పాజిటివ్ వస్తే ఇంగ్లండ్‌కు పంపేది లేదు: బీసీసీఐ

ABN , First Publish Date - 2021-05-11T18:31:40+05:30 IST

బ్రిటన్ విమానం ఎక్కే ముందు చేసే కరోనా పరీక్షలో ఎవరికి పాజిటివ్ వచ్చినా ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరం కావాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది.

పాజిటివ్ వస్తే ఇంగ్లండ్‌కు పంపేది లేదు: బీసీసీఐ

బ్రిటన్ విమానం ఎక్కే ముందు చేసే కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరం కావాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. కోహ్లీ సేన జూన్‌ 18-22 మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆడాల్సి ఉంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ జరుగుతుంది.


ప్రస్తుతం ఇళ్లలోనే ఉన్న ఆటగాళ్లంతా ముంబై వచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ సమయంలో రెండు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎవరికి పాజిటివ్ వచ్చినా భారత్‌లోనే ఉండిపోవాలని, సిరీస్ మొత్తానికి దూరం కావాల్సి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసిందట. అందుకే ముంబై వచ్చే ముందు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని ఆటగాళ్లకు ఫిజియో యోగేశ్ పామర్ చెప్పారట. ఇది సుదీర్ఘ సిరీస్ కావడంతో ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇంగ్లండ్ అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్ల పైనే ఉంటుందని బోర్డు స్పష్టం చేసిందట. 


Updated Date - 2021-05-11T18:31:40+05:30 IST