Abn logo
Mar 30 2020 @ 05:32AM

బడుగుల అభ్యున్నతే ధ్యేయం: బీసీ

బన గానపల్లె, మార్చి 29: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే టీడీపీ ప్రధాన ధ్యేయమని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. సమ దూరం పాటించి వేడుకలు జరుపుకున్నారు. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి బీసీ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఒక మీటరు దూరం ఉండి వేడుకలు జరుపుకున్నారు.


సమాజంలో మార్పు తెచ్చిన ఘనత టీడీపీదే అని బీసీ అన్నారు. బడుగుబలహీన వర్గాల వారిని, ముస్లిం మైనార్టీ వర్గాలను,  విద్యాధికులను రాజకీయాల్లో భాగస్వామ్యులను చేసి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత, జాతీయ రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన పార్టీ టీడీపీదేనన్నారు. టీడీపీని ఆదరిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జాహీద్‌హుస్సేన్‌, కప్పెట నాగేశ్వరరెడ్డి, బురానుద్దీన్‌, ఖైరత్‌ఆలి, సుధాకర్‌రెడ్డి, కైప రఘునాథరెడ్డి, మద్దిలేటిరెడ్డి, జాకీర్‌హుసేసన్‌, టీఎన్‌ఆర్‌ రెడ్డి, రాయలసీమ సలాం, హర్షద్‌, పుల్లారెడ్డి పాల్గొన్నారు. 


‘అప్రమత్తంగా ఉండాలి’ 

 సంజామల మండలం నొస్సం గ్రామంలో కరోనా వైరస్‌ ఓ వ్యక్తికి సోకిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ అనవసరంగా కొందరు పని గట్టుకొని బయటికి వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా రావద్దని సూచించారు. కూరగాయల మార్కెట్‌వద్ద, చికెన్‌షాపుల వద్ద, కిరాణం, మెడికల్‌, రేషన్‌ దుకాణాల వద్ద ఒక మీటరు దూరం ఉండాలన్నారు. అలాగే పట్టణంలోని ఐసొలేషన్‌ కేంద్రంలో 20 మందికి చికిత్సలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ప్రధాని మోదీ చెప్పిన విషయాలను తూచా తప్పకుండా లాక్‌డౌన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. 


మద్దికెర: దివంగత నందమూరి తారక రామారావు పేదల ఆశాజ్యోతి అని టీడీపీ నాయకుడు ధనుంజయుడు అన్నారు. ఆదివారం మద్దికెరలోని ప్రధాన బస్టాండ్‌ వద్ద ఉన్న నందమూరితారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబున సూచనల మేరకు హంగామా లేకుండా వేడుకలను జరుపుకున్నామన్నారు. ప్రజలు కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆకాంక్షించారు. నందమూరి తారకరామారావు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఆయనను ఎప్పటికీ మరువలేమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివప్రసాద్‌, శేఖర్‌, వేమారెడ్డి, ఫక్కీరప్ప పాల్గొన్నారు. 

ఆలూరు: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానేత ఎన్టీ రామారావు అని టీడీపీ  ఆలూరు మండల కన్వీనర్‌ రాంభీంనాయుడు కొనియాడారు. ఆదివారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఆదోని టౌన్‌: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఫరీద్‌సాబ్‌ వీధిలో టీడీపీ నాయకుడు గడ్డఫకృద్దీన్‌ అంటువ్యాధులు ప్రబలకుండా మందులను పిచికారీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం అధికంగా ఉండడంతో ప్రజలకు అంటు వ్యాధులతో పాటు కరోనా వైరస్‌ సోకకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కరోనా వైరస్‌ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు అందించారు.


Advertisement
Advertisement
Advertisement