క్షేత్రస్థాయి అధ్యయనంతోనే బీసీ కుల జాబితా తయారీ

ABN , First Publish Date - 2021-10-20T02:20:36+05:30 IST

క్షేత్రస్థాయి అధ్యయనంతోనే వాస్తవాల ఆధారంగా బీసీ కుల జాబితా తయారీతో ఆ వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ శంకరనారాయణ అన్నారు.

క్షేత్రస్థాయి అధ్యయనంతోనే బీసీ కుల జాబితా తయారీ
లింగిస్‌ గుంటలో పిరమలై కళ్ళర్‌ దేవర్‌ కులస్థుల నివాసాలను పరిశీలిస్తున్న బీసీ కమిషన్‌ బృందం

- బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ శంకర నారాయణ

పుత్తూరు, అక్టోబరు 19 : క్షేత్రస్థాయి అధ్యయనంతోనే వాస్తవాల ఆధారంగా బీసీ కుల జాబితా తయారీతో ఆ వర్గాలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ శంకరనారాయణ అన్నారు. నగరి మున్సిపాలిటీ పరిధిలోని లింగిస్‌ గుంటలో నివాసం వున్న పిరమలై కళ్ళర్‌ దేవర్‌ కులస్థులు తమను బీసీ జాబితాలో చేర్చాలనే అభ్యర్థన మేరకు మంగళవారం బీసీ కమిషన్‌ బృందం బహిరంగ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కమిషన్‌ కోరిన మేరకు తాము తమిళనాడు నుంచి 40 ఏళ్ల కిందట ఇరవై కుటుంబాలు వలస వచ్చి స్థిరపడ్డామని ఆ కుల పెద్దలు వివరించారు. ప్రస్తుతం 94 మంది జనాభా వున్నామని చెబుతూ ఆర్థిక పరిస్థితి, ఓసీ కుల సర్టిఫికెట్‌ కారణంగా కేవలం ఆరుగురు డిగ్రీ, ఒకరు పిజీ వరకు మాత్రమే చదువుకున్నారని తెలిపారు. ఎంసీఏ చేసినా కుల సర్టిఫికెట్‌ లేని కారణంగా పోటీలో నెగ్గలేక చివరకు బ్యుటీషియన్‌ వృత్తిలో స్ధిర పడ్డానని  యుగప్రియ తెలిపారు. స్కాలర్‌ షిప్‌లు, బీసీ కుల సర్టిఫికెట్‌ వున్నట్లయితే ఉన్నత విద్య చేసేందుకు అవకాశం వుండేదని వివరించింది. పేదరికం కారణంగా ప్రాఽథమిక విద్యతోనే ఆగి పోతున్నామని అన్నారు. ప్రధాన వృత్తిగా తినుబండారాలైన చిక్కీలు, మురుకులు, పబ్బిళ్లలను తయారు చేసి గ్రామాలలో విక్రయిస్తుంటామని చంద్రన్‌ వివరించారు. తమది శివ గోత్రమని, హిందూ సంప్రదాయాలు, ఆచారాలకు  అనుగుణంగా పెళ్లిళ్లు చేసుకుంటూ జీవిస్తున్నామని సౌందర్‌రాజన్‌ తెలిపారు. తర్వాత ఆస్‌బెస్టాస్‌ రేకుల షెడ్డులో నివాసం వున్న ఇళ్లను బీసీ కమిషన్‌ బృందం పరిశీలించి వివరాలను సేకరించింది. ఈ పర్యటనలో కమిషన్‌ సభ్యులైన మారక్కగారి కృష్ణప్ప, వెంకట సత్య దివాకర్‌ పక్కి, అవ్వారు ముసలయ్య, చంద్రశేఖర్‌ రాజులు పాల్గొన్నారు. అలాగే సమావేశంలో నగరి తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నీలమేఘం, జిల్లా సంక్షేమ అధికారి కుష్బు కొత్తారియా, మున్సిపల్‌ కమిషనర్‌ నాగేంద్రప్రసాద్‌లు పాల్గొన్నారు. అనంతరం వడమాలపేట మండలంలోని అప్పలాయిగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామిని కమిషన్‌ బృందం దర్శనం చేసుకుంది. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్‌ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించారు. 

Updated Date - 2021-10-20T02:20:36+05:30 IST