బ్యారక్‌లు 6.. ఖైదీలు 227 మంది

ABN , First Publish Date - 2021-05-10T04:31:06+05:30 IST

మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు సామర్థ్యం 140 మంది. ప్రస్తుతం అక్కడ ఉంటున్నది 227 మంది ఖైదీలు.

బ్యారక్‌లు 6.. ఖైదీలు 227 మంది
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలు

మహబూబ్‌నగర్‌ జైలులో సామర్థ్యానికి మించి ఉన్న వైనం

ఒక్కో బ్యారక్‌లో 30-40 మంది

కొత్తగా వచ్చిన వారు 14 రోజులు ప్రత్యేక సెల్‌లో

ప్రతి రెండు గంటలకోసారి చేతులు శానిటైజ్‌

జైలు ముందు శానిటైజర్‌ టన్నెల్‌ ఏర్పాటు

పక్కాగా కొవిడ్‌ నిబంధనలు అమలు 

ఇవ్వదగ్గ అన్ని కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌

జైలుకు తగ్గిన అడ్మిషన్ల సంఖ్య


మహబూబ్‌నగర్‌, మే 10: మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు సామర్థ్యం 140 మంది. ప్రస్తుతం అక్కడ ఉంటున్నది 227 మంది ఖైదీలు. ఆరు బ్యారక్‌లు, ఐదు సింగిల్‌ గదులు ఉండగా, ఒక్కో బ్యారక్‌లో 30 నుంచి 40 మంది ఖైదీలు ఉంటున్నారు. అంత మంది ఒకే గదిలో ఉండటం ప్రస్తుత కరోనా సమయంలో ఇబ్బందికరం. వైరస్‌ బారిన పడకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నా, వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒకేచోట అంతమందిని ఉంచడం ప్రమాదకరమే.


15 నుంచి 5కు తగ్గిన అడ్మిషన్లు

జైళ్ళల్లో ఖైదీలు నెలల తరబడి మగ్గిపోవడంతో పెరోల్‌, బెయిల్‌పై విడుదలైన వారి పెరోల్‌ను హైపవర్‌ కమిటీ సూచన మేరకు పొడిగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. అయితే హైపవర్‌ కమిటీ సూచన మేరకు పాలమూరులో పెరోల్‌పై విడుదలైన ఖైదీలు ఎవరూ లేరు. జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడంతోపాటు వారికి మరిన్ని మెరుగైన వసతులు కల్పించాల్సి ఉంది. కరోనా కారణంగా తీవ్ర నేరాలు మినహాయిస్తే చాలా వరకు కేసుల్లో పోలీసులు స్టేషన్‌ బైయిలు మంజూరు చేస్తున్నారు. తప్పనిసరి అయితే సాక్ష్యాలను తారుమారు చేస్తారని అనుకున్న కేసులు, గ్రేవ్‌ కేసుల్లో మాత్రం నిందితులను కోర్టులలో హాజరు పరచాలని ఆదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇదివరకటికన్నా జైళ్ళో అడ్మిషన్ల సంఖ్య తగ్గిపోయింది. ఇదివరకు రోజు సగటున 12-15 వరకు అడ్మిషన్లు ఉండగా, ఇప్పుడు 4-5కు తగ్గిపోయాయి. నేరం తీవ్రమని భావించినప్పుడు కోర్టు రిమాండ్‌కు తరలిస్తోంది. 


జైళ్లో కొవిడ్‌ నిబంధనలు

రిమాండ్‌కు తరలించే ఖైదీలకు ముందుగానే కరోనా పరీక్షలు నిర్వహించి, నెగెటివ్‌ వస్తేనే జైలుకు తీసుకెళ్తున్నారు. జైళ్ళో ఖైదీలకు 5 మాస్కులు ఇస్తున్నారు. ఉదయం బ్యారక్‌ల వారీగా యోగా చేయిస్తున్నారు. అందరికీ వేడి నీళ్లు, కషాయం ఇస్తున్నారు. రోజూ ఆక్సీమీటర్‌తో ఆక్సీజన్‌, లేజర్‌ గన్‌తో టెంపరేచర్‌ చెక్‌ చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులకు ప్రత్యేక ట్రీట్‌మెంట్‌ చేయిస్తున్నారు. కరోనాకు సంబంధించిన డోలో, ప్యారసిటమాల్‌, జింక్‌, సీ విటమిన్‌, మల్టీ విటమిన్‌ టాబ్లెట్‌లు రెడీగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఖైదీలను 14 రోజుల పాటు ప్రత్యేక సెల్‌లో ఉంచిన తరువాతనే బ్యారెక్‌లోకి పంపుతున్నారు. ప్రతి రెండు గంటలకోసారి చేతులను శానిటైజ్‌ చేయిస్తున్నారు. ఉదయం అరగంట పాటు ఎండలో కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు ముందు శనివారమే శానిటైజర్‌ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. ఖైదీలు, సిబ్బంది ఎవరు జైలులోపలికి వెళ్లాలన్నా టన్నెల్‌ ద్వారా వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఖైదీలు కరోనా బారిన పడకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలపై ఖైదీలకు అవగాహన కల్పిస్తున్నారు. 

కరోనా నేపఽథ్యంలో జైల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జైలు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరమైన పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 

ఇవ్వదగ్గ అన్ని కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ ఇస్తున్నామని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు చెప్పారు. తీవ్రమైన నేరాలు, సాక్షులను ప్రభావితం చేసే కేసులు, ఏడేళ్లకుపైబడి శిక్ష పడుతుందని భావించే కేసుల్లో మాత్రం రిమాండ్‌ కోసం కోర్టులలో హాజరు పరుస్తున్నాం.

Updated Date - 2021-05-10T04:31:06+05:30 IST