ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దాం రా.. YSRCP ఎమ్మెల్యేకు సవాల్..!?

ABN , First Publish Date - 2021-08-31T17:45:05+05:30 IST

బనగానపల్లెలో ఇద్దరం ఇండిపెండెంట్‌లుగా పోటీ చేద్దామని, తాను ఓడితే...

ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దాం రా.. YSRCP ఎమ్మెల్యేకు సవాల్..!?

  • కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునేది ఎవరో అందరికీ తెలుసు
  • పెట్రోల్‌ ధరలు పెంచి  కేంద్రంపై నెట్టివేయడం దారుణం 
  • ఎమ్మెల్యే కాటసానికి మాజీ ఎమ్మెల్యే బీసీ సవాల్‌

కర్నూలు/బనగానపల్లె : ‘బనగానపల్లెలో ఇద్దరం ఇండిపెండెంట్‌లుగా పోటీ చేద్దామని, తాను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఎమ్మెల్యే కాటసాని రాజీనామాకు సిద్ధమేనా?’ అని బీసీ సవాల్‌ విసిరారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ల నుంచి కమిషన్‌లు వసూలు చేసేది ఎవరో అందిరికీ తెలుసనని అన్నారు.  ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజల్‌పై ధరలు పెంచి కేంద్రప్రభుత్వంపై నెట్టి వేయడం దారుణమని అన్నారు.


పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచినందుకు శనివారం టీడీపీ ధర్నా చేసిందన్నారు. అయితే పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచేది రాష్ట్ర ప్రభుత్వం కాదని, కేంద్రం పెంచుతుందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌  2016 బడ్జెట్‌ సమావేశాల్లో మాట్లాడుతూ పెట్రోల్‌, డీజల్‌ ధరల పెంపునకు తెలుగుదేశం పార్టీనే కారణమని అసెంబ్లీ సాక్షిగా నానా యాగీ చేశారన్నారు. తాను అధికారంలోకి వస్తే పెట్రో, డీజల్‌పై వ్యాట్‌ ఎత్తేస్తాను అని చెప్పిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పెట్రోల్‌, డీజల్‌పై వ్యాట్‌ పెంచి ధరలు రెట్టింపు చేశారన్నారు.


అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా రూ.1120 కోట్లు ఆదాయం పోయినా పెట్రోల్‌, డీజల్‌పై ధరలు తగ్గించారన్నారు. 22 మంది ఎంపీ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్న వైసీపీ నాయకులు ఏనాడూ  పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలని పార్లమెంట్‌లో అడిగిన పాపాన  పోలేదన్నారు.  సీఎం జగన్‌పై ఉన్న  కేసులకు భయపడి వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ధరలు తగ్గించాలని కోరలేని అసమర్థులుగా మిగిలిపోయారన్నారు. రైతులకు రాయితీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు, ఆదరణ తదితర ఎన్నో సంక్షేమ పథకాలు టీడీపీ అమలు చేసి అన్ని వర్గాలను ఆదుకుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేశామన్నారు. 


రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారన్నారు. అయితే అభివృద్ధి  కేవలం భూమి పూజలకు  పరిమితమైందన్నారు. జోలదొరాసి తదితర పథకాలు కేవలం మంజూరు వరకే పరిమితమని నిధులు మంజూరు చేసేదెప్పుడు అని బీసీ ప్రశ్నించారు. గోరుకల్లు ద్వారా గాలేరునగరి కాల్వ ద్వారా కడప జిల్లాకు సాగునీరు అందించిన ఘనత టీడీపీదే అన్నారు. పట్టణంలో 2013లో దేవదాయశాఖకు చెందిన భూముల్లో 3వేల మందికి ఇచ్చిన నకిలీ పట్టాలు  ఏమయ్యాయని ప్రశ్నించారు. 


ఎస్సార్బీసీ లోతట్టు ప్రాంతాల్లో కాకుండా  అవుకు రహదారిలోని ఎస్సార్బీసీ కాలనీలో పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేలా సీఎంను ఒప్పించాలని  బీసీ డిమాండ్‌ చేశారు. జిల్లా మైనార్టీ టీడీపీ అధ్యక్షుడు జాహిద్‌హుస్సేన్‌, టీడీపీ సీనియర్‌ నాయకుడు నాగేశ్వరరెడ్డి, సర్పంచ్‌ తులసిరెడ్డి,, మంచాలమద్దిలేటిరెడ్డి, టిప్‌టాప్‌ కలాం, పాతపాడు సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-31T17:45:05+05:30 IST