పులివెందుల్లోనూ బారికేడ్లు

ABN , First Publish Date - 2022-07-07T08:07:22+05:30 IST

పులివెందుల్లోనూ బారికేడ్లు

పులివెందుల్లోనూ బారికేడ్లు

నేడు, రేపు జగన్‌ పర్యటన.. భారీగా పోలీసుల మోహరింపు

వేంపల్లెలో సైతం రోడ్లపై కంచెలు.. జనం నిలదీస్తారని ముందుజాగ్రత్త

కడప, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగ న్‌ పర్యటన అంటే చాలు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. బారికేడ్లు, పరదాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ మళ్లిస్తుండడంతో విలవిలలాడుతున్నారు. చివరకు ఆయన సొంత జిల్లా కడపలోని సొంత నియోజకవర్గం పులివెందులవాసులకూ ఈ కష్టాలు తప్పడం లేదు. సీఎం గురు, శుక్రవారాల్లో పులివెందుల, వేంపల్లెలో పర్యటించనున్నారు. పులివెందులలో ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం ఉన్న ప్రధాన రోడ్డు అంతా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముద్దనూరు రోడ్డులో ఉన్న ఏపీ కార్ల్‌ వరకు కంచెలు వేశారు. వేంపల్లెలో కూడా సీఎం పర్యటించే ప్రాంతాల్లోని రోడ్లపై బారికేడ్లు పెట్టారు. సీఎం సొంతూరికి వస్తున్నారు.. వెళ్లి కలుద్దామనుకున్న ప్రజలు ఈ ఏర్పాట్లు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాలకపక్ష ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్న నేపథ్యంలో పులివెందుల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్న భయం అధికారులు, స్థానిక నేతల్లో ఉంది. పులివెందుల్లో సీఎంను ప్రశ్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగుతుంది. అందుకే ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లోని రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.


జగన్‌ పర్యటన ఇలా..

సీఎం జగన్‌ గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి 9.30 గంటలకు బయల్దేరి  10.20కి కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 10.55 గంటలకు పులివెందులలోని బాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డుమార్గాన పులివెందుల అర్‌అండ్‌బీ అతిఽథి గృహానికి వెళ్తారు. అక్కడ ప్రజల నుంచి వినతు లు స్వీకరిస్తారు. అనంతరం 1.15 గంటలకు ఏపీ కార్ల్‌కు వెళతారు. 1.35కి బయోటెక్‌ సైన్సు కళాశాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 1.50కి ఐజీ కార్ల్‌ను సందర్శిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో 2.50 గంటలకు వేంపల్లె చేరుకుంటారు. 3.05 గంటల వరకు అంటే పావుగంట సేపు స్థానిక నేతలతో సమావేశమవుతారు. 3.20కి డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌కు చేరుకుని దానిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 3.50కి జడ్పీ బాలికల హైస్కూలుకు చేరుకుంటారు. 4.30 వరకు విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం బాలుర హైస్కూల్‌కు వెళ్లి 4.50 గంటల వరకు విద్యార్థులతో ముచ్చటిస్తారు. 5.05కి హలికాప్టర్‌లో బయలుదేరి 5.15 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. వైఎస్సార్‌ అతిథి గృహానికి వెళ్లి రాత్రికి అక్కడే బసచేస్తారు. 8వ తేదీ ఉదయం రోడ్డు మార్గాన వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 8.40 గంటలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఘాట్‌ వద్ద ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పిస్తారు. 8.50 గంటలకు హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 8.55 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 9.20 గంటలకు విమానంలో బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం చేరుకుంటారు. కాగా.. ఈ పర్యటనలో మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వర్షం కురుస్తుండడంతో సీఎం పర్యటనలో చాలా కార్యక్రమాలు రద్దు కావచ్చని చెబుతున్నారు.

Updated Date - 2022-07-07T08:07:22+05:30 IST