సమస్యల్లో ‘న్యాయం’!

ABN , First Publish Date - 2021-09-05T07:10:05+05:30 IST

న్యాయ వ్యవస్థలో, న్యాయవాద వృత్తిలో మహిళలకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని.. ఈ పరిస్థితిని మార్చాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్షించారు...

సమస్యల్లో ‘న్యాయం’!

  • కోర్టుల్లో మౌలిక వసతులకు కొరత.. హైకోర్టుల్లో 41శాతం జడ్జి పోస్టులు ఖాళీ.. 
  • వాటిని భర్తీ చేయడం అతి పెద్ద సవాలు
  • దీనిపై అత్యవసరంగా దృష్టి సారించాలి
  • వసతుల కోసం జాతీయ కార్పొరేషన్‌
  • వారంలో కేంద్రానికి సవివర నివేదిక ఇస్తా
  • న్యాయ వ్యవస్థలో మరింతగా మహిళలు
  • ఖర్చు, సుదీర్ఘ ఎదురుచూపులే సమస్యలు
  • కార్పొరేటీకరణతో మరింత ఖరీదు
  • సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యలు
  • ఘనంగా సత్కరించిన బార్‌ కౌన్సిల్‌
  • న్యాయ మంత్రి, ఎస్జీ ప్రశంసలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థలో, న్యాయవాద వృత్తిలో మహిళలకు తగినంత ప్రాధాన్యం దక్కడం లేదని.. ఈ పరిస్థితిని మార్చాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. ఇటీవల కొంత ప్రయత్నం తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మహిళల వాటాను 11 శాతానికి పెంచగలిగామన్నారు. చీఫ్‌ జస్టి్‌సగా ఎంపికైన ఆయనను శనివారం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఢిల్లీలో ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కొరత, ఇబ్బందులపై వారంలోనే కేంద్రానికి ఒక సవివరమైన నివేదిక అందిస్తానని ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ చెప్పారు. ‘‘మౌలిక సదుపాయాల కొరత, సిబ్బంది కొరత, భారీ స్థాయిలో జడ్జి పోస్టులు ఖాళీలు... న్యాయ వ్యవస్థ ఇలాంటి అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. నిర్దిష్ట కాల పరిమితిలో కోర్టుల్లో వసతుల సమస్యను పరిష్కరిస్తాం. ఇందులో భాగంగానే జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం’’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో కలిపి 41 శాతం జడ్జిల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని భర్తీ చేయడం అతి పెద్ద సవాలు అని తెలిపారు. తాజాగా రికార్డు స్థాయిలో ఒకేసారి 12 కోర్టులకు 68 మంది జడ్జిలను నియమించాలని కొలీజియం చేసిన సిఫారసుల గురించి జస్టిస్‌ రమణ ప్రస్తావించారు.


‘‘తొమ్మిది మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై సిఫారసులను శరవేగంగా ఆమోదించిన ప్రధానికి ధన్యవాదాలు. ఇంతే వేగంగా హైకోర్టు జడ్జిల నియామక ప్రతిపాదనలనూ ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను’’ అని వేదికపైనే ఉన్న న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజుతో అన్నారు. కరోనాతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మాత్రమే వాదనలు వింటున్న నేపథ్యంలో... ‘డిజిటల్‌’ సదుపాయాలు లేక గ్రామీణ ప్రాంతాల్లోని న్యాయవాదులు తమ ఉపాధి కోల్పోతున్నారని జస్టిస్‌ రమణ చెప్పారు. మరోవైపు... పెద్ద లాయర్లు ఆన్‌లైన్‌లో వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. ‘‘ఒకప్పుడు న్యాయవాద వృత్తి ధనికులకు మాత్రమే అనుకునేవారు. ఇప్పుడు నెమ్మదిగా పరిస్థితి మారుతోంది. అసలు సమస్య ఏమిటంటే... న్యాయవాద వృత్తిలో స్థిరత్వం ఉంటుందని ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు’’ అని తెలిపారు. మరోవైపు... ఖర్చు, సుదీర్ఘ ఎదురు చూపుల కారణంగా ఇప్పటికీ లక్షలాది మంది న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడం లేదన్నారు. ఇప్పుడు న్యాయవాద వృత్తి కూడా ‘కార్పొరేట్‌’ అవుతోందని, న్యాయం మరింత ఖరీదైనది అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 


సరదా... సరదాగా!

‘‘నేను మొదటిసారి న్యాయమంత్రి కిరెన్‌ రిజిజును కలిసినప్పుడు... ఎవరో కాలేజీ స్టూడెంట్‌ అనుకున్నాను. అయితే... ఆయన వయసు మాత్రం అడగలేదులెండి’’ అని జస్టిస్‌ రమణ నవ్వుతూ చెప్పారు. ‘నాకు న్యాయవాద పట్టా ఉంది. కానీ... లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయలేదు’ అని అప్పట్లో రిజిజు చెప్పగా... ‘అయితే మీకు జడ్జిలపై కోపం ఉండదు’ అని జస్టిస్‌ రమణ సరదాగా అన్నారు. జడ్జిగాకంటే న్యాయవాదిగానే నేను ఎక్కువగా జీవితాన్ని ఎంజాయ్‌ చేశాను అని రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ఎంకే మిశ్రా న్యాయవాదుల కష్టాలన్నీ చెప్పుకొచ్చారు. దీనిపై తుషార్‌ మెహతా స్పందిస్తూ... ‘‘కోర్టు హాలులోనైనా, ఆడిటోరియంలోనైనా... మేం న్యాయవాదులుగా ఉపశమనమే (రిలీఫ్‌) కోరుకుంటాం!’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.


కొత్త అధ్యాయం లిఖిస్తారు: రిజిజు

భారత న్యాయ వ్యవస్థ సామాన్య పౌరులకు పెద్దపీట వేయాలని న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ఆకాంక్షించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ రమణ దేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తారంటూ ప్రశంసలు కురిపించారు. ఒక ప్రధాన న్యాయమూర్తిగా ఏంచేయాలో సరిగ్గా అవే చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో పెండింగ్‌ కేసులపై రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. కింది కోర్టుల్లో పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘ఒక సగటు పౌరుడు న్యాయ పోరాటంలో సర్వం కోల్పోతున్నాడు. ఒక్కోసారి ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. అందుకే... న్యాయ వ్యవస్థలో సాధారణ ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని రిజిజు నొక్కి చెప్పారు. దేశంలోని అన్ని కోర్టుల్లో ఒకేసారి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొలీజియం సిఫారసుల ఆమోదంపై సానుకూలంగా ఉంటామని ఆ తర్వాత రిజిజు మీడియాకు తెలిపారు.





జస్టిస్‌ రమణది బంగారంలాంటి మనసు. స్కూళ్లు, కాలేజీలు, వ్యాపార సంస్థలను తెరిచినప్పుడు కోర్టులను మాత్రం ఎందుకు తెరవరు... అని ఒక బాలిక చీఫ్‌ జస్టి్‌సకు లేఖ రాసింది. దీనిని ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించారు. త్వరలోనే విచారణ చేపడతారు.

- జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ (సుప్రీంకోర్టు)



ఒక రికార్డు తర్వాత మరో రికార్డును బద్దలుకొడుతున్న జస్టిస్‌ రమణను సచిన్‌ టెండుల్కర్‌తో పోల్చవచ్చు. ఆయన మంచి టీమ్‌ లీడర్‌. ఆయన రూపంలో సుప్రీంకోర్టుకు సమర్థ నాయకత్వం లభించిందని సామాన్యులు భావిస్తున్నారు. సామాన్యులకోసం అణగారిన వర్గాల కోసం ఆయన ఎంతో తపిస్తారు. తన సహచర న్యాయమూర్తులను సోదర భావంతో చూసే మానవతా మూర్తి. న్యాయమూర్తుల నియామకంలో ప్రతిభను మాత్రమే కాక వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించేలా చూశారు.

- జస్టిస్‌ బీఆర్‌ గవాయి, సుప్రీం న్యాయమూర్తి




జస్టిస్‌ రమణ ఒక మంచి న్యాయమూర్తిగా, అంతే మంచి మనిషిగా నాకు తెలుసు. ఆయనకు దేవుడిపట్ల భయమే కాదు.. ప్రేమ కూడా ఉందని చెప్పారు. న్యాయం విషయంలో నిష్పాక్షికంగా ఉం టారు. ఆయన ఒక కర్త. మా న్యాయవాద కుటుంబం నుంచే ఎదిగారు!

- తుషార్‌ మెహతా, సొలిసిటర్‌ జనరల్‌


జస్టిస్‌ రమణను తొలిసారి కలిసినప్పుడు ఆయన గురించి ఎక్కువగా తెలియదు. మీడియా ద్వారా, కొందరు మిత్రుల ద్వారా ఆయన గురించి విన్నాను. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న జస్టిస్‌ రమణ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తారు!

- కిరెన్‌ రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రి

Updated Date - 2021-09-05T07:10:05+05:30 IST