీ.. అది సెలక్షన్ కమిటీకి సంబంధించినది కాదని స్పష్టం చేశాడు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆ ఫొటోలో గంగూలీతోపాటు బీసీసీఐ కార్యదర్శి జై షా, కోహ్లీ, సంయుక్త కార్యదర్శి జయేశ్ జార్జ్‌ ఉన్నారు.  

Updated Date - 2022-02-04T22:47:36+05:30 IST