బాసర త్రిపుల్ ఐటీలో గందరగోళం.. చర్చలపై ప్రభుత్వం, విద్యార్థుల భిన్న ప్రకటనలు

ABN , First Publish Date - 2022-06-19T01:49:25+05:30 IST

బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ)లో ప్రభుత్వం విద్యార్థులు మధ్య ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.

బాసర త్రిపుల్ ఐటీలో గందరగోళం.. చర్చలపై ప్రభుత్వం, విద్యార్థుల భిన్న ప్రకటనలు

నిర్మల్‌: బాసర రాజీవ్‌గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిపుల్‌ ఐటీ)లో ప్రభుత్వం విద్యార్థులు మధ్య ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చలపై ప్రభుత్వం, విద్యార్థుల భిన్న ప్రకటనలు చేశారు. విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఆందోళన విరమణకు ఒప్పుకున్నారని మంత్రి ప్రకటించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నుంచి విద్యార్థులు క్లాసులకు హాజరవుతారని మంత్రి తెలిపారు. 


అయితే మంత్రి ప్రకటనను బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఖండించారు. చర్చల పేరుతో బెదిరిస్తున్నారని విద్యార్థుల ఆరోపించారు. రెగ్యులర్ వీసీ నియామకంపై ఎలాంటి స్పందన రాలేదని విద్యార్థులు అంటున్నారు. ఆందోళనలు యధావిధిగా కొనసాగుతాయని విద్యార్థులు ప్రకటించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామన్నామని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ తెలిపారు. విద్యార్థులు సానుకూలంగా స్పందించారని, అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్, జనరల్ సమస్యలన్నీ గుర్తించామన్నారు. రోజుల వ్యవధిలోనే అన్నిటినీ పరిష్కరిస్తామని వెంకటరమణ పేర్కొన్నారు. 


ప్రభుత్వం మెట్టు దిగడంలేదు.. డిమాండ్ల విషయంలో విద్యార్ధులూ తగ్గడం లేదు. బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల (Students) నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. క్యాంపులోని విద్యార్థులు కనిపించకుండా గేట్లకు రేకులు అడ్డుపెట్టారు. ఇతరులు ఎవరూ రాకుండా మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. నిజామాబాద్-భైంసా (Nizamabad-Bhainsa) రహదారుల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్-భైంసా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. విద్యార్థులను కట్టడి చేసేందుకు అధికారులు విద్యుత్తు, మంచినీటి సరఫరా బంద్‌ చేశారు. అయినా విద్యార్థులు పట్టుదలతో తమ ఆందోళన కొనసాగించారు. వర్సిటీలో రెగ్యులర్‌ వీసీ నియామకమే తమ ప్రధాన డిమాండ్‌ అంటూ ఆందోళన కొనసాగించారు. యూనివర్సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చి తమ సమస్యలు విని.. పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.


Updated Date - 2022-06-19T01:49:25+05:30 IST