అంగడిబజారు ప్రధానదారి బ్లాక్‌

ABN , First Publish Date - 2022-05-16T05:01:18+05:30 IST

చేర్యాల పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎన్నోఏళ్లు కొనసాగుతున్న ప్రధానదారిని బ్లాక్‌ చేయనున్నారు.

అంగడిబజారు ప్రధానదారి బ్లాక్‌
ప్రత్యామ్నాయంగా దారి ఏర్పాటు చేయనుండటంతో కూల్చివేయబడనున్న వాటర్‌ట్యాంక్‌

ఇంటిగ్రే టెడ్‌ వెజ్‌అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణ ం కోసం మార్పు

కూల్చివేయనున్న అర్ధ శతాబ్ద కాలం నాటి వాటర్‌ ట్యాంక్‌

చేర్యాల, మే 15: చేర్యాల పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఎన్నోఏళ్లు కొనసాగుతున్న ప్రధానదారిని బ్లాక్‌ చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం రైతుబజారు పక్కకు మార్చనున్నారు. మార్కెట్‌ నిర్మాణానికి ప్రభుత్వం కొన్నినెలల క్రితం రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ముందస్తుగా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డులో స్థలాన్ని ప్రతిపాదించారు. కానీ దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడనుండడంతో ప్రస్తుతం మునిసిపల్‌ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌, కూరగాయల దుకాణాల స్థానంలోనే నిర్మించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే కూరగాయల దుకాణాలు శిథిలావస్థలో ఉండటంతో పాటు మునిసిపల్‌ కార్యాలయ భవనం అస్తవ్యస్తంగా, అనుకూలంగా లేకపోవడంతో అన్నింటినీ కూల్చేశారు. రెండింటి మధ్య ఎన్నోఏళ్ల ప్రధాన రహదారి ఉన్నది. ఈ దారిలోనే వారాంతపు సంత కొనసాగిస్తున్నారు. నిత్యం ఈ దారి వెంబడి మద్దూరు, ధూల్మిట్ట, నంగునూరుతో పాటు పొరుగు మండలాలకు ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఆంజనేయస్వామి, బాలాజీ కళామందిర్‌ నుంచి దారులున్నా ఈ దారినే ప్రధానంగా వినియోగిస్తున్నారు. కానీ మార్కెట్‌ భవనం కోసం మునిసిపల్‌ కార్యాలయ ప్రదేశం నుంచి ఈ దారిని కలుపుకుని రైతుబజారు వరకు నిర్మించాలని నిర్ణయించారు. ఇదే విస్తీర్ణం మేర దారిని సమీపంలోని రైతుబజారు ఆవరణ నుంచి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. అందుకోసం అర్ధ శతాబ్దానికిపైగా పట్టణ ప్రజల దాహార్తిని తీర్చుతున్న 3 లక్షల లీటర్లకుపైగా సామర్థ్యం కలిగిన వాటర్‌ట్యాంక్‌ను కూల్చివేసేందుకు నిర్ణయించారు. కూల్చివేత అనంతరం రైతుబజారు ఆవరణను ఆనుకుని నూతనంగా దారిని ఏర్పాటుచేయనుండగా, పలువురు వ్యతిరేకిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో సగభాగానికిపైగా నీటిని అందిస్తున్న వాటర్‌ట్యాంక్‌ను కూల్చివేయకముందే నలుదిక్కులా వాటర్‌ట్యాంకులను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించినా ఇప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. ఆయా ప్రతిపాదిత ప్రదేశాలను ఇప్పటికీ ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో నూతన ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టేంత వరకు ఉన్న ట్యాంక్‌ను కూల్చి వేయవద్దని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-16T05:01:18+05:30 IST