యూఏఈలో జాతీయ శిబిరం!

ABN , First Publish Date - 2020-07-16T09:20:35+05:30 IST

టీమిండియా కాంట్రాక్టు ఆటగాళ్లకు యూఏఈలో జాతీయ శిబిరం నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది ...

యూఏఈలో జాతీయ శిబిరం!

ఐపీఎల్‌ కూడా తరలించే యోచనలో బీసీసీఐ

న్యూఢిల్లీ:  టీమిండియా కాంట్రాక్టు ఆటగాళ్లకు యూఏఈలో జాతీయ శిబిరం నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ఏడాది ఐపీఎల్‌ను కూడా అక్కడే నిర్వహించాలనుకుంటోందని తెలిసింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ ఇప్పట్లో తగ్గేలా లేదు. ప్రత్యామ్నాయాల్లో భాగంగా ఐపీఎల్‌ను విదేశాలకు తరలించే ఆలోచనలో కూడా ఉన్నట్టు బోర్డు అధ్యక్షుడు గంగూలీ కొన్ని రోజుల కిందటే చెప్పాడు. ‘ముంబైలో పరిస్థితులు అనూహ్యంగా మెరుగుపడితే తప్ప.. ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లకు అక్కడే శిబిరం నిర్వహించాలనుకుంటున్నాం. ఐపీఎల్‌ వేదిక ఖరారైతే అన్ని పనులు వేగంగా జరిగిపోతాయి. బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ భేటీలో అన్ని విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ రద్దయితే.. సెప్టెంబరు-అక్టోబరులో ఐపీఎల్‌ను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నె్‌సను అంచనా వేయడానికి తక్కువ రోజుల వ్యవధితో శిబిరాన్ని నిర్వహించాలన్నది ఆలోచన. పరిస్థితులు దిగజారి.. ప్రయాణాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేయకముందే దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో శిబిరాన్ని  ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2020-07-16T09:20:35+05:30 IST