విమర్శకుని నోరు నొక్కేందుకే నాటి ‘కుకవి నింద’

ABN , First Publish Date - 2021-09-06T05:55:39+05:30 IST

తిక్కన కాలం నుండీ తెలుగు సాహిత్యం, అప్పటి పద్య సాహిత్య నియమాలకు లోబడి చేసే సద్విమర్శను కూడా పనికి రానిదిగానే నిర్ధారించి- అలాంటి ప్రయత్నాలను ‘కుకవులు’ మాట్లాడే చేతకాని ఈసడింపు మాటలుగా, సర్వాన్ని అందులోకే నెట్టివేయడం.....

విమర్శకుని నోరు నొక్కేందుకే నాటి ‘కుకవి నింద’

తిక్కన కాలం నుండీ తెలుగు సాహిత్యం, అప్పటి పద్య సాహిత్య నియమాలకు లోబడి చేసే సద్విమర్శను కూడా పనికి రానిదిగానే నిర్ధారించి- అలాంటి ప్రయత్నాలను ‘కుకవులు’ మాట్లాడే చేతకాని ఈసడింపు మాటలుగా, సర్వాన్ని అందులోకే నెట్టివేయడం ద్వారా, అది తెలుగు సాహిత్య పురోగతికి ఎంతమాత్రమూ ‘అభిలషనీయమైన తరగతి కాదు’ అనే ముద్రను వేసి - దూరంగా పెట్టింది.


పూర్వసాహిత్యంలో నన్నయ తప్ప మిగిలిన కవులందరూ తమ తమ కావ్యాలలో ఒక నియమంగా ‘కుకవి నింద’ చేశారు. తనకు ముందు తెలుగు భాషలో కవిత్వంగా చెప్పుకోదగిన పద్య రచనలు శాసనాలలో కనిపిస్తూవున్నప్పటికీ, తెలుగులో వెలసిన కావ్యాలలో తనదే మొదటి రచన కావడం వలన, నన్నయకు భారత ఆంధ్రీకరణ అవతారిక రచించే సమయంలో ‘కుకవి నింద’ నియమానికి సంబంధించిన ఆలోచనే కలిగివుండక పోవచ్చునని అనుకోవడం సహేతుకమే అవుతుంది. తిక్కన నాటికి సాహితీ సంరంభాలలో ‘కుకవుల’ను గురించిన ప్రస్తావన స్పష్టంగా మొదలయింది. కవులలో ఈ ‘కుకవుల’నేవారు ఎవరు? వారి గుణగణాలేమిటి అనే సందేహానికి సమాధానంగా అన్నట్లుగా, తిక్కన తన ‘నిర్వచనోత్తర రామాయణం’లో ‘కుకవుల’ను ఇలా వర్ణించాడు:


చ. పలుకులపొందు లేక రస భంగము సేయుచుఁ బ్రాఁతవడ్డమా

టలఁ దమనేర్పు చూపి యొకటన్‌ హృదయం బలరింపలేక యే

పొలమును గానియట్టి క్రమముం దమమెచ్చుగ లోక మెల్ల న

వ్వులఁ బొరయం జరించు కుకవుల్‌ ధరదుర్విటులట్ల చూడఁగాన్‌.

చెప్పేవిషయంలో స్పష్టత లేకుండా, రసభంగం కావిస్తూ, పాతబడిపోయిన విషయాలలో రచనలు చేయడంలోనే తమ నేర్పును చూపిస్తూ (అంటే అప్పటికే కావ్యంగా వచ్చిన విషయంపైనే మరో కొత్త రచన చేయడంలోనే తమ ప్రజ్ఞను వొలకబోస్తూ) సాహిత్యానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలోనూ పాఠకుని హృదయాన్ని అలరించే విధంగా రచనను చేయలేక, ఒక పద్ధతికి లోబడనితనమే తమ గొప్పతనంగా చెప్పుకుంటూ లోకం దృష్టిలో నవ్వులపాలవుతూ చరించే వారే ‘కుకవులు’ - అని పై పద్యం భావం. ఇంత వివరమైన ఈ వర్ణన వలన క్రీ.శ.13వ శతాబ్దంనాటికి తెలుగులో కవులతో పాటుగా ‘కుకవులు’ కూడా తగిన సంఖ్యలో వృద్థి చెందారని తిక్కనగారి పద్యం వలన తెలుస్తుంది. వృద్ధి చెందితే చెందేరుగాక, వారి మానాన్న వారిని పోనీక, ప్రత్యేకంగా పనిగట్టుకుని వారిని గురించి ఒక పద్యం నిండుగా పేర్కొనాల్సిన అవసరం తిక్కనగారికి ఎందుకు కలిగింది? అనేది ప్రశ్న. దానికి సమాధానంగా మనకు అర్థమయేదేమిటంటే, ఈ ‘కుకవి’ అనే వ్యక్తి తన మానాన్న తన రచనలేవో చేసుకుని ఊరుకోక, తాను కూడా కవి కావడం వలన, ఆ ప్రజ్ఞతో, ఇతరుల రచనల జోలికీ వెళ్ళి, వాటిలో తనకు తోచిన తప్పులను లోకానికి ఎత్తి చూపే పనీ చేసేవాడని అవగతమవుతుంది.


ఇప్పటి మాటలలో చేప్పాలంటే, ఇతడు సాహిత్య ‘విమర్శకుడు’ అనబడతాడు.   అయితే, ‘కుకవి’లో ఈ ఉదాత్త విమర్శకుడిని గుర్తించి వానికి తగిన స్థానాన్ని సాహిత్య వ్యాసంగాలలో కల్పించడానికి అప్పటి తెలుగు సాహిత్యం ఇంకా సిద్ధంగా లేదు. అప్పుడే కాదు, ఆ తరువాతి కాలంలో కూడా, సాహిత్య వ్యాసంగానికి సంబంధించిన కార్యకలాపాలలో ఒక క్రియాశీలమైన భూమికను పోషించగలిగే ‘విమర్శకుడ’నే విలక్షణపాత్రధారుడిని తయారుచేసుకునే విచక్షణను పూర్వ తెలుగుసాహిత్యం ఎప్పుడూ చూపలేదు. చేవలేని, లక్షణబద్ధం కాని కవిత్వం చెబుతూ, లోకుల నోళ్లలో నవ్వులపాలవుతూన్నవాడిగా సృష్టించబడి అప్పటికే నిందలపాలవుతున్న ‘కుకవి’ పాత్రధారుడి అస్తిత్వంలోకే, అర్థవంతమైన విమర్శ చేయగలిగి సాహిత్యానికి మేలు చేసే వీలున్న ‘విమర్శకుడి’ని కూడా తోసేసి తన ‘అవిచక్షణ’ను చాటుకుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు.


తమ కావ్యాలలోనూ, కవిత్వంలోనూ ఏదైనా తప్పు ఎత్తి చూపే సాహసం చెయ్యడానికి గానీ, ఆ ఆలోచననే మనసులో తెచ్చుకోవ డానికి గానీ అసలు వీలు లేకుండా కఠిన దూషణ పదజాలంతో ‘కుకవి నింద’లో విమర్శకుడనే బలహీనుడి నోరు నొక్కేసి భయభ్రాంతులకు లోనుచేసే విధంగా ప్రముఖుల కావ్యాలలో సైతం పద్యరచన ఎలా సాగిందో కనుపర్తి అబ్బయామాత్యుని (క్రీ.శ. 1750 ప్రాంతం) రచనయైున ‘అనిరుద్ధ చరిత్రము’లోని ఈ ‘కుకవినింద’ పద్యంలో స్పష్టంగా తెలుస్తుంది.


చ. సుకవుల సూక్తులందు సరసుల్‌ నెరసుల్‌ వెదుకంగఁబోరు మ

క్షిక వితతుల్‌ వ్రణంబు పరికించుగతిం గొదవల్‌ గణించుటల్‌

కుకవుల నైజబుద్ధి తెరలో కథచొప్పున బొమ్మలాడఁగా

నొకకడ హాస్యపుం బ్రతిమ లుండవె పెక్కులు వెక్కిరించుచున్‌. 

‘ఈగల గుంపు చూపు ఎప్పుడూ వ్రణం మీదనే వుంటుందని’ ఉపమిస్తూ, సుకవుల కవిత్వంలో తప్పులు వెదికే సాహసం చేసే విమర్శనాదృష్టి కల వ్యక్తిని ‘ఎప్పుడూ పుండు వైపుకే చూపును వుంచే ఈగ’తో సమానమైనవాడినిగా చేసి చెప్పడం జరిగింది పై పద్యంలో. తప్పులను ఎత్తిచూపడం కుకవుల (విమర్శకుల) నైజబుద్ధి అనీ, వారు నాటకం జరుగుతూండగా, వీక్షకులకు హాస్యం కలిగించడం కోసం రంగస్థలంపై ఒక పక్కన ఉంచబడిన విదూషక ప్రతిమల వంటి వారనీ అబ్బయామాత్యుని పోలిక. ఇంతటి హేయమైన పోలికలతో వర్ణనలు విమర్శను ఏ స్థాయిలో స్వాగతిస్తాయో అర్థం చేసుకోవచ్చు. 


సంస్కృతంలో కాళిదాసు అంతటి వాని కవిత్వంలోనే తప్పులు వున్నాయని నానుడి ప్రసిద్ధమై ఉన్నది కాబట్టి, కావ్యంలో దోషాలు వున్నప్పటికీ వాటిని అంతగా పట్టించుకోకుండా వొప్పులను గొప్పచేసి చెప్పడమే విజ్ఞులైన వారు చేయవలసిన పని అనే ఒక మిథ్యా వాదాన్ని మధ్యే మార్గంగా ‘కుకవి నింద’లో ప్రస్తుతించిన సందర్భాలు   క్రీ.శ. 15-16 శతాబ్దాల నాటి తెలుగు కావ్యాలలో కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి వెన్నెలకంటి సూరనార్యుడు రచించిన ‘ఆంధ్రశ్రీవిష్ణుపురాణము’ లోనిది ఈ క్రింది పద్యం:


ఉ. ఆదరమొప్పఁగా సుకవు లారసి చాటుతరప్రభంధసం

పాదము మేలుమే లనుచుఁ బల్కిన నొప్పు జగత్ప్రసిద్ధమై

కాదని తప్పుఁబట్టి కొఱగామిఁ దలంచినఁ దొంటి కాళిదా

సాది మహాకవీశ్వరులకైనను నేరము లేకయుండునే. 

విమర్శకుడనేవాడు తన విమర్శనాదృష్టిని కాస్త పక్కకు పెట్టి, ఇబ్బందికరమైన చోట్ల రచనలో వున్న దోషాలు తన దృష్టికి రానట్లు చూపులను పక్కకు మరల్చి, అనువైన చోట్ల గుణోత్కృష్టత్వాన్ని ‘మేలు మేలనుచు’ అవసరమైనదానికంటే కాస్త ఎక్కువగానే చేసి, కావ్యాన్ని పలువురి దృష్టిలో ప్రసిద్ధం చేయాలే తప్ప, విమర్శించి దేనికీ పనికిరానిదిగా చేయకూడదని సూరనార్యుని భావం. ఒకవేళ అలా చేయాలని సంకల్పిస్తే మొదలుగా కాళిదాసాది మహాకవుల రచనలను తూర్పార బట్టి, ఆ తరువాతనే ఆనాటి కవుల రచనల వద్దకు రావడం అనే ఆలోచన చెయ్యాలని నియమం కూడా ఈ సందర్భంగా ఆయన పెట్టాడు. 


కావ్యంలో సరసత్వం నిండిన సందర్భాలను వారుగా గ్రహించలేరు, వివరించి చెప్పినా వినడానికి ఇచ్చగించరు, ఎప్పుడూ ‘తప్పులే వెదికి పట్టుకోవడం’ అనే పనిలోనే నిమగ్నులై వుంటారు, మంచి విషయాలను ఎప్పుడూ మెచ్చుకోరు, పోనీ వారంతటవారు ఒక మంచి కావ్యాన్ని రచించే సమర్థత కలిగి వుంటారా? అంటే అందులోనూ నిస్సందేహంగా అసమర్థులు- అయినటువంటి ఈ చెడుగులు (కుకవులు) సత్ప్రబంధాలను వినడాన్ని సైతం సహించజాలరు అంటూ కంకటి పాపరాజు (క్రీ.శ. 18వ శతాబ్దం) తన రచనయైున ‘ఉత్తర రామచరితము’లోని ఈ క్రింది పద్యంలో చాలా కఠినంగా విమర్శించాడు:


 చ. సరసతఁ దామునుం దెలియఁజాలరు చెప్పిన నీసులేక యా

దరణ వహించి యూఁకొనరు తప్పులె పట్టుదు రొప్పుఁగన్న మె

చ్చరు వెడయుక్తులెన్నుదురు శక్తులుగా రొకఁడైన నింపు చే

కుఱ రచియింప నట్టి చెడుగుల్‌ విన నోర్తురె సత్ప్రబంధముల్‌. 

ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వవచ్చు. సారాంశంగా తేలేదేమంటే, తిక్కన కాలం నుండీ తెలుగు సాహిత్యం, అప్పటి పద్యసాహిత్య నియమాలకు లోబడి చేసే సద్విమర్శను కూడా  పనికి రానిదిగానే నిర్ధారించి ప్రయత్న పూర్వకంగానే - అలాంటి ప్రయత్నాలను ‘కుకవులు’ మాట్లాడే చేతకాని ఈసడింపు మాటలుగా, సర్వాన్ని అందులోకే నెట్టివేయడం ద్వారా, అది తెలుగు సాహిత్య పురోగతికి ఎంతమాత్రమూ ‘అభిలషనీయమైన తరగతి కాదు’ అనే ముద్రను వేసి - దూరంగా పెట్టింది అని.


తమ మాటలలో ప్రముఖులైన కవులచేత సైతం ‘సాహిత్య భూతాలుగా’ చిత్రీకరించబడిన ఈ కంటికి కనుపించని మిథ్యా తరగతి అయిన ‘కుకవుల’నే వ్యక్తులను అడ్డంపెట్టుకుని ఆయా కాలాలలో ముందుకు రాజూచిన ఎందెందరు సద్విమర్శకుల నోర్లు నొక్కివేయబడడం జరిగిందో ఇప్పుడు ఊహించడం కష్టం. ప్రతిభావంతులే అయిన కవులు, ‘కుకవులనే’ ఈ కనుపించని మిథ్యా భూతాలకు కావ్యనిర్మాణానికి సమాయత్తమయే తొలి క్షణాలలోనే, అన్నింటికంటే ముందుగానే, అవసరమైనదానికంటే ఎక్కువ భయపడి, ఒక సంప్రదాయంగా తమ కావ్యాల అవతారికలలో నిర్వహిస్తూ వచ్చిన ఈ ‘కుకవి నింద’ అనే అహేతుక జాతర,  ఆయా కాలాలలో ముందుకు రాజూచిన హేతుబద్ధ  సద్విమర్శకులకు ముందుగానే కట్టిన పాతరలాగా     పరిణమించిన దనడానికి సందేహించాల్సిన అవసరం లేదనుకుంటాను. 


వందల యేళ్ళ క్రిందటే ఏ దుర్ముహూర్తానో మొదలై, తరతరాలుగా వస్తూన్న ఈ ‘సద్విమర్శను కూడా తట్టుకోలేకపోవడం’ అనే చెడ్డలక్షణాన్ని మనం ఇంకా మన మనసుల నుంచి దూరం చేసుకోవలసే వుంది.


భట్టు వెంకటరావు

Updated Date - 2021-09-06T05:55:39+05:30 IST