వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్‌ నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-08-09T06:52:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.

వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్‌ నిర్వీర్యం
విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న నాగజగదీశ్వరరావు


బీసీలను ఉద్ధరించామని ఊకదంపుడు ప్రసంగాలు  

981 నామినేటెడ్‌ పదవుల్లో 742 పదవులను రెడ్డి సామాజిక వర్గానికే కేటాయింపు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ‘బుద్ద’  

అనకాపల్లి అర్బన్‌, ఆగస్టు 8 : వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను ఉద్ధరించామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ కార్పొరేషన్లకు నిధులు ఎక్కడ కేటాయించారని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ కార్పొరేషన్‌ నిధులను నవరత్నాలకు మళ్లించారని విమర్శించారు. టీడీపీ హయాంలో బీసీలకు కార్పొరేషన్‌ ద్వారా కులవృత్తులు చేసుకునే సామాజిక వర్గాలకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించామన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆదరణ పథకంలో పనిముట్లు ఇచ్చినట్టు చెప్పారు.  ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ.. జీవో నంబరు 24ను తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం, శాసన మండలిలో ఆ జీవోను ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 981 నామినేటెడ్‌ పదవులకుగాను 742 పదవులను రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టిందని దుయ్యబట్టారు. ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు దాడి జగన్‌, మళ్ళ లోవకృష్ణ, విల్లూరి రమణబాబు, అండిబోయిన శేషు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T06:52:19+05:30 IST