ఆ బార్లు ‘రేట్‌’ గురూ!

ABN , First Publish Date - 2022-07-31T06:02:43+05:30 IST

రాజాంలో మద్యం వ్యాపారులు వెనక్కి తగ్గలేదు. రికార్డు స్థాయిలో వేలం పాట పాడి నాలుగు బార్లను దక్కించుకున్నారు. ఈవేలంలో రూ.3.22 కోట్లకు బార్లను చేజిక్కించుకున్నారు. మూడు బార్లను రూ.77 లక్షల చొప్పున..మరో బారును రూ.75 లక్షలకు వేలం పాడి సొంతం చేసుకున్నారు. విజయగనగరం, శ్రీ

ఆ బార్లు ‘రేట్‌’ గురూ!

రాజాంలో బార్లకు భలే డిమాండ్‌

రికార్డు స్థాయిలో వేలం

మూడు రూ.77 లక్షలు చొప్పున.. మరొకటి రూ.75 లక్షలు పలికిన వైనం

ఓ కీలక నేత మంత్రాంగం

(రాజాం/రాజాం రూరల్‌)

రాజాంలో మద్యం వ్యాపారులు వెనక్కి తగ్గలేదు. రికార్డు స్థాయిలో వేలం పాట పాడి నాలుగు బార్లను దక్కించుకున్నారు. ఈవేలంలో రూ.3.22 కోట్లకు బార్లను చేజిక్కించుకున్నారు. మూడు బార్లను రూ.77 లక్షల చొప్పున..మరో బారును రూ.75 లక్షలకు వేలం పాడి సొంతం చేసుకున్నారు. విజయగనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాజాంలో బార్లకు పోటీ ఉండడం విస్తుగొల్పుతోంది. కేవలం రాజాంలోనే ఇంతగా పోటీ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజాం మునిసిపాల్టీలో నాలుగు బార్లు ఉన్నాయి. రాజాం మెయిన్‌రోడ్‌లో ఒకటి, చీపురుపల్లి రోడ్‌లో మరొకటి, పాలకొండ రోడ్‌లో మరో రెండు బార్లు ఉన్నాయి. వీటి కాలపరిమితి ముగుస్తున్న నేపఽథ్యంలో శనివారం జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ వి.సుధీర్‌ల ఆధ్వర్యంలో బార్లకు వేలం పాటలు నిర్వహించారు.

ఓ కీలక నేత కావడంతో..

పారదర్శకంగా వేలం ప్రక్రియ ఉంటుందని బయటకు చెబుతున్నా.. లోలోపల మాత్రం రాజకీయాలు నడిచాయి. అధికార పార్టీ నేతల హవా నడిచింది. రాజాంలో రెండు బార్లు అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతవి. అందుకే అక్కడ నిబంధనలు ఏమీ ఉండవన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. ప్రభుత్వ మద్యం దుకాణంలో బీరు ధర రూ.190 నుంచి రూ.200 వరకూ విక్రయిస్తుంటారు. అయితే సదరు నేతకు చెందిన బార్లలో మాత్రం రూ.260 పైమాటే. అలాగే రూ.200 విలువ చేసే క్వార్టర్‌ మద్యాన్ని రూ.260కు విక్రయిస్తున్నారు. హాఫ్‌ బాటిల్‌పై రూ.80, ఫుల్‌బాటిల్‌పై రూ.150 నుంచి రూ.200 అదనంగా బాదేస్తున్నారు. 

అక్కడ నిబంధనలు పాటించరు..

బార్లకు సంబంధించి సమయపాలన పాటించరు. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ మద్యం విక్రయాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల వరకూ కొనసాగుతాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలవరకూ మాత్రమే తెరుస్తున్నారు. అయితే ఈ సమయం బార్ల నిర్వాహకులకు కలిసి వస్తోంది. నిర్వాహకులు కీలక నేతలు కావడంతో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తృతం చేసుకోవడానికి ప్రభుత్వ మద్యం దుకాణాలనే మార్పించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. గతంలో పాలకొండ రోడ్డులో మూడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండేవి. ఇవి బారు వ్యాపారానికి అడ్డంకిగా నిలుస్తున్నాయని ఏకంగా వాటిని మార్చేశారు. చీపురుపల్లి రోడ్‌లో సైతం బార్‌ ఉండడంతో అక్కడ ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని బొద్దూరుకు మార్చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బార్ల ద్వారా దండిగా ఆదాయం సమకూరుతోంది. అందుకే దాదాపు మూడు జిల్లాల్లో ఏ పట్టణంలో లేని విధంగా ఇక్కడి బార్లను దక్కించుకున్నారు.

ఆదాయానికి ‘బార్లు’

ఈవేలం ద్వారా రూ.12.22 కోట్ల ఆదాయం

విజయనగరం క్రైం, జూలై 30: బార్ల రూపంలో ప్రభుత్వానికి రూ.12.22 కోట్ల ఆదాయం సమకూరింది. నూతన బార్ల పాలసీలో భాగంగా శనివారం అధికారులు ఈవేలం నిర్వహించారు. విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలతో పాటు భోగాపురం, ఎస్‌.కోటలో పర్యాటక ప్రాంత బార్లకు అధికారులు వేలం ప్రకటన జారీచేశారు. అయితే భోగాపురంలో మాత్రం వేలంకు ఎవరూ ముందుకు రాలేదు. 25 బార్లతో పాటు ఎస్‌.కోట టూరిజం బార్‌కు ఈ వేలం మొదటి బిడ్డింగ్‌లోనే పూర్తయ్యింది. విజయనగరం కార్పొరేషన్‌లో 17 బార్లకుగాను.. ఒక్కో బారుకు రూ.47 లక్షలు లభించింది. బొబ్బిలిలో మూడు బార్లకుగాను ఒక్కోదానికి  రూ.39 లక్షలు, రాజాంలో నాలుగు బార్లు ఉండగా మూడింటికి రూ.77 లక్షలు, ఒకదానికి రూ.75 లక్షల వేలం పలికింది.. నెల్లిమర్లలో ఒక బార్‌కు రూ.17 లక్షలు, ఎస్‌.కోట టూరిజం బార్‌కి రూ.19 లక్షల వేలం దక్కింది. అయితే రాజాంలో రికార్డు స్థాయిలో రూ.77 లక్షల చొప్పున వేలానికి కోడ్‌ చేయడం అధికారులను సైతం విస్తుగొలిపింది. 



Updated Date - 2022-07-31T06:02:43+05:30 IST