బెరైటీస్‌ అక్రమాలు మాఫీ!

ABN , First Publish Date - 2020-07-06T08:21:20+05:30 IST

మంగంపేట బెరైటీస్‌ అంటే దేశంలోనే ప్రసిద్ధి. ఇక్కడ దొరికే నాణ్యమైన ఖనిజం దేశంలోనే అత్యుత్తమం. ఇక్కడ ప్రగతి మినరల్స్‌ అనే ప్రైవేటు కంపెనీతో కొందరు అధికారులు కుమ్మక్కై.. ప్రభుత్వ గనిలో అక్రమంగా

బెరైటీస్‌ అక్రమాలు మాఫీ!


  • విజిలెన్స్‌ నివేదిక చెప్పినా చర్యల్లేవు!
  • మంగంపేట ప్రభుత్వ గనిలో ప్రగతి మినరల్స్‌ అక్రమ తవ్వకాలు
  • కంపెనీతో ఏపీఎండీసీ అధికారుల కుమ్మక్కు
  • నిర్వాసితుల పరిహారంలోనూ చేతివాటం
  • అక్రమ తవ్వకాల విలువ పాతిక కోట్లు
  • కంపెనీలు, అధికారుల నుంచి రికవరీకి సూచన
  • 2018లో విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిపోర్టు
  • దానిని పట్టించుకోవద్దన్న నాటి ఏపీఎండీసీ ఎండీ
  • గత నెలలో ప్రభుత్వానికి వెంకటరెడ్డి లేఖ
  • విజిలెన్స్‌కు అవగాహన లేదని వ్యాఖ్యలు
  • అధికారులపై చర్యలు అక్కర్లేదని స్పష్టీకరణ


కడప జిల్లా మంగంపేట బెరైటీస్‌లో అక్రమాలను జగన్‌ ప్రభుత్వం మాఫీ చే సేసింది. అక్రమాలు పెద్దఎత్తున జరిగాయని, ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సాక్షాత్తూ విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇచ్చిన నివేదికను తోసిపుచ్చింది. అక్రమ తవ్వకాల వల్ల రూ.25 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని.. దానికి కారణమైన కంపెనీలు, అధికారుల నుంచి ఆ నష్టాన్ని రికవరీ చేయాలని, అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తే.. ఏపీఎండీసీ ఉన్నతాధికారులు ఆ పనిచేయలేదు సరికదా.. విజిలెన్స్‌ విభాగానికి అవగాహన లేదని, ఆ నివేదిక తప్పంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని పక్కనపడేయాలని సాక్షాత్తూ ఆ సంస్థ ఎండీయే సూచించడం గమనార్హం.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మంగంపేట బెరైటీస్‌ అంటే దేశంలోనే ప్రసిద్ధి. ఇక్కడ దొరికే నాణ్యమైన ఖనిజం దేశంలోనే అత్యుత్తమం. ఇక్కడ ప్రగతి మినరల్స్‌ అనే ప్రైవేటు కంపెనీతో కొందరు అధికారులు కుమ్మక్కై.. ప్రభుత్వ గనిలో అక్రమంగా తవ్వుకునేందుకు అనుమతిచ్చేశారు. రెండోవైపు.. నిర్వాసితుల్లో నకిలీలను ప్రవేశపెట్టి ప్రభుత్వానికి నష్టం కలిగించారు. విజిలెన్స్‌ విచారణలోనే ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాయి. మంగంపేట ప్రాంతంలో 1975 నుంచీ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) మైనింగ్‌ చే స్తోంది. 1999లో మైనింగ్‌ ప్రాంతానికి 500మీ. పరిధిని డేంజర్‌జోన్‌గా గుర్తించి... ఆ పరిధిలో ఉన్న భూమి, ఇళ్లను సేకరించారు. తొలిదశలో 300మీ. పరిధిలోని వాటిని సేకరించి 2003లో వారికి పరిహారం చెల్లించారు. మలిదశలో మరో 200మీ. లోపు ఉన్న 657 మందికి పరిహారం మంజూరు చేశారు. ఆ పరిహారాన్ని చాలాకాలం వరకు చెల్లించకపోవడంతో వారు 2012లో మైనింగ్‌ కార్యక్రమాలను అడ్డుకున్నారు. తర్వాత కొంతకాలానికి నిర్వాసితులకు పరిహారాన్ని మళ్లీ ఖరారుచేశారు. ప్రమాదకర జోన్‌ పరిధిలో ఉన్న 230మందికి ఉద్యోగాలు(ఔట్‌సోర్సింగ్‌) ఇచ్చేలా.. లేకుంటే రూ.2.20లక్షలు ఒకేసారి పరిహారంగా ఇవ్వాలి. లేకుంటే ఒక్కొక్కరికి 300టన్నుల ఏ గ్రేడ్‌ బెరైటీస్‌ ఇచ్చి, ధర చెల్లించాలి. ఇక్కడే అక్రమాలకు బీజం పడిందని విజిలెన్స్‌ నివేదిక తేల్చింది. 167మంది నకిలీ నిర్వాసితులను మైనింగ్‌ అధికారులు జాబితాలో చేర్చేశారు. ఇలా అక్రమంగా చేరినవారికి 2.02లక్షల టన్నుల ఏ గ్రేడ్‌ బెరైటీస్‌ అప్పగించి అమ్ముకున్నట్లు తేలింది. దీనివిలువ సుమారు రూ.10కోట్లుగా నివేదిక పేర్కొంది. ఉద్యోగం లేదా బెరైటీస్‌ ఏదో ఒకటే పరిహారంగా ఇవ్వాల్సి ఉండగా.. 29 మందికి ఆ రెండూ ఇచ్చేశారు. వీరికి 75,485 టన్నుల బెరైటీ్‌సను అప్పగించారు. ఇంకోపక్క ఉద్యోగులుగా సుమారు రూ.3.63 కోట్ల జీతం పొందారు.


ప్రభుత్వ గనిలో ప్రగతి తవ్వకం..

ప్రగతి మినరల్స్‌ అక్కడో గనిని సబ్‌లీజుకు తీసుకుంది. ఆ గనిలో ఖనిజం లేకున్నా.. ఆ పేరుతో ఏపీఎండీసీకి చెందిన గనిలో అక్రమంగా తవ్వేసి అమ్మేసింది. ప్రగతి మినరల్స్‌ 1996లో తమ గనికి-ఏపీఎండీసీ గనికి మధ్యనున్న ఉమ్మడి సరిహద్దులో తవ్వకాలకు దరఖాస్తు చేసింది. దానిపై ఏపీఎండీసీ.. మంగంపేట ప్రాజెక్టు మేనేజర్‌ను నివేదిక అడిగింది. ఉమ్మడి సరిహద్దు(బఫర్‌జోన్‌)లో సుమారు 700టన్నుల బెరైటీస్‌ ఉందని అక్కడ మేనేజర్‌గా ఉన్న హెచ్‌.డి.నాగరాజా నివేదిక ఇచ్చారు. దాన్ని తవ్వేశాక సదరు కంపెనీ మళ్లీ దరఖాస్తు చేసింది. తాము ఇప్పటివరకు తమ పరిధిలోని గనిలోనే తవ్వామని.. బఫర్‌ జోన్‌లో తవ్వేందుకు అనుమతివ్వాలని అడిగింది. ఇక్కడే నివేదికలు తారుమారయ్యాయి. అంతకుముందు బఫర్‌ జోన్‌లో 700టన్నులు మాత్రమే ఉందని చెప్పగా... ఈసారి 22వేల టన్నుల వరకు ఉందని నివేదిక ఇచ్చేశారు. అందులో 16,141 టన్నులు ప్రైవేటు కంపెనీకి, 5,525టన్నులు ఏపీఎండీసీ వాటా అని తేల్చారు. ఆ మేరకు బఫర్‌ జోన్‌లో కాకుండా.. ఏపీఎండీసీ గనిలో తవ్వేశారని నిర్ధారించారు. తర్వాత మళ్లీమళ్లీ ఇలాగే దరఖాస్తు చేసుకుని ఏపీఎండీసీ గనిలో తవ్వేశారు. దాన్ని ఒక పోరంబోకు భూమిలో నిల్వ చేశారు. 2015 వరకు ఆ బెరైటీ్‌సను అక్రమంగా అమ్ముకున్నారు. అక్రమంగా తవ్వి, అమ్మిన మొత్తం బెరైటీస్‌ 54,650 టన్నులుగా నిఘా విభాగం తేల్చింది. 


టన్ను రూ.4,500 చొప్పున దీనివిలువ మొత్తం రూ.24.59కోట్లని పేర్కొంది. అప్పట్లో మంగంపేట ప్రాజెక్టు డైరక్టర్‌గా ఉండి... ప్రస్తుతం ఏపీఎండీసీ ఈడీగా ఉన్న నాగరాజా ఆ కంపెనీతో కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపించారని తేల్చింది. అక్రమంగా దోచేసిన డబ్బును రికవరీ చేయాలని, నాగరాజా, మరికొందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. విజిలెన్స్‌ తన నివేదికను 2018 జూన్‌ 14న సమర్పించింది. ఎన్నికల హడావుడి, ఇతరత్రా కారణాలతో దానిపై దృష్టిపెట్టలేదు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక గతనెల 1న నాటి ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి ఒక లేఖ రాశారు. చిత్రమేమంటే విజిలెన్స్‌ నివేదికపై చర్యలు తీసుకోవాలని రాయలేదు. ఆ నివేదిక అవగాహన లేకుండా రూపొందించారని, దాన్నిపరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు. వాల్యూమెట్రిక్‌ సర్వే చేయకుండా ఏపీఎండీసీ గని నుంచే అక్రమంగా తవ్వారని చెప్పడం అశాస్ర్తీయమని పేర్కొన్నారు. ఏపీఎండీసీ అధికారులు హెచ్‌.డి.నాగరాజా, వెంకటరమణ, నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డిలపై చర్యలు తీసుకోనవసరం లేదని స్పష్టం చేశారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విజిలెన్స్‌ నివేదికను పూచికపుల్లలా తీసిపారేయడం, అదీ ఏపీఎండీసీయే ఇలా చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నివేదిక సరిగా లేదన్న అభిప్రాయం ఉంటే... మరోసారి విచారణకు ఆదేశించాలి తప్ప.. ఏకంగా నివేదికే  సరైంది కాదనడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు, ఏపీఎండీసీకి చెందిన రూ.కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని.. దానిని వసూలు చేయాలని విజిలెన్స్‌ పేర్కొంటే ఆ మేరకు చర్యలు తీసుకోకుండా.. దానికి విరుద్దంగా వ్యవహరించడంలోని మతలబేంటని నిలదీస్తున్నారు.

Updated Date - 2020-07-06T08:21:20+05:30 IST