హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బిసీ సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాస, కవిత, పద్య, చిత్రకళల్లో పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలోనిర్వహిస్తామని బిసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. విద్యార్థుల్లో సాహిత్య సృజన పెంచేందుకు, జ్యోతి బా పూలే జీవిత ప్రభావం నేటి సమాజం పై ఎలా ఉంది అన్న విషయం తెలుసుకునేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. బిసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని బుర్రా వెంకటేశం చెప్పారు. ‘జ్యోతి బా పూలే జీవితం - నేటి సమాజం పై ప్రభావం’ అన్న అంశంపై రెండు పేజీలకు మించకుండా వ్యాసం, పదికి మించకుండా పద్యాలు, కవిత రాసి పంపించాలన్నారు.
చిత్రం వేయాలనుకున్నవారు ఏ4 సైజు పేపరు పై చిత్రం గీసి పంపించాలని ఆయన సూచించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిబా పూలే గురించి ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒకరికీ తెలియజేస్తూ గడప గడపకి సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీతో కలిసి నిర్వహిస్తున్నామని బుర్రా వెంకటేశం వివరించారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమమైన రచనలకు ఏప్రిల్ 11న హైదరాబాద్ లో నిర్వహించే జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల్లో బహుమతి ప్రధానం ఉంటుందన్నారు. గురుకుల విద్యార్థులతో పాటు హాస్టల్ విద్యార్థులు, టీచర్లు, వార్డన్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని ఆయన చెప్పారు. ఏప్రిల్ 4న తేదీ లోగా జిల్లా స్థాయి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి పంపించాలని వాటిలో అత్యుత్తమైన వాటిని ఎంపిక చేసి పుస్తకంగా తీసుకువచ్చే బాధ్యతను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తీసుకున్నారని ఆయన తెలిపారు.
ఆర్ సిఓలు, ప్రిన్సిపాల్స్, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయాలు చెప్పి వారిలో రచనాశక్తిని పెంపొందించాలని ఆయన సూచించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు, ఆర్ సిఓలు, ప్రిన్సిపాల్స్, తెలుగు ఉపాధ్యా యులతో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పాల్గొన్నారు. విద్యార్థులకు జ్యోతిబా పూలే జీవితం విశేషాలు చెప్పి వారిలో రచనా శక్తిని పెంపొందించాలని ఆయన సూచించారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో నిగూఢమై ఉన్న ఆలోచనా శక్తిని బయటకు తీసుకువచ్చే అవకాశం కలుగుతుందని గౌరీశంకర్ అన్నారు. లక్షకు పైగా విద్యార్థులున్న బిసీ విద్యాసంస్థల నుంచి ఎందరో కవులు, రచయితలు తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి