Anil Kumble: టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడికే చాన్స్!

ABN , First Publish Date - 2021-09-18T22:02:54+05:30 IST

భూమి గుండ్రంగా ఉందంటే ఇదే కాబోలు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా టీమిండియా

Anil Kumble: టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడికే చాన్స్!

న్యూఢిల్లీ: భూమి గుండ్రంగా ఉందంటే ఇదే కాబోలు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా టీమిండియా కోచ్ పదవి నుంచి అప్పట్లో తప్పుకున్న అనిల్ కుంబ్లే మళ్లీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌తో కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో ఇప్పటి నుంచే కోచ్ వేటలో పడిన బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది.


గతంలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించి, సారథి విరాట్ కోహ్లీతో పొసగకపోవడంతో కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న కుంబ్లేకే తిరిగి పగ్గాలు అప్పగించాలని బోర్డు భావిస్తోంది. అలాగే, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.  


2016-17 మధ్య అనిల్ కుంబ్లే భారత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రి స్థానంలో కుంబ్లేను నియమించింది. అయితే కోహ్లీతో పొసగకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌‌లో పాక్ చేతిలో ఓటమి తర్వాత కుంబ్లే తన రాజీనామాకు దారితీశాడు. 

 

కుంబ్లేతోపాటు ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు మెంటార్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ను కూడా బోర్డు సంప్రదించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, లక్ష్మణ్ కంటే కుంబ్లేకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సీవోఏ అప్పట్లో కోహ్లీ ఒత్తిడికి తలొగ్గి కుంబ్లేను వదులుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడా తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. కుంబ్లే, లక్ష్మణ్‌కు అపారమైన అనుభవం ఉండడడంతో వీరిద్దరికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే విదేశీ కోచ్ గురించి ఆలోచించాలని బీసీసీఐ యోచిస్తోంది.

Updated Date - 2021-09-18T22:02:54+05:30 IST