ఏపీ నుంచి కృష్ణయ్యను రాజ్యసభకు పంపడంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ..!

ABN , First Publish Date - 2022-06-09T18:02:43+05:30 IST

బీసీ సంఘ నేత ఆర్‌.కృష్ణయ్యను ఏపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపడంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటిదాకా తెలంగాణలో...

ఏపీ నుంచి కృష్ణయ్యను రాజ్యసభకు పంపడంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ..!

బీసీ సంఘ నేత కృష్ణయ్యను ఏపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపనున్న నేపథ్యంలో కృష్ణయ్య పాత్రపై ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణ, ఏపీ మధ్య అనేక సమస్యలున్న నేపథ్యంలో కృష్ణయ్య ఆ గట్టున ఉంటారా? ఈ గట్టునా ఉంటారా అనే చర్చ మొదలైంది. ఇక మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..


రాజ్యసభకు పంపడంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ

బీసీ సంఘ నేత ఆర్‌.కృష్ణయ్యను ఏపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపడంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటిదాకా తెలంగాణలో బీసీ సంక్షేమ సంఘ నాయకునిగా కృష్ణయ్య అనేక పోరాటాలు చేశారు. ఒకరకంగా ఈ ఉద్యమాలే కృష్ణయ్యకు గుర్తింపును తీసుకువచ్చాయి. అయితే కాలక్రమంలో కృష్ణయ్యకూడా రాజకీయాల్లో చేరారు. 2014లో ఆయన ఎల్‌బీ నగర్‌ నుంచి తెలుగుదేశం తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. నిజానికి ఆ ఎన్నికలలో తెలంగాణ తెలుగుదేశం సీఎం అభ్యర్థిగా కృష్ణయ్యను ప్రకటించారు. బీసీ వర్గాల అండదండలు కృష్ణయ్యకు పుష్కలంగా ఉన్నాయి. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కృష్ణయ్య తురుపుముక్కగా మారారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవలేదు. కానీ కృష్ణయ్య మాత్రం ఎమ్మెల్యే అయ్యారు.


కృష్ణయ్యను పెద్దల సభకు పంపండంలోని ఆంతర్యం ఏమిటో

తరువాత 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి ఆయన కాంగ్రెస్‌ పక్షాన పోటీ చేశారు కానీ ఓడిపోయారు. తరువాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించలేదు. కేవలం బీసీల నేతగా మాత్రమే వ్యవహరిస్తూ వచ్చారు.  ఈనేపథ్యంలో కృష్ణయ్యను  రాజ్యసభకు పంపుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం తెలంగాణ బీసీ నేతలను ఆశ్చర్యానికి గురి  చేసింది. కృష్ణయ్యను పెద్దల సభకు  పంపండంలోని ఆంతర్యం ఏమిటో ఇన్ని రోజులూ ఆయన వెంట నడిచిన వారికి కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పటిదాకా బీసీహక్కుల కోసం పని చేసిన  కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడయ్యాక బీసీల హక్కుల కోసం పోరాడగలరా అనే చర్చ సాగుతోంది. 


కృష్ణయ్య ఏపీ రాగం అందుకుంటారా..తెలంగాణ సమస్యలపై మాట్లాడతారా

తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నాఇంకా పక్క రాష్ట్రాలతో  అనేక సమస్యలపై పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో తెలంగాణ బీసీ నేతకు ఏపీ అధికార పార్టీ పెద్దల సభకి పంపించడం పై అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికి ఏపీకి , తెలంగాణ కు మధ్య నీటి వివాదాలతో పాటు విభజన చట్టంలోని అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోకృష్ణ య్య ఏపీ రాగం అందుకుంటారా లేక తెలంగాణ సమస్యలపై మాట్లాడతారా అనేది ఆసక్తికరంగా మారింది. 


అయితే కొందరు  మాత్రం ఏపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన  కృష్ణయ్య తెలంగాణలో బీసీల పక్షాన ఎలా పని చేశారో ఇప్పుడు అలా పని చేస్తారని చెబుతున్నా రు. తాను ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్ళినప్పటికి అటు చట్టసభల్లో ఇటు బయట బీసీ వాదం వినిపిస్తానని కృష్ణయ్య ప్రకటించినా రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదంటున్నారు. మరోపక్క   కృష్ణయ్య స్థానంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష పదవి కోసం  పోటీ గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.  మరి కృష్ణయ్య తనలోని ఉద్యమకారుడిని నిద్రపుచ్చుతారా లేక అలాగే సజీవంగా ఉంచుతారా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.

Updated Date - 2022-06-09T18:02:43+05:30 IST