వ్యాయామంతో పనిలేదు.. డైటింగ్ అస్సలు అక్కర్లేదు.. ఈ సర్జరీతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ..

ABN , First Publish Date - 2021-10-05T17:35:25+05:30 IST

బేరియాట్రిక్‌ సర్జరీ ముఖ్యోద్దేశం శరీర మెటబాలిక్‌ సిండ్రోమ్‌ను అదుపులోకి తీసుకురావడం. శరీరంలో కొవ్వు, ఎండోక్రైన్‌ అవయవంలా పని చేస్తుంది. కొవ్వు నుంచి ఇన్‌ఫ్లమేటరీ ఉత్పత్తులు తయారై గుండె, ఊపిరితిత్తులు మొదలైన కీలక అవయవాల

వ్యాయామంతో పనిలేదు.. డైటింగ్ అస్సలు అక్కర్లేదు.. ఈ సర్జరీతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ..

ఆంధ్రజ్యోతి(05-10-2021)

అధిక బరువు తగ్గాలనుకునేవారిని అమితంగా ఆకర్షిస్తున్న వైద్య ప్రక్రియ  బేరియాట్రిక్‌ సర్జరీ.

‘‘వ్యాయామాలతో పని లేదు, డైటింగ్‌తో అంతకన్నా అవసరం లేదు...

ఈ సర్జరీతో అధిక బరువును సునాయాసంగా తగ్గించుకుందాం!’’... అనుకునేవాళ్లు ఎక్కువ.

కానీ అధిక బరువున్న ప్రతి ఒక్కరూ బేరియాట్రిక్‌ సర్జరీకి అర్హులు కారు.

ఎవరికి ఈ సర్జరీ అత్యవసరమో, ఎలాంటి సందర్భాల్లో ఈ సర్జరీని ఎంచుకోవచ్చో...

వైద్యులు వివరిస్తున్నారు


బేరియాట్రిక్‌ సర్జరీ ముఖ్యోద్దేశం శరీర మెటబాలిక్‌ సిండ్రోమ్‌ను అదుపులోకి తీసుకురావడం. శరీరంలో కొవ్వు, ఎండోక్రైన్‌ అవయవంలా పని చేస్తుంది. కొవ్వు నుంచి ఇన్‌ఫ్లమేటరీ ఉత్పత్తులు తయారై గుండె, ఊపిరితిత్తులు మొదలైన కీలక అవయవాల మీద ఒత్తిడిని పెంచుతాయి. దాంతో వాటి పనితీరు క్రమేపీ కుంటుపడుతుంది. ఇలా అంతర్గత అవయవాల పనితీరును కుంటుపరుస్తుంది కాబట్టే ఆ కొవ్వుకు వైద్య పరిభాషలో ‘సిక్‌ ఫ్యాట్‌’ అని పేరు. ఈ రకం కొవ్వుతో శరీరంలో చోటుచేసుకునే ‘లైపో టాక్సిసిటీ’ ఫలితంగా అంతర్గత అవయవాలన్నీ దీర్ఘకాలంలో తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి ఉపయోగపడేదే బేరియాట్రిక్‌ సర్జరీ. ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడం అనేది భౌతికంగా కనిపించే మార్పు. కానీ సర్జరీతో నిజానికి శరీరంలో అంతర్గతంగా సిక్‌ ఫ్యాట్‌ తగ్గి, మెటబాలిక్‌ మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా మెటబాలిక్‌ సిండ్రోమ్‌కు కారణమైన మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌లు అదుపులోకొస్తాయి. 


మెటబాలిక్‌ సిండ్రోమ్‌ 

వ్యాయామాలతో, ఆహార నియమాలతో మెటబాలిజాన్ని తాత్కాలికంగా మాత్రమే సరిదిద్దుకోగలం. మెరుగైన, శాశ్వతమైన ఫలితాలు బేరియాట్రిక్‌ సర్జరీతోనే సాధ్యపడతాయి. అలాగని అధిక బరువున్న మధుమేహులు, అధిక రక్తపోటు కలిగిన వ్యక్తులందరూ బరువు తగ్గడం కోసం ఈ సర్జరీని ఎంచుకోవచ్చు అనుకుంటే పొరపాటు. మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు వ్యాయామాలు, ఆహార నియమాలతో అధిక బరువును తగ్గించుకోగలిగే వీలుంది. అయితే బరువు అదుపు తప్పి, కొత్త ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నా, వ్యాయామంతో, ఆహార నియమాలతో బరువును తగ్గించుకోలేపోతున్నా ప్రత్యామ్నాయ మార్గంగా బేరియాట్రిక్‌ సర్జరీని ఆశ్రయించాలి. 


షార్ట్‌ కట్‌ కాదు

బేరియాట్రిక్‌ సర్జరీ బరువు తగ్గడానికి దగ్గరి దారి కాదు. ఈ సర్జరీ అధిక బరువును తగ్గించగలిగే మెరుగైన చికిత్సా ప్రక్రియ. వ్యాయామం చేయలేం, ఆహార నియమాలు పాటించలేం, అయినా సరే 5 నుంచి 10 కిలోల బరువు తగ్గాలి కాబట్టి బేరియాట్రిక్‌ సర్జరీని ఆశ్రయిస్తాం అంటే వైద్యులు అందుకు అంగీకరించరు. బిఎమ్‌ఐ 30ని మించి, అధిక బరువు కారణంగా మెటబాలిక్‌ సమస్యలు తీవ్రమవుతూ ఉన్నవారికి మాత్రమే ఈ సర్జరీని వైద్యులు సూచిస్తారు. ఎన్ని మందులు వాడుతున్నా అధిక కొలెస్ట్రాల్‌, అధిక మధుమేహం అదుపులోకి రాకుండా, ఆ ప్రభావంతో గుండె దెబ్బతింటున్నా, అధిక బరువు కారణంగా కీళ్లు అరిగిపోతున్నా, అధిక బరువుతో గర్భం దాల్చలేకపోతున్నా అలాంటి వారికి వైద్యులు బేరియాట్రిక్‌ సర్జరీని సూచిస్తారు. 


ఎవరు అర్హులంటే...

మధుమేహం, కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు సమస్యలు మందులతో అదుపులోకి రాని పరిస్థితి కొందర్లో ఉంటుంది. వ్యాయామాలు చేయడానికి సైతం వీలు లేనంత అధిక బరువు కలిగి ఉండేవాళ్లూ ఉంటారు. అలాగే పరిమిత ఆహారశైలిని అనుసరించినా బరువు అదుపులోకి రానివాళ్లు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్లకు బేరియాట్రిక్‌ సర్జరీని వైద్యులు సూచిస్తారు. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌లు అదుపు తప్పి, అత్యవసరంగా వాటిని అదుపులోకి తీసుకురాకపోతే ప్రమాదకరంగా పరిణమించే పరిస్థితి ఉన్నప్పుడు, అలాంటి వారికి బేరియాట్రిక్‌ సర్జరీ అవసరం పడుతుంది. అలాగే అధిక బరువు కారణంగా గర్భం దాల్చలేని మహిళలకు కూడా ఈ సర్జరీ తోడ్పడుతుంది. అధిక బరువు కారణంగా అవయవ మార్పిడి (కాలేయం, మూత్రపిండాలు) చేయించుకోలేకపోతున్నవాళ్లకు కూడా ఈ సర్జరీ తోడ్పడుతుంది. ఇలా అధిక బరువుతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యలు ఆరోగ్యాన్ని మరింత తీవ్రంగా దెబ్బతీస్తున్న సందర్భాల్లో మాత్రమే బేరియాట్రిక్‌ సర్జరీ అవసరం అవుతుంది. 


మూడు రకాల్లో...

బేరియాట్రిక్‌ సర్జరీ ముఖ్యోద్దేశం జీర్ణవ్యవస్థ పరిమాణం తగ్గించడం ద్వారా తీసుకునే ఆహార పరిమాణం తగ్గించడం. ఈ సర్జరీలో వ్యక్తులను బట్టి స్లీవ్‌; రూ ఎన్‌ వై, మినీ గ్యాస్ట్రిక్‌ బైపాస్‌... ఈ మూడు రకాల సర్జరీలను వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. అవేంటంటే....


రూ ఎన్‌ వై గ్యాస్ట్రిక్‌ బైపాస్‌: జీర్ణాశయం సైజు తగ్గించడంతోపాటు, ఒకటిన్నర, రెండు మీటర్ల మేర చిన్న పేగును ఆంగ్ల అక్షరం ‘వై’ ఆకారంలో దారి మళ్లిస్తారు. 30 నుంచి 40 బిఎమ్‌ఐ కలిగి ఉన్న మధుమేహులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ కలిగిన వ్యక్తులు ఈ సర్జరీకి అర్హులు.


మినీ గ్యాస్ట్రిక్‌ బైపాస్‌: ఈ ప్రక్రియలో జీర్ణాశయం సైజు తగ్గించడంతోపాటు, ఒకటిన్నర మీటర్ల మేర చిన్న పేగును ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో దారి మళ్లిస్తారు. బిఎమ్‌ఐ 40 దాటి, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు కలిగిన వ్యక్తులు ఈ రకం సర్జరీకి అర్హులు. అయితే రూ ఎన్‌ వై లేదా గ్యాస్ట్రిక్‌ బైపాస్‌... చిన్న పేగును ఎంత డైవర్ట్‌ చేయాలనేదాన్ని బట్టి ఈ రెండు సర్జరీల్లో ఒకదాన్ని వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. మధుమేహం, అధిక రక్తపోటులు అత్యంత త్వరగా అదుపులోకి రావలసిన అవసరాన్ని బట్టి, తగ్గవలసిన బరువును బట్టి, ఎవరికి ఏ రకం సర్జరీ అవసరమో వైద్యులు నిర్ణయిస్తారు. 


బేరియాట్రిక్‌ సర్జరీ సురక్షితం

అన్ని రకాల వైద్య ప్రక్రియల మాదిరిగానే బేరియాట్రిక్‌ కూడా విశేషమైన, సురక్షితమైన ప్రక్రియే! అయితే ఆరోగ్యం తిరిగి సరిదిద్దుకోవడానికి సమయం మిగిలి ఉన్నప్పుడే బేరియాట్రిక్‌ సర్జరీని ఎంచుకోవడం ఉత్తమం. అధిక బరువుతో కూడిన అనర్థాలతో ఆరోగ్యం పూర్తిగా కుదేలైన తర్వాత ఈ సర్జరీని ఆశ్రయించడం వల్ల ఉపయోగం ఉండదు.  


ఈ సర్జరీ చేయించుకున్నవాళ్లకు కుటుంబసభ్యుల తోడ్పాటు కూడా అవసరం. మంచం దిగలేనంత అధిక బరువు కలిగి ఉండి, బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవాళ్లను కుటుంబసభ్యులు వ్యాయామం చేయించకుండా అలాగే వదిలేస్తే, వారికి కాళ్లల్లో రక్తపు గడ్డలు ఏర్పడవచ్చు. రక్తపు గడ్డలు ఏర్పడకుండా ఉండడం కోసం మందులు వాడుతున్నప్పటికీ, శరీరానికి ఎంతో కొంత వ్యాయామం అవసరం. కాబట్టి కుటుంబసభ్యులు సర్జరీ చేయించుకున్న వ్యకిని చెరొక వైపు ఆసరా ఇస్తూ, నడిపించాలి.


ప్రయోజనాలు ఇవే!

సర్జరీ నుంచి కోలుకునే సమయం తగ్గడం, చిన్న కోతలు, తక్కువ రక్తస్రావం ఈ సర్జరీ ప్రయోజనాలు. అంతేకాకుండా...

సర్జరీతో 70% నుంచి 80% బరువు తగ్గుతారు. 

80% నుంచి 90% మందిలో చక్కెర స్థాయిలు అదుపులోకొస్తాయి. 

హైపర్‌టెన్షన్‌ కూడా 70% నుంచి 80%తగ్గుతుంది. 

కీళ్ల నొప్పులు అదుపులోకి వస్తాయి. 

ఊపిరితిత్తుల మీద ఒత్తిడి తగ్గి, ఆయాసం తగ్గుతుంది. 

నిద్రలేమికి వాడే సిపాప్‌ లాంటి పరికరాల అవసరం తగ్గుతుంది. 

ఇన్‌ఫెర్టిలిటీ సమస్య తొలగిపోతుంది. 


సప్లిమెంట్లు అవసరం...

సర్జరీ తదనంతరం తీసుకునే ఆహార పరిమాణం తగ్గుతుంది కాబట్టి, దాన్లో అవసరమైన పోషకాలన్నీ ఉండేలా ప్రణాళికాబద్ధమైన ఆహార నియమాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అలాగే ఐరన్‌, క్యాల్షియం మొదలైన సప్లిమెంట్లు కూడా ఏడాది పాటు తప్పనిసరిగా వాడాలి. 70ు నుంచి 80ు మంది ఏడాదిలోపు మెరుగైన ఫలితాలను కనబరుస్తూ ఉంటారు. ఇలాంటి వారికి మిగతా సప్లిమెంట్లను ఆపేసి, మల్టీవిటమిన్‌ టాబ్లెట్‌ ఒక్కటే కొనసాగిస్తే సరిపోతుంది. అయితే మిగతా 20 %మంది వైద్యులు సూచించిన ఆహార నియమాలను పాటించని బ్యాడ్‌ ఈటర్స్‌. వీళ్లు తీసుకుంటున్న ఆహారం, దాని ద్వారా అందే క్యాలరీలను అంచనా వేసి, పోషకాహార లోపం కనిపిస్తే, దాన్ని భర్తీ చేయడం కోసం వేర్వేరు సప్లిమెంట్లు వాడవలసి ఉంటుంది. వైద్యులు సూచించిన మేరకు వ్యాయామాలు, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు కూడా చేయవలసి ఉంటుంది.


స్లీవ్‌: స్లీవ్‌లో జీర్ణాశయం సైజు మాత్రమే తగ్గిస్తారు. బిఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 30 నుంచి 40 మధ్య ఉండి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేనివాళ్లు, అవయవ మార్పిడి అవసరం ఉన్నవాళ్లు ఈ రకం సర్జరీకి అర్హులు. అలాగే అధిక బరువు కారణంగా గర్భం దాల్చలేని మహిళలకు కూడా స్లీవ్‌ బేరియాట్రిక్‌ సర్జరీని వైద్యులు ఎంచుకుంటారు. అలాగే చిన్న పేగుకు పూర్వ సర్జరీలు అయి ఉన్నవాళ్లకు కూడా ఇదే సర్జరీని వైద్యులు ఎంచుకుంటారు. 


డాక్టర్‌ కోన లక్ష్మీ కుమారి,

సీనియర్‌ సర్జికల్‌ 

గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్‌ అండ్‌ బేరియాట్రిక్‌ సర్జన్‌,

యశోద హాస్పిటల్స్‌,

సోమాజిగూడ, హైదరాబాద్‌.


Updated Date - 2021-10-05T17:35:25+05:30 IST