Abn logo
Nov 27 2020 @ 00:42AM

బ‌స్తీ దవాఖానా‌లు- పేదల ప్రాణ‌దాత‌లు

ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉన్నా ప్రజ‌లు నిమ‌గ్నం కాకుండా ప్రజారోగ్యాన్ని ప‌రిర‌క్షించ‌డం అసాధ్యం. ప్రజ‌లు కూడా ఆరోగ్య ప‌రిర‌క్షణ‌కు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. బ‌స్తీ దవాఖానాల రూపంలో ప్రభుత్వం క‌ల్పిస్తున్న స‌దుపాయాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి. 


ఆక‌లి,- ఆరోగ్యం ఈ రెండింటి స‌మాహార‌మే మాన‌వ జీవితం. ఆక‌లిని తీర్చుకునేందుకు, ఆరోగ్యాన్ని ర‌క్షించుకునేందుకు మ‌నిషి ప్రతి క్షణం ప‌రిత‌పిస్తూనే ఉంటాడు. అయితే ఈ ప్రయత్నంలో వ్యక్తికి ప్రభుత్వాల సంక‌ల్పం, చేయూత అత్యవసరం. ప్రభుత్వాలు పౌరుని పట్ల అత్యంత ప్రధానమైన ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు తమ వంతు కృషి చేస్తూనే ఉంటాయి. ప్రజల ఎడ‌ల నిబద్ధత సంపూర్ణంగా ఉన్న నేత‌ల సార‌థ్యంలోని ప్రభుత్వాలు ఈ కృషిలో మరింత ముందుంటాయి. త‌ద్వారా ప్రజలకు మ‌రింత‌గా చేరువ‌వుతాయి.


కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఇటీవ‌ల తీసుకున్న బ‌స్తీ దవాఖానాల ఏర్పాటు నిర్ణయం ప్రజ‌ల‌కు ప్రయోజ‌న‌క‌ర‌మైన పాల‌న అందించ‌డంలో కీల‌క‌మైన ముంద‌డుగు. పేద ప్రజ‌లను రోగాల బారినప‌డ‌కుండా కాపాడటంలో, ఒక‌వేళ వాటి బారిన ప‌డినా ప్రాథమిక స్థితిలోనే గుర్తించి వాటిని అరిక‌ట్టడంలో బ‌స్తీ దవాఖానా‌లు ప్రముఖ పాత్ర వ‌హిస్తాయి. పేద‌ల రోగాల‌కు ప్రధాన కార‌ణం వారు నివాస‌ముండే ప్రాంతం. అప‌రిశుభ్రమైన ప్రాంతంలో నివాస‌ముండ‌డం అనివార్యమైన పేద‌లు ప‌దేప‌దే రోగాల బారినప‌డతారు. వాటిని ప్రారంభంలోనే గుర్తించి త‌గు చికిత్స అందించ‌గ‌లిగితే అవి ప్రాణాంతంకం కాకుండా అడ్డుకోవ‌డం సులభసాధ్యం. త‌గినంత ఆర్థిక స్తోమ‌త‌ లేకపోవటం, వైద్యం అందుబాటులో లేక‌పోవ‌డం, వైద్యానికి త‌గు కాలాన్ని వెచ్చించే వెసులుబాటు లేక‌పోవ‌డంతో పేద‌లు సామాన్య రోగాల‌ను కూడా ముద‌ర‌బెట్టుకుని ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ఈ దౌర్భాగ్యస్థితి నుంచి బ‌స్తీ దవాఖానా‌లు వారిని బయట‌ప‌డేస్తాయి. పేద‌ల‌కు ఆర్థికంగాను, దూరంప‌రంగాను ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారిని ఆదుకుంటాయి. పేద‌ల వ‌ద్దకే వైద్యం అన్న గొప్ప ల‌క్ష్యంలో అంత‌ర్భాగం బ‌స్తీ దవాఖానా‌లు. వైద్యాన్ని స‌రైన స‌మ‌యంలో చేరువ చేసి వారిని కాపాడ‌డంలో ఈ దవాఖానాల పాత్ర అమోఘం. పేద‌ల‌కు వైద్యాన్ని చేరువ చేయ‌డంలో క్యూబా ప్రపంచానికే అద‌ర్శంగా నిలిచింది. అయినా అక్కడి పాల‌కుల అకుంఠిత దీక్షతో తమ ప్రతికూల‌త‌ల‌ను అధిగ‌మించి, అగ్రరాజ్యం అమెరికానే త‌ల‌ద‌న్ని ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది. క్యూబాలో ప్రజా వైద్యానికి పునాది వేసిన వాడు చే గువేరా. ఆయన స్వయంగా వైద్యుడు. 1960వ ద‌శ‌కంలో అక్కడ విప్లవం విజ‌య‌వం త‌మైన వెంట‌నే చే గువేరా ప్రజారోగ్యంపై దృష్టి సారించాడు. ప్రజ‌ల‌కు, ముఖ్యంగా పేద‌ల‌కు, సాధ్యమైనంతమందికి త‌క్కువ స‌మ‌యంలో వైద్య సేవ‌లు, మందులు అందించ‌డం, ప‌రిస‌రాల‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్ది, ప‌ని తీరును మెరుగుప‌రచడం- ల‌క్ష్యంగా పెట్టుకుని ప‌రిశ్రమించి విజ‌యం సాధించారు క్యూబా నేతలు. అధ్వానంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థను అత్యున్నతంగా మార్చి, ప్రపంచంలో మ‌రెక్కడా లేని విధంగా ప్రతి 10వేల మందికి 67మంది వైద్యుల‌ను త‌యారు చేసి, నేడు త‌మ దేశంలోనే కాకుండా 68 దేశాల‌లో వైద్యసేవ‌లు అందించ‌గ‌లు గుతున్నారు. దానిని కేసీఆర్ స‌ర్కార్ ఆద‌ర్శంగా తీసుకుని బ‌స్తీ దవాఖానా‌ల‌ను ఒక వాహిక‌గా ఎంచుకుంది. 


హైద‌రాబాద్‌లో ఉన్న వేలాది బ‌స్తీల‌లోని ప్రజలంతా పొట్టచేత ప‌ట్టుకుని ప‌ల్లెల నుంచి న‌గ‌రానికి వ‌చ్చిన వ‌ల‌సజీవులు. వీరికి అప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో జీవించ‌డం అనివార్యం. ఆరోగ్య ప‌రిర‌క్షణ గురించిన అవ‌గాహ‌న అత్యల్పం. కాబ‌ట్టి ప‌దేప‌దే అనారోగ్యం బారిన ప‌డుతుం టారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా అంత దూరం వెళ్లి, అంత స‌మ‌యం కేటాయించి వైద్యం చేయించుకోవ‌డం క‌ష్టం. దీంతో రోగాలు ముదిరి ప్రాణాలు కోల్పోతున్నారు. లేదా ప‌నిచేయ‌లేని దుస్థితికి నెట్టబడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన ప‌డిపోతున్నాయి. దీనికి విరుగుడు బ‌స్తీ ప్రజ‌ల‌కు సత్వర ఆరోగ్య సేవ‌లు స‌క‌ల వేళ‌లా అందుబాటులో ఉండ‌డ‌మే అని గ్రహించిన ప్రభుత్వం బ‌స్తీ దవాఖానా‌ల‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో 224 బ‌స్తీ దవాఖానా‌లు ప్రారంభ ‌మ‌య్యాయి. ప్రతి 5వేల నుంచి 10 వేల మంది ప్రజ‌ల‌కు ఒక బ‌స్తీ దవాఖానా ఏర్పాటు చేయాల‌న్న సంక‌ల్పంతో ప్రభుత్వం ఉంది. అలాగే హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి మాత్రమే ప‌రిమితం కాకుండా తెలంగాణ లోని ప్రతి న‌గ‌రం, ప‌ట్టణంలో వీటి ఏర్పాటు దిశ‌గా అడుగులేస్తోంది. 


ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉన్నా ప్రజ‌లు నిమ‌గ్నం కాకుండా ప్రజారోగ్యాన్ని ప‌రిర‌క్షించ‌డం అసాధ్యం. ప్రజ‌లు కూడా ఆరోగ్య ప‌రిర‌క్షణ‌కు ప్రథమ ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. బ‌స్తీ దవాఖానాల రూపంలో ప్రభుత్వం క‌ల్పిస్తున్న స‌దుపాయాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి. అనారోగ్యాన్ని గుర్తించిన వెంట‌నే అందుబాటులోని బ‌స్తీ దవాఖానాల‌కు వెళ్లి వైద్యం పొందాలి. అక్కడ ప‌నిచేసే వైద్యులు, న‌ర్సులు, సిబ్బంది సూచించే ఆరోగ్య సూత్రాల‌ను తూచా తప్పకుండా పాటించాలి. త‌మ కుటుంబస‌భ్యులు, బ‌స్తీ ప్రజ‌లు కూడా ఆరోగ్య సూత్రాల‌ను త‌ప్పక పాటించే విధంగా కృషి చేయాలి. తెలంగాణ స‌మాజంలో సామాజిక సంబంధాలు ఆదర్శనీయం. కుల మ‌తాలు, వ‌ర్గ తార‌త‌మ్యాల‌కు అతీతంగా ప్రజ‌లంతా ఒక్క చోట చేర‌డం, ముచ్చటించుకోవడం, నిర్ణయించుకోవడం సామూహిక ఆచ‌ర‌ణ‌కు పూనుకోవ‌డం తెలంగాణ స‌మాజానికి ఉన్న ప్రత్యేక ల‌క్షణం. ఈ ల‌క్షణాన్ని ఇప్పుడు ఆరోగ్య ర‌క్షణ‌కు ర‌క్షణ క‌వ‌చంగా ఉద్యమస్ఫూర్తితో ఉప‌యోగించాల్సిన స‌మ‌యం ఆసన్నమైంది. మ‌హమ్మారి  సృష్టించిన కడగండ్లను అనుభ‌విస్తూ ఉన్న ఈ కష్టకాలంలో అంద‌రం ఏక‌మై ఆరోగ్య ప‌రిర‌క్షణ‌కు అంకిత‌మవ్వడం అత్యంత అవ‌స‌రం. అనివార్యం. 

గోసుల శ్రీనివాస్ యాదవ్ 

వ్యవస్థాపక అధ్యక్షులు, గొల్లకురుమ హక్కుల పోరాట సమితి

Advertisement
Advertisement
Advertisement