బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

ABN , First Publish Date - 2022-10-02T06:27:32+05:30 IST

ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో అంబరాన్నంటాయి.

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..
వేములవాడ మూలవాగులో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

- వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ ఉత్సవాలు

- హాజరైన రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై

వేములవాడ, అక్టోబరు 1: ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో అంబరాన్నంటాయి.  ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఏడో రోజునే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకునే ఆనవాయితీలో భాగంగా శనివారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని బతుకమ్మను మూలవాగులో నిమజ్జనం చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలతో మూలవాగు ప్రాంతం సందడిగా మారింది. బతుకమ్మ ఉత్సవాలలో చివరి అంకమైన ఏడో రోజు తంగేడుపూలు, గూనుగుపూలు, బంతిపూలు, చిట్టిచేమంతులు, పట్టుకుచ్చులతో పాటు రకరకాల పూలు, రంగులు, మధ్యలో గౌరమ్మను ఉంచి బతుకమ్మలను పేర్చారు.  తొలుత ఇంటి ఆవరణలో బతుకమ్మను ఉంచి ఆడిపాడారు. అనంతరం  ప్రధాన కూడళ్లు,  మూలవాగు వద్ద బతుకమ్మను వేడుతూ, కొనియాడుతూ ఆడుకున్న మూలవాగు నీటి ప్రవాహంలో, బతుకమ్మ తెప్పలో నిమజ్జనం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ వేములవాడలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి   సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

 

22 లక్షలతో భారీ ఏర్పాట్లు..

వేములవాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ ఉత్సవాల కోసం సుమారు 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేశారు. మూలవాగులోని బతుకమ్మ తెప్ప ప్రాంతంలోనూ, పలు వార్డులలో విద్యుద్దీపాలు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లపై మొరం పోసి చదును చేశారు. డీఎస్పీ కే.నాగేంద్రచారి, పట్టణ సీఐ  వెంకటేశ్‌ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు.  


Updated Date - 2022-10-02T06:27:32+05:30 IST