కిక్కు.. కుమ్మక్కు..

ABN , First Publish Date - 2022-08-06T06:24:37+05:30 IST

కిక్కు.. కుమ్మక్కు..

కిక్కు.. కుమ్మక్కు..

జిల్లాలోని బార్లు పంచుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు

80 శాతం బార్లు ఎమ్మెల్యేల బినామీలవే..

ఓ మంత్రి బినామీల ఖాతాలో 20 బార్లు

వాక్‌ ఇన్‌ స్టోర్లలోనూ వారిదే పెత్తనం 

ధరలు పెంచేసి మరీ విక్రయాలు


అధికారంలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తామని ప్రజలను మభ్యపెట్టిన వైసీపీ ఇప్పుడు అదే మద్యాన్ని తమ పార్టీ నేతలకు ఆదాయ వనరుగా మార్చేసింది. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో ఇటీవల నిర్వహించిన బార్ల ఈ-వేలాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు పెద్ద ఫార్సుగా మార్చేశారు. ఎక్సైజ్‌ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఆడిన మందాటలో డబ్బు బాగానే చేతులు మారగా, ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీగా గండిపడింది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 110 బార్లకు ఈ-వేలం నిర్వహించారు. వీటిని దక్కించుకునేందుకు 111 దరఖాస్తులు రావడంతోనే ఈ-వేలం తంతు పెద్ద బూటకమని తేలిపోయింది. ఓ మంత్రి పీఏతో కలిసి జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వ్యాపారులను బెదిరించి, సిండికేట్‌ పేరుతో మభ్యపెట్టి బార్లను తమ ఖాతాలో వేసుకున్నారు. 

80 శాతం మంది ప్రజాప్రతినిధుల బినామీలే..

విజయవాడ నగరంలోని 110 బార్లకు గానూ 109 బార్లను కేటాయించారు. ఈ బార్లలో 80 శాతం వాటిని జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దక్కించుకోవడం గమనార్హం. నగరానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణుతో పాటు మంత్రి జోగి రమేశ్‌ బినామీలు విజయవాడ నగరంలో అధికశాతం బార్లను దక్కించుకున్నారు. మచిలీపట్నంలో స్థానిక ఎమ్మెల్యే బినామీలే మొత్తం బార్లను తమ ఖాతాలో వేసుకున్నారు. 

వాక్‌ ఇన్‌ స్టోర్లలో హవా

మద్య నిషేధాన్ని ఎప్పుడో అటకెక్కించిన వైసీపీ సర్కార్‌ ఇప్పటికే వాక్‌ ఇన్‌ స్టోర్ల పేరుతో ఏరులై పారిస్తోంది. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలు సరేసరి. అయితే, ఇక్కడ కేవలం నాసిరకం మద్యాన్ని విక్రయిస్తుండటంతో వాక్‌ ఇన్‌ స్టోర్లకు, బార్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వీటిని దక్కించుకునేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 20కిపైగా వాకిన్‌ స్టోర్లు నడుస్తున్నాయి. ఇవన్నీ వైసీపీ ప్రజాప్రతినిధులవే. వీటిలో మద్యం ధరను సైతం ఇష్టారాజ్యంగా పెంచేసి విక్రయిస్తున్నారు. కానీ, పట్టించుకునేవారు లేరు. నగరంలోని 109 బార్లలో సుమారు 20కిపైగా బార్లను మంత్రి బినామీలే దక్కించుకోవడం గమనార్హం. గతంలో నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే బినామీలు 15 బార్ల వరకూ దక్కించుకున్నారు. మరో మంత్రి పీఏ సైతం 10 బార్ల వరకు తన స్నేహితుల పేరుతో దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఈయనే సిండికేట్‌ను సెట్‌ చేయడంలో కీలకపాత్ర పోషించారు. 

మరీ ఇంత అడ్డగోలా..

మున్సిపాలిటీల్లో ఉన్న బార్లకు అప్‌సెట్‌ ధర కంటే రెట్టింపునకు పైగా ధర పలకగా, విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో మాత్రం అప్‌సెట్‌ ధరకు కాస్త అటు ఇటుగా దక్కించుకున్నారు. వేలం ధరను రూ.2 లక్షల చొప్పున పెంచుకుంటూ పోవాలన్న నిబంధన ఉండటంతో ఆ మాత్రమైన ధర పలికిందని, లేకుంటే రూ.51 లక్షల లేదా రూ.52 లక్షలకే వేలం ముగిసిపోయేదని కొందరు వ్యాపారులు వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీలో 12 బార్లకు ఈ-వేలం నిర్వహించారు. రూ.35 లక్షలు అప్‌సెట్‌ ధరగా నిర్ణయించారు. ఇక్కడ అత్యధికంగా రూ.97 లక్షలకు బార్‌ను దక్కించుకున్నారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 110 బార్లకు ఈ-వేలం నిర్వహించారు. అప్‌సెట్‌ ధర రూ.50 లక్షలు. కానీ, ఇక్కడ వ్యాపారులు అత్యధికంగా పెట్టిన ధర రూ.54 లక్షలే.

Updated Date - 2022-08-06T06:24:37+05:30 IST