రాయ..బారులు

ABN , First Publish Date - 2022-08-05T06:06:30+05:30 IST

రాయ..బారులు

రాయ..బారులు

బార్ల వేలంలో తెరవెనుక పెద్దలు

చక్రంతిప్పిన ఎక్సైజ్‌ అధికారి, ఓ మంత్రి పీఏ

వేలానికి ముందే ప్రభుత్వ పెద్దలతో మాటలు

అధికారి బినామీలకూ బార్ల పందేరం

లైసెన్సులు దక్కించుకున్న వారి పేర్లు గోప్యం

ఎన్టీఆర్‌ జిల్లా బార్ల వేలమంతా సీక్రెట్‌


ఎన్టీఆర్‌ జిల్లాలోని బార్ల వేలంలో సిండికేట్‌గా మారిన వ్యాపారుల వెనుక ఓ జిల్లాస్థాయి ఎక్సైజ్‌ అధికారి కీలకంగా వ్యవహరించినట్టు తెలిసింది. ఓ మంత్రి పీఏతో కలిసి అంతా తానై నడిపించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారిగా ఉండి, ప్రభుత్వ ఆదాయానికే గండికొట్టేలా వ్యవహరించిన ఈయన తీరు ప్రస్తుతం ఉన్నతాధికారుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లాలో 122 బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయవాడలో 110, కొండపల్లిలో 8, తిరువూరులో 1, నందిగామలో 1, జగ్గయ్యపేటలో 2 వెరసి 122 బార్లకు కలెక్టర్‌ కార్యాలయంలో ఈ-బిడ్డింగ్‌ నిర్వహించారు. విజయవాడలో ఒక బార్‌, జగ్గయ్యపేటలో ఒక బార్‌కు తప్ప మిగిలిన వాటికి లైసెన్సుదారులను ఖరారు చేశారు. వేలంలో పాల్గొన్న వ్యాపారులంతా సింకిడేట్‌గా మారి ధరలను కోట్‌ చేశారు. విజయవాడలోని బార్లకు రూ.50 లక్షలను అప్‌సెట్‌ ధరగా నిర్ణయిస్తే, రూ.52-54 లక్షల మధ్యే వ్యాపారులు పాడుకున్నారు. 

ఆఫ్‌లైన్‌లో..

ఈ బార్లకు వేలం ఆన్‌లైన్‌లో జరిగినా ఆఫ్‌లైన్‌లో జిల్లాకు చెందిన ఓ ఎక్సైజ్‌ అధికారి, ఓ మంత్రి పీఏ చక్రం తిప్పినట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగిన వేలంలో తిరువూరులోని బారును రూ.59 లక్షలకు దక్కించుకున్నారు. కొండపల్లిలో ఎనిమిది బార్లలో రెండింటిని ఇద్దరు వ్యక్తులు చెరో రూ.19 లక్షలకు పాడుకోగా, ఆరు బార్ల విషయంలో సిండికేట్‌ అయ్యారు. విజయవాడలో 110 బార్లకు 111 దరఖాస్తులు వచ్చాయని చెప్పినప్పటికీ ఆ ఒక్క దరఖాస్తు ఆటలో అరటిపండుగా పెట్టారు. సాధారణంగా ఒక వేలం జరిగినప్పుడు పాటదారులు పాల్గొని పోటీగా ధరలు పెడతారు. ఇక్కడ మాత్రం సిండికేట్‌ 111 దరఖాస్తులను దాఖలు చేయడం వెనుక ఎక్సైజ్‌ శాఖలోని కొంతమంది హస్తం ఉందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీని వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయని ప్రచారం నడుస్తోంది. వేలానికి ముందే తాము ఎక్సైజ్‌ అధికారులతో ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడించుకున్నామని బార్లు దక్కించుకున్న వారు బహిరంగంగానే చెప్పారు. బార్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పైన ఎంత పెట్టాలన్న విషయాన్ని ఈ శాఖలోని అధికారులే సూచించినట్టు వ్యాపారులు చెప్పుకొంటున్నారు. పనిలో పనిగా సదరు ఎక్సైజ్‌ అధికారి తన బినామీలకు ఏడు బార్లు కేటాయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

అంతా గోప్యం..!

ఎన్టీఆర్‌ జిల్లాలో ఖరారైన బార్ల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలను మాత్రం వేలం ముగిశాక బహిర్గతం చేసిన అధికారులు ఏ బార్‌ను ఎవరు దక్కించుకున్నారన్న పేర్లను మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. వేలం ముగిసిన వెంటనే కృష్ణాజిల్లాలో ఏ బార్‌ను ఎవరు పాడుకున్నారు, ఎంతకు కోట్‌ చేశారు అనే వివరాలను విడుదల చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో మాత్రం అలా జరగలేదు. 122 బార్లలో 120కు నిర్వహించిన వేలం ద్వారా రూ.59కోట్ల41లక్షల60వేల ఆదాయం వచ్చిందని, దరఖాస్తుల రుసుం ద్వారా రూ.11కోట్ల97లక్షల50వేలు వచ్చిందని వెల్లడించారు. ఈ బార్లను దక్కించుకున్న వారి పేర్లను మాత్రం బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. ఈ పేర్లు వెల్లడించడానికి తమకు నిబంధనలు అంగీకరించవని అధికారులు చెబుతుండడం గమనార్హం. పేర్లు బయటకొస్తే తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే అధికారులు ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. 


Updated Date - 2022-08-05T06:06:30+05:30 IST