అంబరాన్నంటిన సంబరం

ABN , First Publish Date - 2020-10-25T06:55:13+05:30 IST

సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రంగు రంగుల పూలతో విభిన్న రూపాల్లో మహిళలు బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు.

అంబరాన్నంటిన సంబరం

ఘనంగా సద్దల బతుకమ్మ

పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు

మహాశక్తి ఆలయంలో వేడుకలను ప్రారంభించిన ఎంపీ


కరీంనగర్‌ కల్చరల్‌, అక్టోబరు 24: సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రంగు రంగుల పూలతో విభిన్న రూపాల్లో మహిళలు బతుకమ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్ర్తాలు ధరించి ఒక్కచోటగా చేరి బతుకమ్మ ఆడారు. పాటలు పాడి వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. 


మంత్రి గంగుల నివాసంలో...

రాష్ట్ర బీసీ  సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నివాసంలో ఆయన సతీమణితోపాటు కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆట ఆడారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. 


మహాశక్తి దేవాలయంలో...

చైతన్యపురి మహాశక్తి దేవాలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆడారు. ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ వేడుకల్లో పాల్గొనగా యూట్యూబ్‌ ఫేమ్‌, గాయని కనుకమ్మ పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహపరిచారు. 31వ డివిజన్‌లో మేయర్‌ సునీల్‌రావు సతీమణి అపర్ణ డివిజన్‌వాసులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు, డివిజన్‌ వాసులు పాల్గొన్నారు. 59వ డివిజన్‌లో జ్యోతినగర్‌ కురుమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆడారు. టవర్‌సర్కిల్‌, ప్రకాశంగంజ్‌లో మహిళలు కోవిడ్‌ దృష్ట్యా తక్కువ సంఖ్యలో హాజరై వైవిధ్య భరిత బతుకమ్మలను నిలిపి ఆటాపాటలతో ఆకట్టుకున్నారు. 37వ డివిజన్‌ రాంనగర్‌లో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ ఆధ్వర్యంలో రమాసహిత సత్యనారాయణస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయం ముందు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఆడారు.


ముఖ్య అతిథులుగా మంత్రి గంగుల కమలా కర్‌, మేయర్‌ సునీల్‌రావు హాజరయ్యారు. 42వ డివిజన్‌లో కార్పొరేటర్‌ మేచినేని వనజా అశోక్‌రావు ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్క్‌ఫెడ్‌ గ్రౌండ్‌లో కార్పొరేటర్‌ బోనాల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడు కలు ఘనంగా జరిగాయి. నగరశివారులోని మానేరు డ్యాం లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, టౌన్‌ ఏసీపీ అశోక్‌, ట్రైనీ ఐపీఎస్‌ సాధనరష్మి పెరుమాళ్‌ హాజరై బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 35వ డివిజన్‌ సప్తగిరికాలనీలో కార్పొరేటర్‌ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, డివిజన్‌వాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T06:55:13+05:30 IST