కనిగిరిలో బరితెగింపు

ABN , First Publish Date - 2021-03-09T07:45:16+05:30 IST

లింగ్‌ ముంగిట కనిగిరిలో అధికారం బరితెగించింది. కీలక ప్రజాప్రతినిధి అక్కసుతో 20వవార్డు టీడీపీ అభ్యర్థి భర్తపై అకారణంగా పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన సోమవారం రాత్రి సాయిబాబా దేవాలయం వద్ద జరిగింది.

కనిగిరిలో బరితెగింపు
పోలీసులు జీపులోకి ఎక్కించిన బాలిరెడ్డి

డబ్బులు పంచుతున్నావంటూ అకారణంగా దాడి...!

20వ వార్డు టీడీపీ అభ్యర్థి భర్తపై అధికార ప్రయోగం

పెడరెక్కలు విరిచి జీపులో తోసిన పోలీసులు

డాక్టర్‌ ఉగ్ర రంగప్రవేశంతో వెనక్కు తగ్గిన వైనం

కనిగిరి, మార్చి 8: పోలింగ్‌ ముంగిట కనిగిరిలో అధికారం బరితెగించింది. కీలక ప్రజాప్రతినిధి అక్కసుతో 20వవార్డు టీడీపీ అభ్యర్థి భర్తపై అకారణంగా పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన సోమవారం రాత్రి సాయిబాబా దేవాలయం వద్ద జరిగింది. 20 వార్డు అభ్యర్థి భర్త మూలే బాలిరెడ్డి పట్టణంలోని గార్లపేట రోడ్డులో సంజీవని ఆసుపత్రి  వద్ద ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డబ్బులు పంచుతావా అంటూ అకారణంగా పెడరెక్కలు విరిచి ఒక్కసారిగా జీపులో తోసిపారేశారు. తన వద్ద డబ్బులు లేవని ఎంత బతిమలాడినా పోలీసులు వినకుండా స్టేషన్‌కు తరలించబోయారు. పెడరెక్కలు విరిచి జీపులోపలికి బలవంతంగా నెట్టడంతో బాలిరెడ్డికి ఊపిరి ఆడక అపస్మారకస్థితిలోకి  వెళ్లాడు. అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, ఇంత దుర్మార్గం, దౌర్జన్యం ఏమిటని పదేపదే నిలదీస్తున్నా సమాధానం చెప్పకుండా పోలీసులు తమను కూడా భయభ్రాంతులకు గురిచేశారని స్ధానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహా రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితునికి అండగా నిలబడ్డారు. అతన్ని జీపులో ఎందుకు ఎక్కించారని, అకారణంగా ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్తా మని హెచ్చ రించడంతో పోలీసులు వెనక్కితగ్గి బాలిరెడ్డిని కింద కు దించి వేసి వెళ్లిపోయారు. అయితే గత నాలుగు రోజులుగా తమను పోటీ నుంచి తప్పుకోవాలని చాలాసార్లు అధికారపార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారని, వినకపోయేసరికి ఈ విధంగా బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు బాలిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపు కోసం టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర  నిర్వహించిన ప్రచారానికి బాగా ప్రజాదరణ రావడంతో అధికారపార్టీ నేతలు, వైసీపీ అభ్యర్థులు జీర్ణించుకోలేక అకారణంగా పోలీసులను ప్రయోగించడమే కాకుండా, దాడికి కూడా పాల్పడబోయారని కన్నీటి పర్యంతమయ్యారు.


అరాచకత్వానికి ఈ సంఘటన నిదర్శనం : ఉగ్ర

ఎన్నికల్లో గెలుపోట ములు సహజమని, ప్రజా స్వామ్య బద్ధంగా పోటీలో గెలవలేక అధికార పార్టీ నేత ఇలాంటి అరాచకాల కు పాల్పడటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర సింహారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో టీడీపీకి ఆదరణ చూసి ఓర్వ లేక అభ్యర్థులపై పోలీసుల ను ప్రయోగించి భయభ్రాం తులకు గురిచేయటం అన్యాయమన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా, కుట్రల వెనుక ఉన్న వ్యక్తులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. 




Updated Date - 2021-03-09T07:45:16+05:30 IST