Advertisement
Advertisement
Abn logo
Advertisement

బరులెత్తిన గోదారి!

  • అట్టహాసంగా కోడిపందేలు షురూ
  • పల్లంకుర్రు బరికి ప్రముఖుల బారులు
  • తూర్పున తొలి రోజే 25 కోట్ల లావాదేవీలు
  • పశ్చిమాన కూడా ఉవ్వెత్తున జోరుగా గుండాట, పేకాట
  • రూ.15 కోట్ల వరకు బిజినెస్‌ 
  • కృష్ణాలో పది కోట్లపైనే!
  • జిల్లావ్యాప్తంగా 800 బరులు
  • గుంటూరు తీరంలో పందేలకు తెలంగాణ నుంచీ హాజరు
  • అట్టహాసంగా కోడిపందేలు 
  • పల్లంకుర్రు బరికి ప్రముఖుల క్యూ.. తూర్పున తొలి రోజే 25 కోట్ల లావాదేవీలు

 

అమలాపురం/ఏలూరు/విజయవాడ/గుంటూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పందెంకోడి బరిలోకి దూకింది. శుక్రవారం ఉభయ గోదావరి జిల్లాల్లో తొలి రోజునే కోడిపందేలు, గుండాటలు, పేకాటలు హోరెత్తాయి. రాజకీయ నేతలు సహా దేశం నలుమూలల నుంచీ వచ్చిన ఔత్సాహికులతో పందెం బరులు కళకళలాడాయి. అధికార వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు ఆయా బరులను లాంఛనంగా ప్రారంభించారు. మొదటి రోజే తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రూ.25 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. సాయంత్రం కోనసీమలో వర్షం కురవడంతో పందేలకు కొంత ఆటంకం ఏర్పడింది. వైసీపీ, టీడీపీ సహా రాజకీయ పార్టీల ప్రముఖ నేతలు, టీవీ యాంకర్లు పాల్గొని పందేలను వీక్షించారు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతాలతోపాటు కోనసీమవ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో  కోడిపందేలు, గుండాటలు, పేకాటలు జరిగాయి. కాట్రేనికోన మండలం దొంతికుర్రు-పల్లంకుర్రు మధ్య ఏర్పాటుచేసిన మెగా బరిలో పందేలు హోరెత్తాయి. మొదటి రోజే 20కిపైగా పందేలు జరిగాయి. ఒక్కో పందెం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సాగింది.


ఈ పందేల్లో ఉభయ రాష్ర్టాలకు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. టీడీపీకి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దగ్గరుండి కోడి పందేలు ఆడించారు. ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కుమార్‌, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు వీక్షించారు. ఈ పందేల్లో విజేతలకు వెండి నాణేలను బహుమతులుగా అందజేశారు. వందలాది సంఖ్యలో కార్లు రావడంతో పల్లంకుర్రు వెళ్లే రోడ్డు కిక్కిరిసిపోయింది. గుండాటలు భారీగా సాగాయి.రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కోడి పందేలను ప్రారంభించారు.  ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, రాజమహేంద్రవరం అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి రావులపాలెంలో కోడి పందేల బరిని ప్రారంభించారు. అంబాజీపేట మండలం పోతాయిలంక బరిని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు వికాశ్‌, ఎమ్మెల్యే సోదరుడు వెంకటేశ్వరావు ప్రారంభించి పోటీల్లో పాల్గొన్నారు. అనపర్తి మండలం దుప్పలపూడిలో ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి కోడిపందేలు ప్రారంభించారు. వందలాది గుండాటల బోర్డులతో కోట్ల రూపాయల మేర చేతులు మారాయి. మలికిపురం మండలం తూర్పుపాలెంలో రికార్డింగ్‌ డ్యాన్సులు ఆడేందుకు వచ్చిన డ్యాన్సర్లను మలికిపురం ఎస్‌ఐ హరికోటిశాస్ర్తి అడ్డగించి వారిని స్టేషన్‌కు తరలించారు.


గుంటూరులో జోరుగా..

గుంటూరు జిల్లాలో శుక్రవారం వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భోగి మంటలు వేసేందుకు ఆస్కా రం లేకుండా పోయింది. అయితే కోడిపందేలు మాత్రం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తీర ప్రాంత గ్రామాల్లో.. ప్రధానంగా రేపల్లె ప్రాంతంలో నిర్వహించిన కోడి పందాలకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా పందెంరాయుళ్లు తరలివచ్చారు. పటేరు డొంకరోడ్డులో రెండు, భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఆరు బరులను ఏర్పాటు చేశారు. పల్లెకోనలోని వీఐపీ బరిలో పెద్దఎత్తున బెట్టింగులు జరిగాయి. కరెన్సీ నోట్ల గుమ్మరింత..

భీమవరం, పాలకొల్లు, నరసాపురం వంటి కీలక ప్రాంతాలు సహా పశ్చిమ గోదావరి వ్యాప్తంగా పందేల బరులు వెలిశాయి. ఎక్కడికక్కడ జనం నోట్లు గుమ్మరించారు. గుండాట బోర్డులు వెలిశాయి. వెను వెంటే పేకాట శిబిరాలు. ఉండి నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యే రామరాజు, వైసీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గోకరాజు రామం కోడి పందేలను ఆరంభించారు. సంప్రదాయం పేరిట ఆరంభించినా ఆ తదుపరి కాళ్లకు కత్తులు కట్టిన పుంజులే బరిలో నిలిచాయి. నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు స్వగ్రామం కలగంపూడిలో భారీ ఎత్తున పందేల శిబిరాలు వెలిశాయి. జంగారెడ్డిగూడెం మండలంలో వేసిన కోడి పందేల బరులకు పెద్దఎత్తున తెలంగాణవాసులు తరలివచ్చారు. ఎక్కడికక్కడ బెట్టింగులకు దిగారు. కోడి జాతకాల ప్రకారం మరీ పందేలు కాస్తుండడం విశేషం. జిల్లాలో భోగినాడు తొలి పందేల్లోనే దాదాపు 15 కోట్ల రూపాయలు బిజినెస్‌ సాగింది. కృష్ణాలో పందేల జోరు


కృష్ణా జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక బరులు ఏర్పాటు చేశారు. గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో హైటెక్‌ హంగులతో బరులు వెలిశాయి. జిల్లాలో మొత్తం 800 బరులు వెలిసినట్లు సమాచారం.

 తొలి రోజు మొత్తం రూ.10 కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. శనివారం సంక్రాంతి రోజున ఇది రూ.50 కోట్లకు వరకు వెళ్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా వాహనాల్లో వచ్చి బెట్టింగ్‌లు పెడుతున్నారు. Advertisement
Advertisement