కదంతొక్కిన పారిశుధ్య కార్మికులు

ABN , First Publish Date - 2021-06-15T05:56:15+05:30 IST

తమ డిమాండ్‌లను పరిష్కరించాలంటూ గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సోమవారం కదంతొక్కారు

కదంతొక్కిన పారిశుధ్య కార్మికులు
ర్యాలీ నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు

జీవీఎంసీ కార్యాలయం ఎదుట భారీ నిరసన

తొలిరోజు సమ్మెలో భాగంగా  ఆందోళన

విశాఖపట్నం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్‌లను పరిష్కరించాలంటూ  గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో  పారిశుధ్య కార్మికులు సోమవారం కదంతొక్కారు. రెండు రోజుల సమ్మెలో భాగంగా  జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని లోపలకు వెళ్లనీయకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీకుమార్‌ మాట్లాడుతూ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ అప్కోస్‌  పరిధిలోకి తేవాలని, పెండింగ్‌లో ఉన్న హెల్త్‌ అలెవెన్స్‌లను తక్షణం విడుదల చేయాలని, కార్మికులకు కరోనా కాలంలో రక్షణ పరికరాలు అందించాలని, కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె సరఫరా చేయాలని, 60 ఏళ్లు నిండిన , విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో సోమ, మంగళ వారాల్లో సమ్మెకు దిగాలని నిర్ణయించామన్నారు. అందులోభాగంగా సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. తమ డిమాండ్‌లను తక్షణం పరిష్కరించాల్సిందేనని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. జీవీఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తామని నేతలు కోరినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడంతో ధర్నా విరమించి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా కార్మికులు విధులను బహిష్కరించి పాల్గొనడంతో నగరంలో పారిశుధ్యంపై ప్రభావం పడింది. 


Updated Date - 2021-06-15T05:56:15+05:30 IST