‘బుట్ట’దాఖలు

ABN , First Publish Date - 2022-07-02T05:41:30+05:30 IST

పరిసరాలను స్వచ్ఛత ఉంచుతూ విజయనగరాన్ని ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం మరుగున పడుతోంది. వీధులను శుభ్రంగా ఉంచాలని లక్ష్యం పెట్టుకున్నారు తప్పితే ఆచరణలో ఎదురయ్యే లోపాలను సరిదిద్దలేకపోయారు.

‘బుట్ట’దాఖలు
డస్ట్‌బిన్‌లో దుస్తులు ఉంచిన దృశ్యం


చెత్త సేకరణ లక్ష్యం పక్కదారి
వేరే పనులకు ఉపయోగిస్తున్న వైనం
కొరవడిన అధికారుల మున్సిపల్‌ పర్యవేక్షణ

విజయనగరం రింగురోడ్డు, జూలై 1:

పరిసరాలను స్వచ్ఛత ఉంచుతూ విజయనగరాన్ని ఆరోగ్యనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం మరుగున పడుతోంది. వీధులను శుభ్రంగా ఉంచాలని లక్ష్యం పెట్టుకున్నారు తప్పితే ఆచరణలో ఎదురయ్యే లోపాలను సరిదిద్దలేకపోయారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించాలని విడివిడిగా బుట్టలు అందజేస్తే వాటిని ప్రజలు ఇతర అవసరాలను వినియోగిస్తూ ఒక బుట్టలోనే చెత్తనంతటినీ వేసి ఇస్తున్నారు. ఈ విధానాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. దీంతో మళ్లీ పూర్వ స్థితే కనిపిస్తోంది.
విజయనగరం మునిసిపాలిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ నుంచి నగరపాలక సంస్థగా రూపాంతరం చెందాక అధికారులు కొత్త నిర్ణయాలు తీసుకుని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. నగరాన్ని పారిశుధ్య సమస్య లేని నగరంగా తీర్చిదిద్దేందుకు తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. కొద్ది నెలల కిందట కార్పొరేషన్‌ అధికారులు తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర చెత్తగా విభజించి, ఇందుకోసం ప్రతి ఇంటికీ మూడు చెత్త బుట్టలు (ఆకుపచ్చ, నీలం, ఎరుపు) అందజేశారు. నగరపాలక సంస్థ వాహనాలు వచ్చే సమయంలోనే చెత్తను సేకరించాలని నిర్ణయించారు. తద్వారా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా నిర్మూలించాలని భావించారు. అయితే చాలా మంది ఈ మూడింటినీ వినియోగించడం లేదు. కేవలం ఒకేఒక్క చెత్త బుట్టలో అన్నీ కలిపి ఇచ్చేస్తున్నారు. మిగతా రెండు బుట్టలను ఇంట్లో వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల స్వచ్ఛత ఆశయం నీరుగారుతోంది.  

 పారిశుధ్య కార్మికుల కొరత నగరపాలక సంస్థని వేధిస్తోంది. చెత్త పేరుకుపోతున్నా, చెత్తను తరలించేందుకు అవసరమైన స్థాయిలో కార్మికులు లేరు. ప్రస్తుతం ఉన్న వారిలో ఎక్కువ మంది ఔట్‌సోర్సింగు వారే.. శాశ్వత ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఔట్‌సోర్సింగు కార్మికులు 449 మంది ఉండగా శాశ్వత పారిశుధ్య కార్మికులు 195 మాత్రమే ఉన్నారు. 50 డివిజన్లకు ఈ సిబ్బంది చాలడం లేదు.
 నగరంలో చెత్తను రీ స్లైకింగ్‌ చేయాలని కొన్నేళ్ల కిందట నిర్ణయించారు. ఇందుకోసం గార్బెజ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం (జీటీఎస్‌)ను గుణుపూర్‌పేట వద్ద నిర్మించాలనుకున్నారు. అది నేటికీ ప్రతిపాదన దశలోనే నిలిచిపోయింది. చెత్త సేకరణ వాహనాలు కూడా అంతంతే.

త్వరలో పూర్తిస్థాయిలో అమలు
నగరంలోని కొన్ని ఇబ్బందుల కారణంగా తడిచెత్త, పొడిచెత్త సేకరణ జరగడం లేదు. చెత్తబుట్టలపై ప్రజలకు అవగాహన కల్పించి చెత్తను వేరుచేసేలా చర్యలు చేపడతాం. సిబ్బంది కొరత వల్ల కూడా సమస్యలు ఎదురౌతున్నాయి. వాటిని అధిగమించి తడి, పొడి చెత్తను వేరుచేసేలా చర్యలు తీసుకుంటాం.
             - డాక్టరు సత్యనారాయణ,  ఎంహెచ్‌వో, నగరపాలక సంస్థ


Updated Date - 2022-07-02T05:41:30+05:30 IST