బార్‌లు బార్లా..!

ABN , First Publish Date - 2021-09-29T06:04:25+05:30 IST

మద్యం విక్రయాల ద్వారా వచ్చే సొమ్ము ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది.

బార్‌లు బార్లా..!
ఇసుకతోట వద్ద 8.30 గంటలకు...

ఉదయం ఆరు గంటలకే ప్రారంభం

అర్ధరాత్రి రెండు గంటల వరకూ అమ్మకం

ఆ తర్వాత కూడా వెనుక ద్వారం నుంచి విక్రయాలు

ఎంఆర్‌పీ కంటే క్వార్టర్‌పై రూ.50- రూ.60 వరకూ అధికంగా వసూలు

జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి

పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు

మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పెంచాలన్న

ప్రభుత్వ ఆదేశాలే కారణం 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మద్యం విక్రయాల ద్వారా వచ్చే సొమ్ము ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువ ఆదాయం వచ్చేలా చూడాలని, అమ్మకాలపై ఎటువంటి ఆంక్షలు విధించవద్దని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. దీన్ని ఆసరాగా తీసుకుని బార్‌ల నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా 24 గంటలూ విక్రయాలు జరపడంతోపాటు ఎంఆర్‌పీకి మంగళం పడేస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్‌ అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమీ చేయలేకపోతున్నారు.

జిల్లాలో 126 బార్‌లు ఉన్నాయి. వీటిలో 110 వరకూ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోనే ఉన్నాయి. బార్‌లు సాధారణంగా ఉదయం పది నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే విక్రయాలు జరపాలి. ఉదయం పది గంటలకు ముందుగా బార్‌ తెరిచినా లేదంటే రాత్రి 11 గంటల తర్వాత కూడా విక్రయాలు జరిపినా ఎక్సైజ్‌ శాఖ అధికారులు కేసులు నమోదుచేసి, సీజ్‌ చేసేందుకు అధికారం ఉంది. కొన్నాళ్ల కిందట వరకూ బార్‌ల నిర్వాహకులు సమయపాలన పాటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉదయం ఆరు నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకూ విక్ర యాలు జరుపుతున్నారు. కొంతమంది అయితే తర్వాత కూడా షట్టర్‌ దించేసి, వెనుక ద్వారం నుంచి విక్రయాలు జరుపుతున్నారు. బార్‌లు సమయాలు పాటించడం లేదని, నిరంతరం విక్రయాలు సాగిస్తున్నాయని ఎక్సైజ్‌ శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. 

రాష్ట్రంలో ఇతర రంగాలన్నీ కుదేలైపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇచే ్చందుకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడుతున్నది. ఈ నేపథ్యంలో ఆ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే బార్‌ల సమయపాలన నిబంధనను తాత్కాలికంగా పక్కనపెట్టాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా బార్‌ల నిర్వాహకులు ఎంఆర్‌పీ కంటే క్వార్టర్‌ బాటిల్‌ను రూ.50 నుంచి రూ.60 వరకూ అదనంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో చీప్‌ రకానికి చెందిన హైదరాబాద్‌ బ్రాండ్‌ క్వార్టర్‌ రూ.150 కాగా బార్‌లో రూ.210కి విక్రయిస్తున్నారు. సుప్రీం బ్రాండ్‌ విస్కీ క్వార్టర్‌ ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ.200 కాగా బార్‌లో రూ.270, ఎంహెచ్‌ బ్రాండ్‌ విస్కీ మద్యం దుకాణంలో రూ.260 కాగా బార్‌లో రూ.320కి, 8పీఎం విస్కీ మద్యం దుకాణంలో రూ.260 కాగా బార్‌లో రూ.330, కింగ్‌ఫిషర్‌ బీరు మద్యం దుకాణంలో రూ.210 కాగా బార్‌లో రూ.280కి విక్రయిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్‌ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. బార్‌ల ఇష్టారాజ్యంపై ఎక్సైజ్‌ శాఖ నోడల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా  సమయపాలన తప్పనిసరి అని, ఆకస్మిక దాడులు, స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి నిబంధనలు పాటించని బార్‌లపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2021-09-29T06:04:25+05:30 IST