లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు

ABN , First Publish Date - 2021-08-06T20:49:38+05:30 IST

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో లాటరైట్ ఖనిజం తవ్వకాలు యధేచ్ఛగా సాగుతున్నాయి.

లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో లాటరైట్ ఖనిజం తవ్వకాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. తవ్వకాలను తక్షణం ఆపాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశించినా దందా సాగిస్తున్నారు. ఇటు అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. సర్కార్ పెద్దల కనుసన్నల్లో లాటరైట్ నిక్షేపాలను కొల్లగొడుతున్నారు. 


విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని జోరుగా లేటరైట్‌ తవ్వకాలు సాగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వెనుక గనుల శాఖ సహకారం ఉందనే అరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్జీటీ ఆదేశాలు వెలువడిన తర్వాత లేటరైట్‌ తవ్వకాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇవేమీ జరగలేదు. తరలించుకుపోతున్న ఖనిజం సర్కారు పెద్దల కోసమే కావడంతో వారంతా కళ్లప్పగించి చూస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిరోజులుగా భారీస్థాయిలో ఖనిజాన్ని తవ్వి తీసుకుపోతున్నారు. 


నాతవరం మండలంలోని బమిడికలొద్దులో 271 హెక్టార్లలో భారీగా లేటరైట్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. అనుమతులు లేని ప్రాంతాల్లో మైనింగ్‌ యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ నాయకుడు మరీదయ్య అనే వ్యక్తి ఎన్జీటీని ఆశ్రయించారు. ఆధారాలూ సమర్పించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ గత నెల 30న తీర్పు వెలువరించింది. మైనింగ్‌ తవ్వకాలను తక్షణం ఆపాలంటూ, దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అక్రమాలకు సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర అటవీ శాఖ, రాష్ట్ర గనులశాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, విశాఖ కలెక్టర్‌ తదితర అధికారులను కమిటీలో నియమించింది. 


ఈ నేపథ్యంలో మైనింగ్‌ దందాను ఆపాల్సి ఉంది. కానీ.. అందుకు విరుద్ధంగా.. బమిడికలొద్దు ప్రాంతంలోకి మూడో వ్యక్తి రాకుండా ప్రైవేటు మనుషులను నియమించి.. భారీగా తవ్వకాలు చేపడుతున్నారు. ఎన్జీటీ ఆదేశించినా జోరుగా తవ్వకాల దందా సాగిస్తున్నారు. రాత్రి 7నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యలో వందలాది టిప్పర్లలో లేటరైట్‌ను తరలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం జల్దాం వరకు రిజర్వ్‌ ఫారెస్ట్‌ మీదుగా అడ్డగోలుగా నిర్మించిన రోడ్డుపై తరలిస్తూ.. చల్లూరు వద్ద ప్రైవేటు డంపింగ్‌ యార్డులో భారీగా నిల్వ చేస్తున్నారు. లేటరైట్‌ తరలిస్తున్న లారీలను అడ్డుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో రాత్రిపూట బీట్‌ పర్యవేక్షించే అటవీ సిబ్బందిని అక్రమార్కులు లోబర్చుకుని ఖనిజాన్ని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. 

Updated Date - 2021-08-06T20:49:38+05:30 IST