Abn logo
Feb 19 2020 @ 00:47AM

అడ్డుగోడలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన వారం దూరంలో ఉంది. గుజరాత్‌, మరీ ముఖ్యంగా అహ్మదాబాద్‌ చాలా హడావుడి పడుతున్నది. ఈ పర్యటన మీద ట్రంప్‌ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రోడ్లకు ఇరువైపులా డెబ్బయ్‌ ఎనభై లక్షలమంది బారులు తీరి తనకు స్వాగతం చెప్పబోతున్నారని మోదీ చెవిలో చెప్పిన మాటను ఆయన బయటపెట్టేయడంతో, లెక్క ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పాలకులమీద మరింత హెచ్చింది. ఇక, ట్రంప్‌కు ఎంతో ప్రీతిపాత్రమైన అడ్డుగోడలు కట్టే పని కూడా అక్కడ వేగంగా సాగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గిట్టనివాళ్ళు దీనిని దారిద్ర్యాన్ని దాచేయడమని అంటున్నారు. మొన్నటివరకూ మిత్రపక్షంగా ఉన్న శివసేన దీనిని భావదారిద్ర్యంగా, బానిసత్వ లక్షణానికి పరాకాష్ఠగా అభివర్ణిస్తున్నది. కానీ, మెగ్జికోనుంచి శరణార్థుల రూపంలో ఇదే నిరుపేదలు, అభాగ్యులు అమెరికాలో దూరకుండా ట్రంప్‌ ఓ ఎత్తయిన, బలమైన గోడ కట్టుకుంటున్నారు. న్యాయస్థానాల్లో సహా ఎన్నో పోరాటాలు చేసి దాదాపు సగం పూర్తిచేశారు. ఇప్పుడు భారత్‌లో కూడా పేదలను అడ్డుకుంటున్న ఓ గోడను ట్రంప్‌ ఎంతో ప్రీతితో చూడబోతున్నారు. అధికారులు దానిని సుందరీకరణ అనవచ్చు, స్థానికులకు నచ్చకపోవచ్చును కానీ, అతిథికీ, అతిథేయికీ కూడా అడ్డుగోడలంటే ఎంతో ప్రీతి.


గుజరాత్‌ మోడల్ అభివృద్ధిని ఘనంగా చాటుకొని, దేశపాలకులైనవారు ఇప్పుడు దారిద్ర్యాన్ని దాచేస్తున్నారు. రోగానికి మందువేయాల్సినవారు పట్టువస్త్రంతో పుండును కప్పేస్తున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి మొటేరా స్టేడియం వరకూ ట్రంప్‌ ఘన జనస్వాగతాన్ని అందుకొనే మార్గం మధ్యలో దేవ్‌శరణ్‌ మురికివాడ ఉన్నది. అది ట్రంప్‌ కంటపడకుండా, సుదీర్ఘకాలం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి అప్రదిష్ట రాకుండా ఏడడుగుల ఎత్తున శాశ్వతంగా ఓ గోడ కట్టేస్తున్నారు. మరోపక్క, పాతిక సంవత్సరాలుగా స్టేడియంకు కిలోమీటరు దూరంలో నివాసం ఉంటున్న పేదలను ఆక్రమణదారులుగా గుర్తిస్తూ, తక్షణం ఖాళీచేసిపోవాల్సిందిగా నోటీసులు జారీ అవుతున్నాయి. ట్రంప్‌ పర్యటనకు ఈ నోటీసులకు సంబంధం లేదనీ, మునిసిపాలిటీ భూమిని ఖాళీచేయిస్తున్నామని అధికారులు పైకి చెబుతున్నారు. 2014ఎన్నికలకు ముందు సినీతారలతో సాగరతీరాన విహారాలు చేయించి దేశమంతా గుజరాత్‌ వెలిగిపోతోందంటూ ప్రచారం చేయించినవారు, ఈ దారిద్ర్యాన్ని ఎందుకు రూపుమాపలేకపోయారో తెలియదు. ఇప్పుడది ఎదుటివారికంట పడకపోతే చాలని అనుకుంటున్నారు. నిజాలకు ముసుగేయడం, లెక్కలను తారుమారు చేయడం ద్వారా అంతా బ్రహ్మాండంగా ఉన్నదని చాటుకోవడం మన పాలకులకు అలవాటే. వాస్తవాలను తెలియచెప్పే నివేదికలు ప్రజల కంటపడనీయకుండా దాచేసి, రికార్డుస్థాయి నిరుద్యోగం, కుప్పకూలిన పారిశ్రామిక ఉత్పత్తి, కుదేలైన ఆర్థికరంగం సహా అన్నింటా అడ్డగోలు వాదనలతో నెట్టుకొచ్చేస్తున్నవారు ఇలా ముసుగులేయగలరే కానీ ముఖచిత్రాన్ని మార్చలేరు. సమస్త వ్యవస్థలూ కుప్పకూలిపోతున్నా, ఆర్థికవేత్తలంతా కాదు పొమ్మన్నా, ఆ ఐదు ట్రిలియన్‌ డాలర్ల కథ వారినోట వినబడుతూనే ఉంటుంది.


ఈ ఏడాది చివర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఈ భారత యాత్ర ఎంతో ఉపకరిస్తుంది. ప్రవాసులు, మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అక్కడున్న గుజరాతీల ఓట్లు ఆయనకు అవసరం. కానీ, మనకు దక్కబోయేది ఎంతన్నదానిలో ఇప్పటికీ స్పష్టత లేదు. ట్రంప్‌ ఏరికోరి మనతో పెట్టుకున్న వాణిజ్యయుద్ధానికి ఈ పర్యటన స్వస్తి పలుకుతుందన్న నమ్మకమూ కనిపించడం లేదు. ట్రంప్‌ను మెత్తబరచడానికి ఈ దేశంలో లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ, పాల ఉత్పత్తి రంగాలను అమెరికాకు తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ కామర్స్‌, రిటైల్‌ రంగంలో పెట్టుబడులు ఇత్యాది కీలకమైన అంశాల్లో భారత్‌ మరింత లొంగివస్తే కానీ వాణిజ్య ఒప్పందం కుదిరే సూచనలు లేవు. ఇరుదేశాలకు చెందిన అధికారులు నాలుగుసార్లు భేటీ అయినా ట్రంప్‌ పరిభాషలో రైట్‌డీల్‌ సాధ్యపడలేదంటే ఆయన అన్నట్టుగా ‘నో డీల్‌’తోనే ఈ పర్యటన ముగిసిపోవచ్చు. ట్రంప్‌ ఇటీవల రద్దుచేసిపారేసిన గతకాలపు హోదాలన్నీ తిరిగి దక్కాలన్న భారత్‌ కోరిక తీరకుండా, ఆయన ఎన్నికల లబ్ధికి ఉపకరించే పలుకరింపు సభలవల్ల చివరకు దేశానికి ఒరిగేదేమీ ఉండదు.

Advertisement
Advertisement
Advertisement