BBMP elections: బీబీఎంపీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

ABN , First Publish Date - 2022-08-03T18:13:21+05:30 IST

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)కి ఎన్నికలు ఖాయం కానుండంతో అధికార బీజేపీ గెలుపు వ్యూహాల కోసం కసరత్తును

BBMP elections: బీబీఎంపీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

                     - ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గెలుపు బాధ్యతలు


బెంగళూరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)కి ఎన్నికలు ఖాయం కానుండంతో అధికార బీజేపీ గెలుపు వ్యూహాల కోసం కసరత్తును ప్రారంభించింది. మల్లేశ్వరం(Malleshwaram)లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నగరానికి చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. బెంగళూరు(Bangalore)లోని మొత్తం 28 శాసనసభా నియోజకవర్గాల పరిధిలోని 243 వార్డుల తాజా స్థితిగతులపై సమీక్షించారు. బెంగళూరు నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌ అశోక్‌, వసతి శాఖ మంత్రి వీ సోమణ్ణ, తోటల అభివృద్ధి శాఖ మంత్రి మునిరత్న, ఉన్నత విద్య, ఐటీబీటీ శాఖల మంత్రి డాక్టర్‌ సీఎన్‌ అశ్వత్థనారాయణ(Dr. CN Aswatthanarayana), నగరాభివృద్ధి శాఖ మంత్రి బైరతి బసవరాజ్‌ కూడా సమావేశంలో పాల్గొని ఈసారి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, బూత్‌ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపై దృష్టి సారించాలని కోరారు. నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పీసీ మోహన్‌, డీవీ సదానందగౌడ, తేజస్వి సూర్య కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు నళినికుమార్‌ కటిలు మీడియాతో మాట్లాడుతూ నగర పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా బీబీఎంపీ ఎన్నికల గెలుపు బాధ్యతలను అప్పగిస్తామని ప్రకటించారు. బీబీఎంపీ పరిధిలోని బీజేపీకి చెందిన మొత్తం మూడు విభాగాల అధ్యక్షులు, పదాధికారులు హాజరై తమ అభిప్రాయాలను సమావేశంలో తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల వారినే ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తామని, మిగిలిన నియోజకవర్గాలకు ఎంపీలు, ఎమ్మెల్సీలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తామని తెలిపారు. బెంగళూరు నగరాభివృద్ధికోసం  ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే తమ విజయానికి శ్రీరామరక్ష కానున్నాయని కటీల్‌ తెలిపారు.

Updated Date - 2022-08-03T18:13:21+05:30 IST