దత్తత ప్రక్రియ.. వ్యాపారం

ABN , First Publish Date - 2022-05-25T06:32:11+05:30 IST

బోసి నవ్వుల పాపాయిలు. ఏమీ ఎరుగని బుజ్జాయిలు. లాలించి ముద్దాడే అమ్మానాన్న విధివశాత్తూ వారికి దూరమై ఉంటారు.

దత్తత  ప్రక్రియ.. వ్యాపారం
శిశుగృహ

బోసినవ్వులకు బేరం

అనంత శిశుగృహలో అక్రమాలు

ఫిర్యాదులు వచ్చినా.. ఉత్తుత్తి చర్యలు


బోసి నవ్వుల పాపాయిలు. ఏమీ ఎరుగని బుజ్జాయిలు. లాలించి ముద్దాడే అమ్మానాన్న విధివశాత్తూ వారికి దూరమై ఉంటారు. ఆ పసివారిని ‘అనాథలు’ అని పిలిచేందుకు ఎవరికైనా మనసురాదు. ఆకలివేస్తే ఏడ్చడం, కడుపు నిండితే ఆడుకోవడం, ఆదమరిచి నిద్రపోవడం మినహా మరో ప్రపంచం తెలియదు వారికి. పలకరిస్తే మురిసిపోతారు. ఎత్తుకుంటే హత్తుకుపోతారు. ఇలాంటి బుజ్జాయిలకు అమ్మానాన్న అవుదామని సంతాన భాగ్యం లేని ఎందరో దంపతులు ఆరాటపడతారు. తల్లిదండ్రులు లేని పిల్లలు.. పిల్లలు లేని తల్లిదండ్రులు..! వీరు ఒక్కటైతే.. ఆ సంబరం చూడాలని ఎవరికుండదు..? ఎంతైనా మనుషులం కదా..!

                  .....కానీ,  అందరూ ఇలానే ఉండాలని లేదు కదా! బిడ్డల కోసం పరితపించే దంపతుల ఆత్రానికి  కొందరు ధర నిర్ణయిస్తున్నారు. కాసులో, కానుకలో ఇస్తే తప్ప దత్తత ఇవ్వడం లేదు. అనాథ బాలలను సంరక్షించి, అర్హులకు దత్తత ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ వ్యవస్థలో భాగం వారు. పసివారి బోసి నవ్వులకు, బిడ్డలకోసం పరితపించే హృదయాలకు వెల కడుతున్నారు. అనంత శిశుగృహలో కొన్నేళ్లుగా జరుగుతున్న దారుణం ఇది. 


అనంతపురం విద్య : ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నగరంలోని బుడ్డప్ప నగర్‌ సమీపంలో శిశుగృహను నిర్వహిస్తున్నారు. ఇక్కడ అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు ఆరేళ్లలోపు పసివారు ఉంటారు. నా అన్నవారు లేని వీరిని దత్తత తీసుకునేందుకు సంతానం లేని దంపతులు ఎక్కువగా వస్తుంటారు. బిడ్డలు లేని లోటు తీర్చుకోవాలని, అనాథలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తారు. శిశుగృహ సంరక్షణలో ఉండే శిశువులను దత్తత ఇచ్చే విషయంలో అక్కడ పనిచేసే సిబ్బందిలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఐదారేళ్లుగా ఎక్కువయ్యాయి. ఇటీవల దత్తత కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకూ 97 నుంచి 100 వరకూ దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 2015 నుంచి ఇప్పటి వరకూ 74 మందిని దత్తత ఇచ్చారు. 2018 నుంచి దత్తతపై తరచూ విమర్శలు వస్తున్నాయి. ఒకరిద్దరు మహిళా వర్కర్లు దత్తత కోసం వచ్చేవారి నుంచి భారీగా డబ్బులు గుంజుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఉమన్‌వర్కర్‌ బంగారు గొలుసు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయినా, దత్తత విషయంలో సహకరించలేదని సమాచారం. దీంతో బాఽధితురాలు ఈనెల 9న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


విచారణ ఘనం.. చర్యలు శూన్యం..

కలెక్టర్‌ ఆదేశాలతో వర్కర్‌పై వచ్చిన ఆరోపణల గురించి విచారించారు. రెండు రోజులపాటు విచారణ చేసిన అధికారులు, ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులు.. ‘కట్టె విరగకుండా.. పాము చావకుండా’ వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇదే శిశుగృహలో అక్రమాలకు పాల్పడిన ఓ అధికారిని విధుల నుంచి తొలగించారు. అలాంటి సంఘటనలే పునరావృతం అయ్యాయి. కానీ ఐసీడీఎస్‌ అధికారులు మహిళా వర్కర్‌పై కనికరం చూపడం విమర్శలకు తావిస్తోంది. శిశు గృహ నుంచి ఆమెను సఖి సెంటర్‌కు బదిలీ చేశారు. శిశుగృహలోని మహిళా వర్కర్‌ను సఖి సెంటర్‌లో కేస్‌ వర్కర్‌గా బదిలీ చేయడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల వైఖరి చూసిన ఉద్యోగులు, ఆమెను శిక్షించారా..? లేక రక్షించారా..? ఉన్నతాధికారులకే తెలియాలి అని చెవులు కొరుక్కుంటున్నారు.


కలెక్టర్‌ కళ్లకు గంతలు..

సిబ్బందిలో కొందరి కారణంగా ఐసీడీఎ్‌సకు, శిశగృహకు అవినీతి చీడ పట్టుకుంది. బాధితులే ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా విచారణ తూతూ మంత్రంగా చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సమగ్ర బాలల సంరక్షణ పథకంలో (ఐసీపీఎస్‌) పనిచేసే ఓ అధికారి, మరికొందరు ఐసీడీఎ్‌సలోని ఉన్నతాధికారులు అక్రమార్కులపై వేటు పడకుండా కాపాడారన్న ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్‌ కళ్లకు గంతలు కట్టి, అక్రమార్కులను తప్పిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై కలెక్టర్‌ దృష్టి సారించకుంటే, అక్రమార్కులు మరింత పెట్రేగే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు. అనాథ పిల్లల దత్తత విషయంలో అవకతవకలు పెరిగే ప్రమాదం ఉందని ఆ శాఖ  అధికార వర్గాలే అంటున్నాయి.



అక్రమాలు తేలితే తొలగిస్తాం..

చిన్నారుల దత్తత విషయంలో గతంలో ఆరోపణలు వచ్చినమాట వాస్తవమే. అవినీతి, అక్రమాలు నిజమని తేలితే, బాధ్యులను విధుల నుంచి తొలగిస్తాం. అక్కడి సిబ్బందికి ఇదే విషయం చెప్పి గట్టిగా హెచ్చరించాం. వారంలో ఒకటి రెండు సార్లు పర్యవేక్షిస్తున్నాం. శిశు గృహ, బాల సదన్‌ సంరక్షణలో ఉన్న చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.

- మేడా రామలక్ష్మి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌


సఖి సెంటర్‌కు బదిలీ చేశాం..

శిశుగృహలో పిల్లల దత్తత విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగిని విచారించాం. బాధితురాలి ఫిర్యాదు మేరకు కలెక్టర్‌ ఆదేశాలతో విచారణ చేయించాం. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెను సఖి సెంటర్‌కు బదిలీ చేశాం. ఆమె అక్కడ చేరలేదు.

- సుశీలాదేవి, ఐసీడీఎస్‌ పీడీ

Updated Date - 2022-05-25T06:32:11+05:30 IST