యూఏఈకి బీసీసీఐ బృందం

ABN , First Publish Date - 2020-08-12T09:19:26+05:30 IST

వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌ కోసం బీసీసీఐ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా టోర్నీ జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల

యూఏఈకి బీసీసీఐ బృందం

ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం 22న ప్రయాణం

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ఐపీఎల్‌ కోసం బీసీసీఐ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా టోర్నీ జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారుల బృందం ఈనెల 22న యూఏఈకి వెళ్లనుంది. ప్రభుత్వ అనుమతి కూడా రావడంతో ఐపీఎల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయాన్ని ఆ దేశంలో ఏర్పాటు చేయాలనుకుంటోంది. బీసీసీఐ టీమ్‌లో ఉండే లీగ్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌, బోర్డు కార్యదర్శి జైషా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌, తాత్కాలిక సీఈవో హేమంగ్‌ అమిన్‌, ఫ్రాంచైజీల ప్రతినిధులు ప్రత్యేక విమానంలో యూఏఈకి వెళతారు. ’ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియ ముగిశాక బీసీసీఐ బృందం యూఏఈకి వెళుతుంది. వచ్చే మూడు నెలల కోసం దుబాయ్‌లో ఆఫీ్‌సను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. గంగూలీ వెళ్లేదీ లేనిదీ ఇంకా తెలీదు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ బృందం అక్కడికి వెళ్లాక భవిష్యత్‌ ప్రణాళికలపై ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు అధికారులతో చర్చలు, వేదికల పరిశీలన, భారత దౌత్య కార్యాలయ సందర్శన, బయో బబుల్‌ ఏర్పాటుపై బిజీబిజీగా గడపనున్నారు.

సీఎ్‌సకే వెంట నెట్‌  బౌలర్లు..: యూఏఈలో జరిగే ఐపీఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు తమ వెంట నెట్‌ బౌలర్లను కూడా తీసుకెళ్లనున్నాయి. వీరిలో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్లతో పాటు అండర్‌-19, అండర్‌-23 విభాగాలకు చెందిన వారు ఉంటారు. ఈ జాబితాలో మరిన్ని జట్లు కూడా ఉండబోతున్నా యి. మామూలుగానైతే ఆయా జట్ల ఆటగాళ్లు స్థానిక బౌలర్లతో నెట్‌ ప్రాక్టీస్‌ చేసేవారు. కానీ ఇప్పుడు బయో సెక్యూర్‌లో టోర్నీ జరుగుతుండడంతో ప్రాక్టీస్‌ సెషన్స్‌ కోసం ఇక్కడి నుంచే నాణ్యమైన బౌలర్లను అక్కడికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అలాగే కేకేఆర్‌ కూడా అండర్‌-23, అండర్‌-19కి చెందిన పది మందిని తీసుకెళ్లాలని చూస్తోంది. ఢిల్లీ జట్టు మాత్రం ఆరుగురితో సరిపెట్టుకోవాలనుకుంటోంది. అక్కడి వాతావరణం, దుబాయ్‌ ట్రాక్‌ను అనుసరించి ఎక్కువగా స్పిన్నర్లు ఉండేలా జట్లు చూసుకుంటున్నాయి.

ఆ కంపెనీలతో సమస్య లేదు..

ముంబై: ఐపీఎల్‌ నుంచి చైనీస్‌ కంపెనీ వివో దూరమైనప్పటికీ ఆ దేశ పెట్టుబడులున్న భారత కంపెనీలతో ఎలాంటి ఇబ్బందీ లేదని బీసీసీఐ పేర్కొంది. టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ బైజూస్‌, ఐపీఎల్‌ అధికారిక స్పాన్సర్‌ డ్రీమ్‌11, పేటీఎమ్‌లలో చైనా పెట్టుబడులున్నాయి. అలాగే భారత్‌లో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌లకు పేటీఎమ్‌ అధికారిక స్పాన్సర్‌గానూ వ్యవహరిస్తోంది. వివోలాగే వీటిని కూడా తొలగించాలనే ఒత్తిడి తమపై లేదని, ఆ కంపెనీలన్నీ భారత్‌కు చెందినవేనని బోర్డు గుర్తుచేసింది. 

Updated Date - 2020-08-12T09:19:26+05:30 IST