కల నిజమాయెగా..

ABN , First Publish Date - 2021-06-13T09:48:52+05:30 IST

సంచలనాలతో ఆరంభమైన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌.. అదే రీతిన ముగిసింది. తొలి రౌండ్‌ నుంచే మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ బార్బోరా క్రెజికోవా శనివారం జరిగిన ఫైనల్లో...

కల నిజమాయెగా..

  • అన్‌సీడెడ్‌ క్రెజికోవాదే ఫ్రెంచ్‌ ఓపెన్‌
  • గత ఐదేళ్లలో రొలాండ్‌ గారోస్‌లో మహిళల సింగిల్స్‌ 
  • విజేతగా నిలిచిన మూడో అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ క్రెజికోవా

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో బార్బోరా క్రెజికోవా చరిత్ర సృష్టించింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరిన ఆమె కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్నందుకుంది. ఫైనల్లో రష్యా తార పవ్లిచెన్‌కోవాను ఓడించి.. 40 ఏళ్ల తర్వాత రొలాండ్‌ గారోస్‌లో టైటిల్‌ నెగ్గిన తొలి చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణిగా రికార్డుకెక్కింది. 


పారిస్‌: సంచలనాలతో ఆరంభమైన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌.. అదే రీతిన ముగిసింది. తొలి రౌండ్‌ నుంచే మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న అన్‌సీడెడ్‌ ప్లేయర్‌ బార్బోరా క్రెజికోవా శనివారం జరిగిన ఫైనల్లో 6-1, 2-6, 6-4తో అనస్తా సియా పవ్లిచెన్‌కోవాపై గెలిచింది. 1981లో హనా మండ్లికోవా తర్వాత మరో చెక్‌ క్రీడాకారిణి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేతగా నిలవడం ఇదే తొలిసారి. అలాగే క్రెజికోవాకిది కేవలం రెండో డబ్ల్యూటీఏ సింగిల్స్‌ టైటిల్‌. గంటా 58 నిమిషాల పోరులో ప్రపంచ 33వ ర్యాంకర్‌ క్రెజికోవా 6 బ్రేక్‌ పాయింట్లు సాధిం చగా, 31 అనవసర తప్పిదాలకు పాల్పడింది. విజేత క్రెజికోవాకు రూ.12 కోట్ల 37 లక్షలు, రన్నరప్‌ పవ్లిచెన్‌కోవాకు రూ. 6 కోట్ల 65 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది. కాగా, సింగిల్స్‌ విజేతగా నిలిచిన క్రెజికోవా మహిళల డబుల్స్‌లోనూ ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగే ఫైనల్లో స్వియటెక్‌/బెతానీ జోడీతో క్రెజికోవా/సినియకోవా జంట తలపడనుంది.


Updated Date - 2021-06-13T09:48:52+05:30 IST