Advertisement
Advertisement
Abn logo
Advertisement

బేరసరాలు

‘మండలి’ ఎన్నికల్లో బుజ్జగింపులు, ప్రలోభాలు షురూ!

కాంగ్రెస్‌ ఎంపీటీసీని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్న ఎమ్మెల్యే

48 గంటల్లో తిరిగి కాంగ్రెస్‌ గూటికి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, నవంబరు 26 : శాసనమండలి ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో ఉండేది ఎవరో తేలిపోయింది. అధికారికంగా ముగ్గురు బరిలో ఉన్నా పోటీ మాత్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యనే ఉండనుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సొంతం చేసుకోవాలనే పట్టుదలతో పార్టీలు ప్రలోభాలకు తెర తీశాయి. ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునేందుకు బేరసారాలు మొదలుపెట్టారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గం కల్హేర్‌ మండలం రాపర్తికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ శామమ్మకు ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారు. కానీ 48 గంటల్లోనే సదరు ఎంపీటీసీ తిరిగి సొంతగూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది.


డబుల్‌బెడ్‌రూం ఇస్తాం..  డబుల్‌ పైసలిస్తాం

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఓటేస్తే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం.. ఓటేసేందుకు అందరికన్నా రెట్టింపు డబ్బులు ఇస్తాం’.. అని అధికారపార్టీ నేతలు కాంగ్రె్‌సకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆశ చూపుతున్నారు. అంతటితో ఆగకుండా తమ ప్రాదేశిక నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. తమ సభ్యులను అనుకూలంగా మార్చుకునేందుకు అనేవిధాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారు. 


రసవత్తరంగా

అధికార పార్టీ ప్రలోభాల పర్వంలో భాగంగానే కల్హేర్‌ మండలం రాపర్తి ఎంపీటీసీ సభ్యురాలు శామమ్మను మండల ప్రజాప్రతినిధి ఒకరు ప్రలోభపెట్టి ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకవెళ్లారని, అక్కడ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి టీఆర్‌ఎ్‌సలోకి చేర్చుకున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీటీసీ సభ్యురాలు శామమ్మను టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్నారని తెలియగానే కాంగ్రెస్‌ అప్రమత్తమైంది. గతంలో ఆమె ఎన్నికకు సహకరించిన జిల్లా కాంగ్రెస్‌ మాజీ కార్యదర్శి పి.చంద్రశేఖర్‌రెడ్డి ఆమెతో మాట్లాడారు. సమావేశం ఉదని తీసుకువెళ్లారని, పార్టీలో చేరే విషయం తనకు తెలియదని ఆమె వివరించారు. టీఆర్‌ఎస్‌లో చేరడం తనకు ఇష్టం లేదని కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని చెప్పారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం నాడు తన నివాసంలో శామమ్మకు కాంగ్రెస్‌ కండువా వేసి తిరిగి పార్టీలో చేర్చుకున్నట్టు ప్రకటించారు. సొంతగూటికి రావడం సంతోషంగా ఉన్నదని శామమ్మ పేర్కొనడం విశేషం.


ఫలిస్తున్న హరీశ్‌ వ్యూహం

వెనక్కి తగ్గిన రెబల్స్‌... నామినేషన్ల ఉపసంహరణ


ఆంద్రజ్యోతి, మెదక్‌ ప్రతినిధి, నవంబర్‌ 26 : మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఎదురు లేకుండా చేయడంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు విజయవంతమవుతున్నారు. ఎన్నికల బరిలోకి దిగిన రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకుంటున్నారు. చెప్పినట్టు వింటే ఆశించిన దానికంటే ఎక్కువే చేస్తానని హామీ ఇస్తున్నారు. నిధులు, విధుల విషయంలో అసంతృప్తిగా ఉన్న ఎంపీటీసీలతో మంత్రి జిల్లాలవారీగా మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి యాదవరెడ్డి నామినేషన్‌ వేసిన రోజు మెదక్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం డిమాండ్లు నెరవేర్చుతామని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశంతో కొండపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతల సాయిబాబా, సంగారెడ్డి కౌన్సిలర్‌ విజయలక్ష్మి నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. 


హుజూరాబాద్‌ ఫలితంతో అప్రమత్తం

టీఆర్‌ఎస్‌ నేతల అత్యుత్సాహం, అతి నమ్మకం హుజురాబాద్‌ ఉపఎన్నికలో దెబ్బతీశాయి. అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామనుకున్న దుబ్బాక స్థానం చేజారింది. ట్రబుల్‌షూటర్‌గా గుర్తింపు ఉన్న మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన రెండుచోట్ల ఓటమిని చవిచూడటంంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 800 ఓట్లు ఉన్నాయి. వీటిలో ఒక్క ఓటు కూడా చేజారకుండా చూడాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలవారీగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంత్రి భేటీ అవుతున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. రెండు రోజుల్లో మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు చెందిన స్థానక సంస్థల ప్రజాప్రతినిధులతోనూ సమావేశం నిర్వహిస్తారని సమాచారం.


ఎల్లుండి నుంచి టీఆర్‌ఎస్‌ క్యాంపు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం వ్యూహాలకు పదునుపెడుతున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన 800 వందల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆదివారం నుంచి శిబిరాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సిద్దిపేటకు చెందిన ప్రజాప్రతినిధులు ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ లేదా జమ్మూకశ్మీర్‌కు వెళ్లాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను డిసెంబర్‌ 1 నుంచి క్యాంపునకు తరలించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. మెదక్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల క్యాంపు వివరాలు ఇంకా తేలలేదు. క్యాంపులో ఎలాంటి లోటు రాకుండా సకలం సమకూర్చుతున్నట్టు తెలిసింది. డిసెంబర్‌ 10న నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి ఓటు వేయించనున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన ఓటర్లకు కూడా వల వేసేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. 

Advertisement
Advertisement