పరాకాష్ఠకు యుద్ధం..!

ABN , First Publish Date - 2022-07-03T06:07:40+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. తెలంగాణపై కన్నేసిన బీజేపీ, తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తోంది....

పరాకాష్ఠకు యుద్ధం..!

ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది. తెలంగాణపై కన్నేసిన బీజేపీ, తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన బీజేపీ ప్రముఖులు రెండు రోజులుగా తెలంగాణలోని పలు నియోజకవర్గాలను చుట్టేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వ్యక్తిగత వైరం పెట్టుకున్న కేసీఆర్‌ ఎక్కడా తగ్గడం లేదు. నరేంద్ర మోదీని టార్గెట్‌గా పెట్టుకొని ఆయనపై ఫ్లెక్సీ వార్‌కు తెర లేపారు. పార్టీల మధ్య ఉండాల్సిన రాజకీయ వైరం వ్యక్తుల మధ్య శత్రుత్వానికి దారితీసింది. ప్రధానమంత్రిగా మోదీని గుర్తించడానికి కూడా కేసీఆర్‌ ఇష్టపడటం లేదు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి వస్తున్న ప్రధానమంత్రికి పోటీగా ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను రాష్ర్టానికి శనివారమే ఆహ్వానించారు. బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వయంగా స్వాగతం పలికిన కేసీఆర్‌, ప్రధాని మోదీకి మాత్రం స్వాగతం చెప్పలేదు. యశ్వంత్‌ సిన్హా గెలుపు అసాధ్యమని తెలిసినా కేసీఆర్‌ చాలా హడావుడి చేస్తున్నారు. కేసీఆర్‌ లక్ష్యం ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీని ఆయన ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్న అన్ని సందర్భాలలోనూ పరాజయాన్నే చవిచూశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ను తప్పించి బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకొని ఓడిపోయారు.


నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ను ప్రత్యర్థిగా ప్రకటించుకోవడంతో విజయం సాధించారు. హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీని బూచిగా చూపడంతో ఆ పార్టీ అనూహ్య ఫలితాలను సాధించింది. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణ వల్ల బీజేపీకి తెలంగాణలో ఎంత ప్రయోజనం కలుగుతుందో తెలియదు గానీ కేసీఆర్‌ పోకడల వల్ల ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరి నోటి వెంటా బీజేపీ పేరు వినిపిస్తోంది. ఇప్పటివరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే బలంగా కనిపించిన బీజేపీ, ఇప్పుడు దక్షిణ తెలంగాణ జిల్లాలకు కూడా విస్తరిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రభావం అంతంత మాత్రంగా ఉండే ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కూడా యువత ఇప్పుడు బీజేపీ జపం చేస్తున్నారు. ఈ పరిణామం కేసీఆర్‌ను కచ్చితంగా ఆందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్‌ పరపతి సన్నగిల్లింది. యువతలో కేసీఆర్‌ పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలంటే బాగా కష్టపడాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ లభించే పరిస్థితి లేదు. టీఆర్‌ఎస్‌ ప్రథమ స్థానంలో, కాంగ్రెస్‌ ద్వితీయ స్థానంలో, బీజేపీ తృతీయ స్థానంలో ఉన్నట్టు వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మరింత పుంజుకొని ద్వితీయ లేదా ప్రథమ స్థానానికి చేరుకుంటే అందుకు కేసీఆర్‌ కారకుడు అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


నరేంద్ర మోదీ, అమిత్‌ షాల హయాంలో అనేక రాష్ర్టాలలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. త్రిపుర సహా అన్ని ఈశాన్య రాష్ర్టాలలో ఆ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఈ పరిస్థితి రావడం ఆశ్చర్యమే. అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలోకి రావడం సాధ్యమేనని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ విషయంలో కేసీఆర్‌ దుందుడుకు పోకడలు కూడా ఇందుకు ఉపకరించే విధంగా ఉన్నాయి. బీజేపీతో కేసీఆర్‌ ముఖాముఖి తలపడటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కేసీఆర్‌కు కష్టాలే. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఓట్లు చీలి తాను లాభపడవచ్చునని కేసీఆర్‌ తలపోస్తున్నారు గానీ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత కూడా బీజేపీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే కేసీఆర్‌ కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే అవుతుంది. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సైతం పట్టు సాధించడం కోసం బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఈ రెండు జిల్లాలలో కూడా యువత ఇప్పటికే బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడం కూడా ఆ పార్టీకి ఊపునిస్తోంది. కొండా కుటుంబానికి రంగారెడ్డి జిల్లాపై మంచి పట్టు ఉంది. కొండా నిర్ణయంతో ఇప్పటివరకూ కాంగ్రెస్‌, బీజేపీలలో ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక తటస్థంగా ఉన్న పలువురు కీలక నాయకులు కూడా పునరాలోచనలో పడ్డారు. అదే సమయంలో తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకున్న కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పట్టుదలగా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి ఆయన సిద్ధపడుతున్నట్టు సమాచారం. రాజకీయంగా విభేదించాల్సిన చోట వ్యక్తిగత వైషమ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామం రాజకీయాల్లో మంచిది కాదు. అయినా ముందుగా కేసీఆర్‌ కాలుదువ్వారు. ఫలితాన్ని అనుభవించాల్సింది కూడా ఆయనే. ప్రధాని మోదీ మనస్తత్వం తెలిసిన వారు ఆయనతో వ్యక్తిగత వైరం పెట్టుకోవడానికి జంకుతారు. శివసేన అధినేతగా ఒక వెలుగు వెలిగిన ఉద్ధవ్‌ ఠాక్రేకు ఏమి జరిగిందో చూస్తున్నాం! అలాగే చంద్రబాబు నాయుడును ప్రధాని ఇప్పటికీ దూరం పెడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్‌ వంతు వచ్చింది. డబ్బు ఉంది గదా అని హైదరాబాద్‌ నగరాన్ని ఫ్లెక్సీలతో నింపినా, పత్రికలకు పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చినా కేసీఆర్‌ పరపతి అమాంతం పెరిగిపోదు. ఎన్నికల ఫలితాలను డబ్బు మాత్రమే ప్రభావితం చేయబోదని హుజురాబాద్‌ ఉప ఎన్నిక రుజువు చేసింది. చేతిలో అధికారం ఉన్నప్పుడు అంతా పచ్చగానే కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు యూపీఏను నడిపిన కాంగ్రెస్‌ కూడా ఇలాగే భావించింది. ఇప్పుడా పార్టీ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ అంటూ అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్‌ కోలుకోవడం కష్టం. కార్యకర్తలు, నాయకుల బలం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నిలదొక్కుకోగలదు. తెలంగాణ సెంటిమెంట్‌ ఆధారంగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష రాజకీయాల్లో మనగలగడం సులువు కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో ఉద్ధానపతనాలను చవిచూడటం మనం చూశాం. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ విస్తరించడానికి ఆ పార్టీ కృషి కంటే కేసీఆర్‌ చర్యలే ప్రధాన కారణం అవుతాయి. ఫలితం కూడా ఆయనే అనుభవించాలి. ఢిల్లీ సుల్తాన్లకు, హైదరాబాద్‌ నవాబులకు మధ్య మొదలైన జంగ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూద్దాం! 


మూడేళ్లకే ముచ్చెమటలు!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల విషయానికి వద్దాం. మంత్రులు, శాసనసభ్యుల్లో నిరాశ.. నిస్పృహ.. నిర్వేదం! ప్రజల్లో నిరసనలు.. అసహనం.. ఆగ్రహావేశం! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల పాలన తర్వాత రాష్ట్ర ముఖచిత్రం ఇది. నిన్నటివరకు తమకు తిరుగులేదనీ, 2024 తర్వాత కూడా అధికారం తమదేననీ భరోసాగా తిరుగుతూ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు పాల్పడిన అధికార పార్టీలో ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు? ముఖ్యమంత్రికి తప్ప మిగతా వారిలో నిర్వేదం ఏర్పడటానికి కారణం ఏమిటి? కొంతకాలం క్రితం వరకు వైసీపీ నాయకుల సభలకు, ముఖ్యంగా జగన్మోహన్‌ రెడ్డి సభలకు విరగబడి వచ్చిన జనం, ఇప్పుడు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఉన్నట్టుండి పరిస్థితిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల వరకు మంత్రులు, శాసనసభ్యులు అధికారాన్ని అనుభవిస్తూ ఎంజాయ్‌ చేశారు. తాము ఏం చేసినా అందుకు ప్రజామోదం ఉందన్న భ్రమల్లో జీవించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలతో ‘గడప గడపకు’ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహించడంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికార పార్టీ ముఖ్యులకు తెలిసి వచ్చింది. నవరత్నాల పేరిట అప్పులు చేసి డబ్బులు పంచుతూ ఉండటంతో ప్రజలు తమతోనే ఉంటారని మంత్రులు, శాసనసభ్యులు నమ్మారు. ఇక జగన్మోహన్‌రెడ్డి అయితే తన గ్రాఫ్‌కు తిరుగులేదని, వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లూ వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదని చెప్పుకొన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పాగా వేయడం ఖాయమని జగన్‌ ప్రకటించారు. అయితే తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై ప్రజలకు దూరంగా ఉంటున్న జగన్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియడం లేదు. కుప్పం సంగతి దేవుడెరుగు.. వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉంటున్న పులివెందులలోనే ప్రభుత్వంపై ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో ఉంది.


2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌, కక్షసాధింపు చర్యలకు దిగడంతో ప్రతిపక్షానికి చెందినవారు చెల్లాచెదురయ్యారు. పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడమే వారికి ప్రధాన దినచర్యగా మారింది. దీంతో అధికార పార్టీ నాయకుల్లో బరితెగింపు ధోరణులు ప్రబలాయి. రాజకీయాల్లో ఇంతవరకూ ఉపయోగించని భాషను వాడిన మంత్రులు, శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దగ్గర ప్రోత్సాహం లభించడంతో ప్రతిపక్ష నాయకుడిని దూషించడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడిన జోగి రమేశ్‌ను మంత్రిని చేయడం ద్వారా జగన్మోహన్‌రెడ్డి తన నైజాన్ని మరోమారు చాటుకున్నారు. రాష్ట్రంలో అనాగరిక, అరాచక పరిస్థితులు ఏర్పడటాన్ని ప్రజలు గమనిస్తూ వచ్చారు. అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకు కూడా కానరాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పరాకాష్ఠకు చేరింది. నమ్మి అధికారం కట్టబెడితే జగన్మోహన్‌ రెడ్డి రాష్ర్టాన్ని నాశనం చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యాపించింది. తాము అమలు చేస్తున్న సోషల్‌ ఇంజనీరింగే తమను ఆదుకుంటుందని అధికార పార్టీ నేతలు భావించారు గానీ అది కూడా వికటించింది. అధికారం అంతా కొద్దిమంది వ్యక్తుల వద్దే కేంద్రీకృతమైందని, దశాబ్దాలుగా తమకు అందుతున్న పథకాలకు నవరత్నాల పేరిట గండికొట్టారన్న విషయాన్ని ఆయా వర్గాల ప్రజలు గ్రహించారు. ఎక్కడికక్కడ అధికార జులుం పెరిగిపోవడంతో ప్రజల్లో అసహనం పేరుకుపోయింది. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలుకాకపోవడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పొడచూపాయి. మొదటి రెండు సంవత్సరాలు ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి భయపడి నోరెత్తని ప్రజలు, ఇప్పుడు తమ వద్దకు వచ్చిన మంత్రులు, శాసనసభ్యులను ఎక్కడికక్కడ నిలదీయడం మొదలెట్టారు. అభివృద్ధి పనులు ఎక్కడ? అంటూ ప్రశ్నించడం మొదలైంది. ‘ఈ మూడేళ్లలో మీకు అంత డబ్బు పంచాం.. ఇంత డబ్బు పంచాం’ అని వివరించడానికి ప్రయత్నించిన మంత్రులు, శాసనసభ్యులను ‘ప్రభుత్వం విధిస్తున్న పన్నుల భారం మాటేమిటి?’ అని నిలదీస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఈ పరిణామాలను ఊహించలేదు.


ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌!

సంక్షేమ పథకాల మాటున తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకున్న ‘జగన్‌ అండ్‌ కో’కు ప్రజలు షాక్‌ ఇచ్చారు. అదే సమయంలో పార్టీలో లుకలుకలు కూడా బయటికొచ్చాయి. దీంతో శాసనసభ్యులు, మాజీ మంత్రులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించడం మొదలెట్టారు. ‘ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌’ అని బహిరంగంగానే అంగీకరించడం మొదలెట్టారు. నీలి మీడియా, కూలి మీడియా సహకారంతో వాస్తవాలకు మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నప్పటికీ ప్రజలు అన్నీ తెలుసుకుంటున్నారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు కొంతమంది పార్టీ నాయకులు ప్రజల పక్షం వహించిన మీడియాపై చిందులు వేయడం మొదలుపెట్టారు. తనను ఒక్కడిని చేసి దుష్టచతుష్టయం దాడి చేస్తోందంటూ జగన్మోహన్‌రెడ్డి సానుభూతి పొందే ప్రయత్నాలు మొదలెట్టారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో తండ్రి రాజశేఖర్‌రెడ్డి మరణించడం వల్ల ఏర్పడిన సానుభూతిని సొమ్ము చేసుకున్న జగన్‌, ఇప్పుడు మళ్లీ సానుభూతిపైనే ఆధారపడాలని అనుకుంటున్నారు కాబోలు. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్‌, తన సొంత బాబాయిని హత్య చేసిన వారిని కూడా రక్షించే ప్రయత్నం చేయడాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ‘‘ఎంతమంది కట్టకట్టుకువచ్చినా తన వెంట్రుకలు కూడా పీకలేరు’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాంటప్పుడు ‘నన్నొక్కడిని చేశారు..’ అన్న శోకాలు ఎందుకో? వెనకటికి ఎవడో ‘‘తల్లీతండ్రి లేనివాడిని, నాపై కరుణ చూపండి’’ అని కోర్టులో న్యాయమూర్తిని వేడుకున్నాడట. తీరాచూస్తే తన తల్లిదండ్రులను హత్య చేసింది ఆ ప్రబుద్ధుడే. అలా చంపాక అనాథను నేను అని వాపోయాడట. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ చంపేసి రాష్ర్టాన్ని అప్పులపాలు చేసిన జగన్‌ సానుభూతికి అర్హుడా? అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సామాన్య ప్రజలకు మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్నది ఎవరు? ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే ఇదెక్కడి న్యాయం అంటూ శోకాలు పెట్టడం వింతగా ఉంది. సొంత మీడియాలో తన మనుషులతో రాయించుకుంటున్న కథనాలనే నమ్ముతూ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న మీడియాను నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిందించడం వల్ల ముఖ్యమంత్రికి వాస్తవాలు తెలియకుండా పోతాయి. మీడియా చెప్పినంత మాత్రాన ప్రజలు అధికారపక్షాన్ని నిలదీయరు గదా! గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతిని కేంద్రీకృతం చేసిన జగన్‌ రెడ్డి, తన పాలనలో అవినీతికి తావుండదని చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పేదలకు నాసిరకం మద్యం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని మీడియా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లిక్కర్‌ షాపుల వద్ద కాసేపు నిలబడితే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసిన శాసనసభ్యులపై ఆ మధ్య ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. దీంతో పార్టీ ప్లీనరీ సమావేశాల్లో శాసనసభ్యులు తమ మనోభావాలను బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ‘‘గడప లోపలే మన భోగమంతా, గడప దాటితే ప్రజలు నిలదీస్తున్నారు’’ అని శాసనసభ్యులే వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘డబ్బు పంచితే ముఖ్యమంత్రికి పేరు వస్తుంది. అభివృద్ధి పనులు చేపడితే శాసనసభ్యులకు పేరు వస్తుంది. చిన్న రోడ్డు వేయాలన్నా డబ్బు ఉండటం లేదు. ఇంతకుముందు చేసిన పనులకే బిల్లులు బకాయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శాసనసభ్యులు తలెత్తుకు తిరగడం ఎలా’’ అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమ పరిస్థితి ఏమిటంటూ కార్యకర్తలు నిలదీస్తున్నారు. దీంతో ‘‘మీరు చెప్పిన వారికే కదా వలంటీర్‌ ఉద్యోగాలు ఇచ్చింది? ఇంకేం చేయాలి?!’’ అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్‌ మంత్రులు సైతం పరిస్థితులను గమనించి నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. సకల శాఖా మంత్రిగా పేరుపొందిన సజ్జల రామకృష్ణా రెడ్డి ముఖంలో చిరునవ్వులు మాయమయ్యాయి. ప్రశ్నించే ప్రయత్నం చేసే విలేకరులపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో బాధ్యతారహితమైన ప్రతిపక్షం, మీడియా ఉన్నాయని ఆయన నిందిస్తున్నారు గానీ ప్రభుత్వమే బాధ్యతారహితంగా పనిచేస్తోందన్న వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టపడటం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడటం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తొక్కిపెట్టి ఉంచవచ్చనుకుంటే పప్పులో కాలేసినట్టే. ముఖ్యమంత్రి సభలకు తీసుకువస్తున్న జనం మధ్యలో వెళ్లిపోకుండా పోలీసులను కాపలా పెట్టడం దేనికి సంకేతం? మంత్రులు, శాసనసభ్యుల సమావేశాల్లో కుర్చీలు ఖాళీగా ఉండటానికి కారణం ఎవరు? ఎవరినో నిందించే బదులు సజ్జల వంటివారు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. నా వెంట్రుకలు కూడా పీకలేరు అని ఘీంకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి, తన సభలకు వస్తున్న జనం మధ్యలోనే వెళ్లిపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. కేవలం మూడేళ్ల పాలనకే ఒక ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఏర్పడటానికి కారణం ఏమిటో అన్వేషించుకోవాలి. మాట్లాడితే మన ప్రభుత్వం.. మంచి చేస్తున్న ప్రభుత్వం అని చెప్పుకొనే జగన్మోహన్‌ రెడ్డి ఆ ‘మనం’ ఎవరో చెప్పాలి? ‘మంచి పనులు’ అంటే ఏమిటో విశదీకరించాలి. డబ్బులు పంచడమే మంచి పని అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్న కంపెనీలు మినహా ఈ ముఖ్యమంత్రి చొరవతో ఏర్పాటైన కంపెనీ లేదా పరిశ్రమ ఒక్కటైనా ఉందా? గత ప్రభుత్వ కృషి వల్ల వచ్చిన ర్యాంకులను తమ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేయడం ఆత్మవంచనే అవుతుంది. జగన్మోహన్‌ రెడ్డికి ఇప్పటికీ తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్న పార్టీలు గానీ, పరోక్షంగా సహకరిస్తున్న వ్యక్తులు గానీ ఆయన ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందని బాహాటంగా చెప్పగలరా? నో డౌట్‌! ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ అండ్‌ కో ఆత్మపరిశీలన చేసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో ఇప్పటికే పక్కచూపులు చూస్తున్న పలువురు శాసనసభ్యులు, ఇతర నాయకులు కంచె దాటడం ఖాయం. ముఖ్యమంత్రి వెంట్రుకలను ఎవరూ పీకనక్కర్లేదు, ప్రజలే పీకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంకా రెండేళ్లు భరించాలా? అన్న భావన ఎందుకు ఏర్పడిందో జగన్‌ అండ్‌ కో తెలుసుకొనే ప్రయత్నం చేయడం వారికే మంచిది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంకా మూడు నెలలు భరించాలా? అన్న అభిప్రాయం వినపడేది. ఇప్పుడు ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే ఇటువంటి అభిప్రాయం వినిపించడం జగన్‌ సాధించిన ఘనత అని చెప్పుకోవచ్చు. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడానికైనా, వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోయినా అందుకు స్వయంకృతాపరాధమే కారణం అవుతుంది.

ఆర్కే

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-07-03T06:07:40+05:30 IST