పరస్పర బదిలీల్లో బేరసారాలు

ABN , First Publish Date - 2022-01-22T04:06:41+05:30 IST

టీచర్ల ట్రాన్స్‌ఫర్లు చాలా ఖరీదుగా తయారయ్యాయి. స్పౌజ్‌, పరస్పర బదిలీల్లో పెద్ద ఎత్తున డబ్బు ప్రవాహనం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం 317 జీవోను తెరపైకి తెచ్చింది. జీవోలో స్థానికతను పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

పరస్పర బదిలీల్లో బేరసారాలు

స్పౌజ్‌ ట్రాన్స్‌ఫర్లలో డబ్బుల డిమాండ్‌

భారీ ఆఫర్‌ ఇస్తున్న ఉపాధ్యాయులు

బహుమతుల కింద కారు, లక్షల్లో నగదు

మంచిర్యాల, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): టీచర్ల ట్రాన్స్‌ఫర్లు చాలా ఖరీదుగా తయారయ్యాయి. స్పౌజ్‌, పరస్పర బదిలీల్లో పెద్ద ఎత్తున డబ్బు ప్రవాహనం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం 317 జీవోను తెరపైకి తెచ్చింది.  జీవోలో స్థానికతను పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. జీవోలో స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా గందరగోళ పరిస్థితుల్లో  ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసింది. స్పౌజ్‌, సీనియారిటీ జాబితాలో తప్పుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండానే బదిలీ ప్రక్రియ ముగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 

బదిలీల్లో డబ్బు ప్రవాహం...

ప్రస్తుతం జరిగిన బదిలీల్లో అనుకూల స్థానాలు రానివారికి ప్రభుత్వం పరస్పర ట్రాన్స్‌ఫర్లకు అవకాశం కల్పించింది. అంటే వేర్వేరు జిల్లాల్లో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు తమ పరస్పర అంగీకారంతో ఇష్టమైన జిల్లాకు వెళ్లే అవకాశం కలిగింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించడంతో టీచర్ల మధ్య డబ్బు ప్రవాహానికి తెరలేసింది. పరస్పర బదిలీపై డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్లేందుకు కొందరు ఉపాధ్యాయులు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం జిల్లా, మండలాన్ని బట్టి లక్షల్లో డిమాండ్‌ చేస్తున్నారు. పరస్పర బదిలీల్లో భాగంగా మంచిర్యాల జిల్లా నుంచి కుమరంభీం ఆసిఫాబాద్‌కు బదిలీపై వెళ్లేందుకు ఓ టీచర్‌ ఏకంగా ఓ కారును గిఫ్ట్‌గా కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రకం బదిలీల్లో ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా సీని యారిటీ ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపులు జరుగడంతో చాలా మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాల్లో విధులు నిర్వహించాల్సిన పరి స్థితులు తలెత్తాయి. దీంతో వారు కోరుకున్న జిల్లాకు బదిలీ అయ్యేందుకు అవకాశాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లక్షలు వెచ్చించి పరస్పర బదిలీలకు సిద్ధపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు అధిక డిమాండ్‌ ఉంది. 

స్పౌజ్‌ బదిలీల్లో ముందస్తు అగ్రిమెంట్లు

ప్రస్తుతం పరస్పర బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, త్వరలో స్పౌజ్‌ ట్రాన్స్‌ఫర్లు చేపట్టేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. దీంతో స్పౌజ్‌ కేటగిరీలో ఒకేచోట పనిచేసేందుకు దంపతులైన ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమకు సహకరించే వారు ఏ జిల్లాల్లో ఉన్నారో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పరస్పర బదిలీలైనా, స్పౌజ్‌ ట్రాన్స్‌ఫర్లయినా ఒకసారి కోరుకున్న జిల్లాకు వెళితే  సర్వీసు పూర్తయ్యే వరకు అదే జిల్లాలో ఉండే అవకాశం లభిస్తున్నందున లక్షలు కుమ్మరించేందుకు ఆశావహులు వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఉద్యోగాలతోపాటు ఇతరత్రా వ్యాపకాలు ఉన్న వారు ఇందు కోసం  ప్రయత్నిస్తున్నారు. ఉపాధ్యాయుల్లో అనేక మంది రియల్‌ ఎస్టేట్‌, ఫైనా న్స్‌, చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇంతకాలం వ్యాపారంపై ఆధార పడ్డ వారు ఒకేసారి ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు ఏర్పడతాయని భావిస్తున్నారు. అవకాశం వస్తే రూ.10 లక్షలు చెల్లించేం దుకైనా వెనుకాడడం లేదు.  గతంలో పరస్పర బదిలీలు ఇద్దరు టీచర్ల అంగీకారంతో జరిగేవి. దీనికి విద్యాశాఖ అనుమతులు లభించడంతో బదిలీల ప్రక్రియ సులువయ్యేది. ప్రస్తుతం పై రెండు కేటగిరీలలో డబ్బు ప్రవాహనం ఉన్నందున రాజీపడి ఉన్నచోటనే కాలం వెళ్లదీసే పరిస్థితులు వచ్చాయి. 

వాట్సాప్‌ గ్రూపుల ద్వారా

పరస్పర, స్పౌజ్‌ బదిలీల కోసం ఉపాధ్యాయులు కొందరు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రూపుల్లో బదిలీలు కోరుకునే వారు తమ వివరాలు పోస్టు చేస్తారు. దీంతో ఆ గ్రూపులో ఉన్న ఇతర ఉపాధ్యాయులకు సమాచారం చేరడం వల్ల వారికి మార్గం సుగమం అవుతుంది. మరోవైపు ఈ బదిలీల ప్రక్రియలో కొందరు మధ్యవర్తిత్వం నెరుపుతూ అందిన కాడికి దండుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీలు కోరుకునే ఉపాధ్యాయులకు సమాచారం అందించడం ద్వారా సదరు వ్యక్తులు కమీషన్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-01-22T04:06:41+05:30 IST