Basavaraj చేరికపై Bjp నేతల్లో వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-04-05T17:20:31+05:30 IST

జేడీఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైన విధానపరిషత్‌ సభాపతి బసవరాజ్‌ హొరట్టికి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు పడుతున్నాయి. పార్టీలో చేరేందుకు బీజేపీకి చెందిన

Basavaraj చేరికపై Bjp నేతల్లో వ్యతిరేకత

                                         - ఢిల్లీ నేతలకు ఫిర్యాదు 


బెంగళూరు: జేడీఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైన విధానపరిషత్‌ సభాపతి బసవరాజ్‌ హొరట్టికి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు పడుతున్నాయి. పార్టీలో చేరేందుకు బీజేపీకి చెందిన కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. పార్టీలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారిని, నిబద్ధత కల్గినవారిని విస్మరించి ఫిరాయించేవారికి ప్రాధాన్యత ఇవ్వరాదని కొందరు మండిపడుతున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరుణ్‌సింగ్‌కు ఫిర్యాదులు చేరినట్టు తెలుస్తోంది. హొరట్టి బీజేపీకి ఎప్పుడూ మేలు చేసినవారు కాదని ఫిర్యాదులలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జేడీఎస్‌ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే బీజేపీ తలుపులు తడుతున్నారని పేర్కొన్నట్టు తెలుస్తోంది. హొరట్టి చేరికపై పది అంశాలతో అధిష్టానానికి ఫిర్యాదులు చేరినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన వయస్సు 76 అని, బీజేపీ నిబంధనల ప్రకారం ఏడు పదులు దాటినవారికి ప్రాధాన్యత ఇవ్వరాదనే అంశం పరిగణించకపోతే ఎలాగని కోరినట్టు సమాచారం. 1980లో పరిషత్‌ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారని, అయితే 1999 దాకా ల్యామింగ్టన్‌ పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు వేతనాలు తీసుకున్నారని, ఇతడిపై పలు ఆరోపణలు ఉన్నాయని పునఃపరిశీలించాలని కోరినట్టు సమాచారం. హావేరి, ధా రవాడ, గదగ్‌, ఉత్తరకన్నడ జిల్లాల పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గం బీజేపీకి బలమైనదన్నారు. ప్రస్తుత సీఎం బొమ్మైతోపాటు మాజీ సీఎంలు 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, నలుగురు పరిషత్‌ సభ్యులు, శాసనసభ స్పీకర్‌, ముగ్గురు కేబినెట్‌ మంత్రులు, ఓ కేంద్రమంత్రి ఇదే పరిధిలో ఉన్నారన్నారు. ఇక్కడ జేడీఎస్ కు ఒక ఎమ్మెల్యే కూడా లేరని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఓటమి అనివార్యమనే హొరట్టి బీజేపీలోకి వస్తున్నారని లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. కాగా హొరట్టి బీజేపీలో చేరే విషయమై ఆరంభం నుంచి వ్యతిరేకిస్తున్న మోహన్‌ లింబేకాయి ఇదే స్థానం నుంచి టికెట్‌ వస్తుందని ఏకంగా ప్రచారం చేసుకుంటున్నారు. 


Updated Date - 2022-04-05T17:20:31+05:30 IST