ఖజానాకు గండి పడినట్టే!

ABN , First Publish Date - 2020-06-23T10:03:17+05:30 IST

ఐపీఎల్‌ లోగోపైన గమనిస్తే వివో అనే చైనీస్‌ మొబైల్‌ కంపెనీ అక్షరాలు ప్రముఖంగా కనిపిస్తుంటాయి. 2018 నుంచి ఐదేళ్ల ..

ఖజానాకు గండి పడినట్టే!

ఐపీఎల్‌ అంటేనే కాసుల గలగల.. ప్రపంచ క్రికెట్‌లో ఆదాయపరంగా ఈ లీగ్‌ను తలదన్నే టోర్నీ లేదంటే అతిశయోక్తి లేదు. అసలు గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ కూడా బ్రాడ్‌కాస్టర్లకు లాభాలు తేలేదని చెబుతుంటారు. కానీ భారత్‌లో ప్రతీ ఏడాది జరిగే ఈ ధనాధన్‌ టోర్నీ మాత్రం బీసీసీఐ ఖజానాకు ఏనాడూ లోటు రానీయదు. అందుకే కరోనా ఇంతగా విలయతాండవం చేస్తున్నా వాయిదా వేసేందుకు మాత్రం బోర్డుకు మనసు రావడం లేదు. కానీ ఇటీవలి ‘బాయ్‌కాట్‌ చైనా ప్రోడక్ట్‌’ ఉద్యమం ఐపీఎల్‌ ఆర్జనపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు ఈ ఎఫెక్ట్‌ ఇతర క్రీడా సామగ్రిపైనా పడనుంది..


చైనా కంపెనీలతో కటీ్‌ఫకు  

బీసీసీఐ సాహసం చేసేనా?


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఐపీఎల్‌ లోగోపైన గమనిస్తే వివో అనే చైనీస్‌ మొబైల్‌ కంపెనీ అక్షరాలు ప్రముఖంగా కనిపిస్తుంటాయి. 2018 నుంచి ఐదేళ్ల పాటు ఈ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ కొనసాగేలా ఆ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ అక్షరాలా రూ.2,200 కోట్లు. అంటే ఏడాదికి రూ.440 కోట్లు ఒక్క ఆ లోగో కారణంగానే బీసీసీఐ ఖజానాకు చేరుతాయి. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది. వివోతో సాగుతున్న టైటిల్‌ స్పాన్సర్‌షి్‌పను సమీక్షిస్తామని ఐపీఎల్‌ పాలకమండలి ప్రకటించింది. దీంతో మరో మూడేళ్ల కాలానికి బోర్డుకు రావాల్సిన రూ.1,320 కోట్లకు గండిపడినట్టే. ఇది మాత్రమే కాకుండా లీగ్‌ జరుగుతున్నప్పుడు వచ్చే ప్రకటనల ద్వారా చైనా కంపెనీల నుంచి  దాదాపు రూ.500 కోట్ల వరకు బోర్డు ఆర్జిస్తుంటుంది.  

వేల కోట్లు గుమ్మరిస్తాయి..: భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఒక్క ఐపీఎల్‌లోనే కాకుండా భారత జట్టు ఆడే ఇతర సిరీ్‌సలపైనా ఏడాదిలో రూ.1200 కోట్లు ఖర్చు పెడతాయి. అంతెందుకు.. గతేడాది జూలైలో టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షి్‌పను దక్కించుకున్న భారత కంపెనీ బైజూ్‌సలోనూ చైనీస్‌ కంపెనీ ‘టెన్సెంట్‌’ పెట్టుబడులుండడం గమనార్హం.

బీసీసీఐ తక్షణ కర్తవ్యం...: బీసీసీఐ ఒక్కసారిగా ఈ కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకుంటే న్యాయపర చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ చైనా కంపెనీలను తొలగిస్తే వాటి స్థానంలో భారత్‌కు చెందిన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ ఇప్పట్లో ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అందుకే చైనా వ్యతిరేకత తగ్గేవరకు ఎదురుచూసి.. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ గాడిన పడ్డాక  ఒప్పందాలను సమీక్షించే అవకాశముంది.

ఇతర క్రీడలపైనా ప్రభావం..: ఒక్క క్రికెట్‌పైనే కాకుండా దేశంలోని అన్ని క్రీడలపైనా చైనా ప్రభావం ఉంది. టేబుల్‌ టెన్నిస్‌ బంతులు, షటిల్‌ కాక్స్‌, బ్యాడ్మింటన్‌.. టెన్నిస్‌ రాకెట్స్‌, రెజ్లింగ్‌ మ్యాట్స్‌, జావెలిన్స్‌, హైజంప్‌ బార్స్‌, బాక్సింగ్‌ హెడ్‌గార్డ్స్‌, జిమ్‌ పరికరాలు ఇలా చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే వస్తువుల జాబితా చాలానే ఉంటుంది. వీటి మొత్తం విలువ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుంది. ఎందుకంటే దేశంలో 50శాతం కన్నా ఎక్కువ క్రీడా సామగ్రి చైనా నుంచే వస్తున్నాయి. 


‘చైనా ఉత్పత్తులకు మేం దూరం’

భారత్‌లో చైనా దాష్టీకానికి నిరసనగా ఆ దేశ ఉత్పత్తులను వాడకూడదని భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌) నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు ఆ కంపెనీ ఉత్పత్తులు నాసిరకంగా ఉంటున్నాయని సమాఖ్య ఆరోపించింది. ‘చైనీస్‌ ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాల్సిందే. మేమైతే వారి పరికరాలను వాడకూడదని నిర్ణయించాం. ఈమేరకు సాయ్‌కు కూడా లేఖ రాశాం. గతేడాది జడ్‌కేసీ అనే చైనా కంపెనీకి వెయిట్‌లిఫ్టింగ్‌ సెట్‌ ఆర్డర్‌ ఇచ్చాం. కానీ అవి దారుణంగా ఉన్నాయి. వాటిని ఉపయోగించకుండా పక్కనబెట్టాం’ అని ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి సహదేవ్‌ యాదవ్‌ తెలిపాడు.

Updated Date - 2020-06-23T10:03:17+05:30 IST