Apr 13 2021 @ 12:57PM

'అఖండ'గా నటసింహ బాలకృష్ణ... ఉగాది సందర్భంగా టీజర్‌ విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా అంటే ఎన్ని భారీ అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింహా, లెజెండ్‌ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత మూడోసారి వీరి కలయికలో సినిమా అనౌన్స్‌ చేయగానే.. అనౌన్స్‌ చేసిన రోజు నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోతూ వచ్చాయి. ఈ అంచనాలను ముందుగానే ఊహించిన మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను మించేలా బాలకృష్ణతో సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు డైరెక్టర్‌ బోయపాటి శ్రీను. 

బీబీ3  అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తూ వచ్చారు మేకర్స్‌. ఈ క్రమంలో సినిమా టైటిల్‌ ఎలా ఉంటుందోనని అందరిలో తెలియని ఆసక్తి మొదలైంది. ఈ ఆసక్తికి తెర దించుతూ ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు ధీటుగా టైటిల్‌ను 'అఖండ' అని ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా టైటిల్‌ను అనౌన్స్‌ చేయడంతో పాటు టీజర్‌ను కూడా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 

ఇది వరకు విడుదలైన ఓ టీజర్‌లో బాలకృష్ణ ఓ లుక్‌ విడుదల చేసిన చిత్రయూనిట్‌.. ఉగాది సందర్భంగా విడుదల చేసిన 'అఖండ' టీజర్‌లో బాలకృష్ణ మరో లుక్‌ను విడుదల చేసింది. పవర్‌ఫుల్‌ లుక్‌లో బాలకృష్ణ "కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది'' అనే డైలాగ్‌తో చేతిలో త్రిశూలం పట్టుకుని విలన్స్‌ భరతం పట్టడాన్ని టీజర్‌లో చూడొచ్చు. పరమేశ్వరుడికి సంబంధించినో శ్లోకం బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది. మ్యూజిక్ సెన్సేషనల్‌ ఎస్‌.తమన్‌ మరోసారి తన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో సన్నివేశాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు.