బాసూ.. ఏమైందీ కేసు?

ABN , First Publish Date - 2021-01-19T08:02:50+05:30 IST

పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిది వివాదాస్పద నేపథ్యం! పాత సంగతులు పక్కనపెడితే.. ఇప్పుడు రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం పెను సంచలనం సృష్టిస్తోంది.

బాసూ.. ఏమైందీ కేసు?

  • విగ్రహాల ధ్వంసంపై పాస్టర్‌ ప్రవీణ్‌ స్వీయ ప్రకటన
  • ఆధారాలతో సహా ఫిర్యాదుతో తప్పనిసరై కేసు నమోదు!
  • సీఐడీ అరెస్టు చేసి ఐదు రోజులైనా అంతులేని గోప్యత
  • రిమాండుకు పంపారా... కస్టడీకి తీసుకున్నారా?
  • కేసులో పురోగతిపై పోలీసులు ‘గప్‌చుప్‌’
  • ‘నిష్పాక్షిక దర్యాప్తు’ ప్రకటనపై సందేహాలు
  • ‘కుట్ర’ అంటూ విపక్ష సానుభూతిపరులపైనే గురి


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తిది వివాదాస్పద నేపథ్యం! పాత సంగతులు పక్కనపెడితే.. ఇప్పుడు రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం పెను సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో ‘నేనే విగ్రహాలు పగలగొట్టించాను’ అని ఎవరు చెప్పినప్పటికీ పోలీసులు తీవ్రంగా స్పందించాలి. కానీ.. ప్రవీణ్‌ చక్రవర్తి విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి ఆధారాలతో సహా గుంటూరులో ఫిర్యాదు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనపై ఆరు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఈనెల 13న  సీఐడీ పోలీసులు ప్రవీణ్‌ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులే ధ్రువీకరించారు. కానీ... ఆయన అరెస్టుకు సంబంధించిన వివరాలేవీ బయటపెట్టలేదు. రిమాండుకు  పంపించారా? కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తారా? ఏయే సంఘటనల్లో ఆయన ప్రమేయం ఉంది? ఇవేవీ తెలియవు.  తూర్పు గోదావరి జిల్లాలో ఆయన నిర్వహిస్తున్న సంస్థల్లో సోదాలు నిర్వహిస్తామన్నారు కానీ.. ఇప్పటిదాకా ఆ ఊసే లేదు. అంతా ‘గప్‌చుప్‌’! విగ్రహాల విధ్వంసం వెనుక ‘విపక్షాల ప్రత్యక్ష ప్రమేయం’ అంటూ సోషల్‌ మీడియా పోస్టింగ్‌లనే ఎత్తిచూపించిన పోలీసు ఉన్నతాధికారులు... ప్రవీణ్‌ విషయంలో కిమ్మనడంలేదు. పైగా.. ‘అది పాత వ్యవహారం. ఇటువంటి వాటిని ఎవరైనా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవ’ని హెచ్చరించడం గమనార్హం.


ఇదేనా ‘నిష్పాక్షికత’?

విగ్రహాల విధ్వంసం కేసుల్లో నిష్పాక్షిక దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ, పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి ఉదంతంతో ఇదంతా ఉత్తిదే అని తేలిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘విగ్రహాల ధ్వంసం టీడీపీ, బీజేపీ కుట్ర’ అని ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు చేసే రాజకీయ ఆరోపణలకు ‘బలం చేకూర్చడంపైనే’ పోలీసులు దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. దీనికి సంక్రాంతికి ముందు, ఆ తర్వాత డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పిన వివరాలే నిదర్శనమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆలయాల ధ్వంసానికి సంబంధించి నమోదైన 44 కేసులకుగాను, 29 కేసుల్లో నిందితులను అరెస్టు చేశామని.. అందు లో రాజకీయ కుట్రకు సంబంధించి ఆధారాలు లభించలేదని డీజీపీ సవాంగ్‌ భోగి రోజు ప్రకటించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదుకానీ... తొమ్మిది కేసుల్లో టీడీపీ, బీజేపీ సానుభూతిపరుల ‘ప్రత్యక్ష ప్రమేయం’ ఉందని తెలిపారు. ఆయన విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూసినా... అందులోని ఏడు కేసులు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారానికి సంబంధించినవే! ఒకటి.. గుప్త నిధులకోసం, మరొకటి భూవివాదం నేపథ్యంలో జరిగిన ఘటన! 


చూడు... ఒకవైపే చూడు!

‘మాది ఖాకీ కులం. మాకు పార్టీలు, మతాలతో సంబంధం లేదు’ అని పోలీసులు చెబుతున్నదానికీ... నిజంగా జరుగుతున్నదానికీ సంబంధం లేదనే విమర్శలున్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... 


వైసీపీ నేతలను, మంత్రులను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులపై ఫిర్యాదు అందడమే ఆలస్యం... పోలీసులు ఆగమేఘాల మీద ‘నిందితులను’ అరెస్టు చేసిన ఘటనలు ఎన్నో. ఎందుకంటే.. వారంతా విపక్ష సానుభూతిపరులు. కానీ... కోర్టులు, న్యాయమూర్తులను దూషించిన కేసుల్లో ఎంపీ నందిగం సురేశ్‌, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి తదితరులపై కేసులు నమోదు చేయాలన్న హైకోర్టు ఆదేశాలకే దిక్కులేదు. ఎందుకంటే వీళ్లంతా అధికార పక్షం. 


గతేడాది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి అనుచరుడి హత్య జరిగింది. నిందితులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సహాయకుడితో ఫోనులో సంభాషించారంటూ మాజీ మంత్రిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవల రాజధాని గ్రామాల్లో ఎస్సీల్లోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ మరణించింది. ఎంపీ సురేశ్‌ ప్రత్యర్థి వర్గాన్ని రెచ్చగొట్టడమే ఘర్షణకు కారణమని, ఆయనపై కేసు పెట్టాలని బాధితులు ధర్నా చేయాల్సి వచ్చింది. ‘న్యాయం చేస్తాను’ అని హోంమంత్రి సుచరిత ఇచ్చిన హామీకి విలువలేదు.


కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమాలపై గళం విప్పుతున్న నందం సుబ్బయ్య అనే బీసీ నేత హత్య జరిగింది. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎమ్మెల్యేపై కేసు పెట్టలేదు. ఆ తర్వాత టీడీపీ నేతల ఆందోళనలు, ఒత్తిళ్లతో ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చారు!


తాడిపత్రి ఎమ్మెల్యే నేరుగా అనుచరులతో, మారణాయుధాలతో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి హల్‌చల్‌ చేశారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. కానీ... దీనంతటికీ కారణమైన ఎమ్మెల్యేపై మాత్రం చర్యల్లేవ్‌!

Updated Date - 2021-01-19T08:02:50+05:30 IST