రైతుల నష్టపరిహారానికి నిబంధనల అడ్డుగోడలు

ABN , First Publish Date - 2022-08-10T06:17:46+05:30 IST

ఉచిత పంటల బీమా పథకానికి, ఇతర పథకాలు అమలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ప్రతి రైతు ఇ–క్రాప్, ఇ–కెవైసి నమోదు చేయించుకోవాలనే..

రైతుల నష్టపరిహారానికి నిబంధనల అడ్డుగోడలు

ఉచిత పంటల బీమా పథకానికి, ఇతర పథకాలు అమలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ప్రతి రైతు ఇ–క్రాప్, ఇ–కెవైసి నమోదు చేయించుకోవాలనే విషయం రైతులందరికీ తెలియనందున కొంతమంది రైతులు ముఖ్యంగా ఉచిత పంటల బీమా పథకం లబ్ధి పొందలేకపోయారు. అంతేగాక గత ఏడాది కరోనా ఉధృతంగా ఉన్నందున భయంతో కొంతమంది నమోదు చేయించుకోలేదు. దీంతో పంట నష్టపోయిన కొందరు రైతులకు లబ్ధి చేకూరలేదు. ఈవిధంగా లబ్దిపొందని వారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 శాతం మంది రైతులు ఉంటారని రైతుసంఘాల అంచనా. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, పంట బీమా పథకం ప్రయోజనం లాంటివి అందనందున రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సన్నకారు, చిన్నకారు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.


గతంలో అయితే  పంట పొలంలో ఉండి నష్టపోతే బీమా లేదు. అదే పంట మిల్లులోకి వచ్చి మిల్లరు నష్టపోతే బీమా వస్తుందని రైతు సంఘ నాయకులు అనేవారు. అయితే గ్రామ, వార్డు సచివాలయాలు మాదిరిగా రైతు సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం. అలాగే  ఉచిత పంటల బీమా పథకం లాంటివి అమలు చేయడం మంచి విషయమే. లేకపోతే మరింత మంది రైతులు ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. 


ఇ–క్రాప్ చేయాలంటే రైతును పొలంలో నిలబెట్టి ఫోటో తీయాలి. తర్వాత ఆధార్ కార్డుతో ఇ–కెవైసి చేయాలి ఈ పనులన్నీ చేయాలంటే రైతు భరోసా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరు. సచివాలయం మాదిరిగానే సిబ్బందిని, వలంటీర్లను నియమించవలసి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 10,871 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 10,871 సిబ్బంది మాత్రమే ఉన్నారు. కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి, ఎరువులు, విత్తనాలు వంటివి అమ్మడానికి, ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడున్న సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. రైతు భరోసా కేంద్రాలలో చేస్తున్న కార్యక్రమాలు రైతులలో విస్తృతంగా ప్రచారం కావాలి. పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేస్తే తెలుసుకునే రైతులు చాలా తక్కువ. కరపత్రాలు, మైకు, మీటింగ్‌ల ద్వారా ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల సహకారంతో మారుమూల ప్రాంత రైతులకు తెలియాలి.


ఇ–క్రాప్ పద్ధతి గత ఏడాది ఖరీఫ్ నుంచే తొలిసారిగా ప్రవేశపెట్టడం వల్ల కొంతమంది రైతులకు అర్థం కాలేదు. కొంతమంది మహిళా రైతులు పంట పొలాలకు వచ్చి ఫోటోలు తీయించుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో చాలా మందికి నష్టపరిహారం, పంట బీమా ప్రయోజనం అందలేదు. కరోనా సమయంలో 75శాతం హాజరు లేకపోయినా‌‌ అమ్మ ఒడి పథకం 


అమలు చేసినట్లు, ఇ–క్రాప్ నిబంధనను సడలించి పంట నష్టపోయిన రైతులందరికీ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రయోజనం చిన్న, సన్నకారు, కౌలురైతులకే ఎక్కువ మందికి అందలేదని రైతు సంఘాలు అంటున్నాయి. కనీసం వారికి ఇచ్చినా రైతు ఆత్మహత్యలు ఆగిపోయే అవకాశం ఉంది. ఇ–క్రాప్ నిబంధన పేరుతో నిజంగా నష్టపోయిన చిన్న రైతుకు నష్టపరిహారం ఇవ్వకపోవడం బాధాకరం.


– బి.బి. రామకృష్ణారావు

Updated Date - 2022-08-10T06:17:46+05:30 IST