మాతృభాషలోనే ప్రాథమిక విద్య

ABN , First Publish Date - 2022-05-02T10:23:19+05:30 IST

ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

మాతృభాషలోనే ప్రాథమిక విద్య

ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో వెంకయ్య

న్యూఢిల్లీ, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్య తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా ఉన్న ఆయన ఆదివారం జరిగిన వేడుకను ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ విద్యావ్యవస్థ మన సంస్కృతిపై దృష్టిపెట్టాలని సూచించారు. పిల్లలకు మాతృభాషలో ప్రాథమిక విద్యను అందిస్తే వారు త్వరగా గ్రహించగలుగుతారని చెప్పారు.

కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యను అభ్యసించడం ద్వారా విషయ పరిజ్ఞానం పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా మార్పులు తీసుకొచ్చేలా కేంద్రం చేస్తున్న కృషి అభనందనీయమన్నారు. పిల్లలు ముందుగా మాతృభాషను నేర్చుకోవాలని, ఆ తర్వాత ఇతర భాషలు నేర్చుకోవాలని ఉద్ఘాటించారు. కోర్టుల్లో స్థానిక భాష వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా వెంకయ్య గుర్తుచేశారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ వందేళ్ల ప్రయాణానికి చిహ్నంగా 100 రూపాయల నాణెం, ప్రత్యేక స్టాంపు, శతాబ్ది బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ వందేళ్ల ప్రయాణంలో దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటిగా ఎదిగిన ఢిల్లీ యూనివర్సిటీని వెంకయ్య అభినందించారు.

  విద్యను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. నాటి కాలంలో నలంద, తక్షశిల, విక్రమశిల, పుష్పగిరి వంటి విశ్వవిద్యాలయాల్లో దేశ, విదేశీ విద్యార్థులు విద్యనభ్యసించి జ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసేవారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్‌ యోగేశ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-02T10:23:19+05:30 IST